తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనలపై తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎలాంటి ముందస్తు సంప్రదింపులు లేకుండా ఒంటెత్తు పోకడలతో ఇంటర్ బోర్డును రద్దు చేయాలని చూస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు.
రేవంత్ గణాంకాలు తప్పుల తడక
దశాబ్దాలుగా కొనసాగుతున్న విద్యావ్యవస్థలో మార్పులు చేసే ముందు మేధావులు, విద్యావేత్తలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో విస్తృతంగా చర్చలు జరపాలని కవిత డిమాండ్ చేశారు. పరిపాలనాపరమైన సంస్కరణలను విద్యా సంస్కరణలుగా భావించవద్దని హితవు పలికిన ఆమె, ఈ ప్రక్రియకు కనీసం 3 నుంచి 10 ఏళ్ల సమయం పడుతుందని స్పష్టం చేశారు. డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయనే సాకుతో ఇంటర్ బోర్డును రద్దు చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్న గణాంకాలు పూర్తిగా తప్పులతడకగా ఉన్నాయని కవిత విమర్శించారు.
డ్రాప్ అవుట్స్ 16శాతమే..
పదో తరగతి తర్వాత పది మందిలో ఆరుగురు మాత్రమే ఇంటర్‌కు వెళ్తున్నారన్న వాదన కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పరిమితం కావొచ్చని, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మీద డ్రాప్ అవుట్స్ కేవలం 16 శాతంగానే ఉన్నాయని వివరించారు. ప్రభుత్వ బడుల్లో చదివిన పిల్లలు కూడా ఆ తర్వాత ప్రైవేట్ కళాశాలలు, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో చేరుతున్నారని తెలిపారు. ఒకవేళ ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉంటే అది కచ్చితంగా సర్కారు వైఫల్యమేనని ఆమె దుయ్యబట్టారు.
గ్రామీణ ప్రాంతాల్లో ముందు బస్సులు నడపండి..
నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం పేదరికం, ఆర్థిక ఇబ్బందులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సరైన బస్సు సౌకర్యం లేకపోవడమే విద్యార్థులు మధ్యలో చదువు మానేయడానికి ప్రధాన కారణాలని కవిత పేర్కొన్నారు. డ్రాప్ అవుట్లలో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులే ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధిగమించేందుకు గుజరాత్ ప్రభుత్వం 'నమో లక్ష్మి' పథకం ద్వారా ఏటా రూ.928 కోట్లను నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తూ డ్రాప్ అవుట్లను 16 శాతం తగ్గించిందని గుర్తుచేశారు. తెలంగాణలోనూ అలాంటి ఆర్థిక ప్రోత్సాహక పథకాలను అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు.
మత్తుకు బానిసవుతున్న యువత
బాలికలే ఎక్కువగా చదువు మానేస్తున్నారన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలను కవిత గణాంకాలతో సహా తిప్పికొట్టారు. పదో తరగతి తర్వాత ఇంటర్లో చేరుతున్న వారిలో బాలికలు 77.4 శాతం ఉండగా, బాలురు 68.4 శాతం మాత్రమే ఉన్నారని స్పష్టం చేశారు. పైగా అబ్బాయిలే 51 శాతం వరకు ఫెయిల్ అవుతున్నారని, గంజాయి వంటి మత్తుపదార్థాలకు బానిసలవ్వడం, చదువుపై నిర్లక్ష్యం వహించడమే ఇందుకు కారణమని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. విద్యావ్యవస్థను గాడిలో పెట్టే చర్యలు తీసుకోకుండా బోర్డును రద్దు చేస్తామనడం సరికాదని కవిత తేల్చిచెప్పారు.


