Tollywood: మన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అటువంటి అరుదైన కాంబినేషన్ మళ్ళీ మన ముందుకు రాబోతోంది. దాదాపు, 29 ఏళ్ల తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ కలిసి ఓ సినిమా కోసం పనిచేశారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆ సినిమానే ‘మైసా’. ఈ సినిమా కోసం వీరిద్దరు చేతులు కలపడం ఇప్పుడు టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది.
విప్లవ గీతాలకు, యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజానికాన్ని కదిలించే పాటలకు సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ కి ఓ ప్రత్యేకమైన పేరుంది. అలాగే, తన కలంతో అద్భుతమైనటువంటి భావాలను పలికించగల సాయిత్య రచయిత సుద్దాల అశోక్ తేజకు ప్రత్యేకమైన శైలి ఉందని అందరికీ తెలిసిందే. అయితే, వీరిద్దరి కాంబోలో రాబోతున్న పాట కూడా పవర్ఫుల్ విప్లవ గీతంగా ఉండబోతోందని తెలుస్తోంది.
మైసా రష్మిక కెరీర్లో ప్రత్యేకమైన సినిమా!
యువ దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న ‘మైసా’ మూవీలో రష్మిక మందన్న గోండ్ గిరిజన మహిళ పాత్రలో నటించింది. ఇటీవలే వచ్చిన టీజర్ చూస్తే అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడే మహిళగా ఆమె పాత్రను తీర్చిదిద్దారని అర్థమైంది. ఇక, ఇప్పటికే విడుదలైన ‘ఓ మైసా రే’ పాటకు సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించారు. ఈ పాటకు జేక్స్ బిజోయ్ సంగీతమందించాడు.
ఇక, ఇప్పుడు సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్, సుద్దాల అశోక్ తేజ కలయికలో మరో విప్లవ గీతం రాబోతుండటంతో మైసా మూవీపై విపరీతమైన ఆసక్తి పెరిగింది. 29 ఏళ్ల తర్వాత, ఈ ఇద్దరు దిగ్గజాలు అందించబోతున్న పాట ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. కాగా, రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అన్‌ఫార్ములా ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. నవంబర్ 27న థియేట్రికల్ రిలీజ్‌కి రానుంది. ఈ మధ్య రష్మిక నటించిన సినిమాలు ఆశించిన విజయాలు అందివ్వలేదు. మరి, మైసా ఆ లోటును తీరుస్తుందేమో.
