మలేషియా ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. భారత పర్యాటకులకు ఇప్పటివరకు అందిస్తున్న వీసా రహిత ప్రయాణ వెసులుబాటును నిలిపివేస్తూ షాకిచ్చింది. 2027 జనవరి 1వ తేదీ నుంచి భారతీయులు ఆ దేశంలోకి అడుగుపెట్టాలంటే ముందస్తుగా వీసా పొందడం తప్పనిసరి అని మలేషియా ఇమిగ్రేషన్ విభాగం స్పష్టం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం భారతీయులు ఎలాంటి వీసా లేకుండానే మలేషియాలో 30 రోజుల పాటు పర్యటించే అవకాశం ఉంది. అయితే ఈ ప్రత్యేక సదుపాయం 2026 డిసెంబర్ 31వ తేదీతో ముగియనుండటంతో, నూతన సంవత్సరం నుంచి పర్యాటకులు తప్పనిసరిగా వీసా నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.
కొత్త మార్గదర్శకాల మేరకు 2027లో మలేషియా పర్యటనకు వెళ్లాలనుకునే భారతీయులు 2026 డిసెంబర్ 1 నుంచే వీసా కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం మలేషియా ప్రభుత్వ అధికారిక 'MyVISA' పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. పర్యాటక రంగ ప్రోత్సాహం కోసం కల్పించిన ఈ వీసా రహిత సదుపాయాన్ని కొందరు తీవ్రంగా దుర్వినియోగం చేస్తుండటమే మలేషియా ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
పర్యాటక ప్రయాణం పేరుతో మలేషియాకు వచ్చి అక్రమంగా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని కౌలాలంపూర్లోని భారత హైకమిషన్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. నకిలీ ఏజెంట్ల మాయమాటలు, తప్పుడు హామీలను నమ్మి అక్కడికి వెళ్లిన భారతీయులు చట్టపరమైన చిక్కులు, నిర్బంధం, దోపిడీ వంటి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోందని హైకమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. 30 రోజుల వీసా రహిత ప్రయాణం కేవలం విహారయాత్రలకు మాత్రమేనని, ఉపాధి అవసరాలకు ఎంతమాత్రం కాదని అధికారులు తేల్చిచెప్పారు.
ఇకపై మలేషియా పర్యటనకు వెళ్లే ప్రయాణికులు కనీసం ఆరు నెలల చెల్లుబాటు ఉన్న పాస్పోర్ట్, తిరుగు ప్రయాణ (రిటర్న్) విమాన టికెట్, హోటల్ బుకింగ్ ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా సిద్ధంగా ఉంచుకోవాలి. వీటితో పాటు ప్రయాణానికి మూడు రోజుల ముందుగానే 'మలేషియా డిజిటల్ అరైవల్ కార్డ్' (MDAC)ను ఆన్లైన్లో సమర్పించడం అత్యవసరమని ఇమిగ్రేషన్ విభాగం స్పష్టం చేసింది.
