జాతీయం

India Nepal: ప్రధాని మోదీతో నేపాల్ ప్రధాని బాలేన్ షా భేటీ.. ద్వైపాక్షిక చర్చలు షురూ!

భారత్, నేపాల్ దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగు పడింది. రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆదివారం భారత్‌కు చేరుకున్న నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర (బాలేన్) షా, న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో నేడు(సోమవారం) భారత ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు ప్రారంభించారు.

 భారత్, నేపాల్ దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగు పడింది. రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆదివారం భారత్‌కు చేరుకున్న నేపాల్ ప్రధానమంత్రి(Nepal PM) బాలేంద్ర (బాలేన్) షా, న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో నేడు(సోమవారం) భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)తో ద్వైపాక్షిక చర్చలు ప్రారంభించారు. అంతకుముందు ఉదయం రాష్ట్రపతి భవన్(Rastrapati bhavan) ప్రాంగణంలో నేపాల్ ప్రధానికి ప్రధాని మోదీ ఘన స్వాగతం పలకగా, సాయుధ దళాల గౌరవ వందనం సమర్పించాయి.

 అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) తో మర్యాదపూర్వకంగా సమావేశమైన బాలేన్ షా, ఆ తర్వాత హైదరాబాద్ హౌస్‌లో మోదీతో విస్తృత స్థాయి చర్చల్లో పాల్గొన్నారు. ఈ కీలక భేటీ సందర్భంగా ఇరు దేశాల మధ్య రవాణా, సాంస్కృతిక అనుసంధానానికి భారీ ఊతమిచ్చే రెండు ప్రధాన ప్రాజెక్టులను ప్రధాని మోదీ, నేపాల్ ప్రధాని బాలేన్ షా వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ఉత్తరప్రదేశ్‌(UP)లోని అయోధ్య నుంచి నేపాల్‌లోని జనక్‌పూర్ ధామ్ వరకు నడిచే నూతన వారంతపు రైలు సర్వీసు 'సరయూ-కమల ఎక్స్‌ప్రెస్'(Sarayu-Kamala Express)ను ఇరువురు నేతలు పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు.

 దీనికి తోడు ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లా ధార్చులా తహసీల్‌లో కాళీ నదిపై నిర్మించిన 'చార్చుమ్ అంతర్జాతీయ మోటార్ వంతెన'ను సైతం ప్రారంభించనున్నారు. ఈ రైలు, రహదారి మార్గాల అనుసంధానం వల్ల ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సామాజిక, సాంస్కృతిక, వాణిజ్య బంధాలకు కొత్త ఉత్తేజం లభించనుంది.

 హైదరాబాద్ హౌస్‌లో జరుగుతున్న ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ఇరు దేశాల ప్రధానులు భారత్-నేపాల్ సంబంధాల సమగ్ర పురోగతిని సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా ఇంధన రంగం, జలవిద్యుత్ ప్రాజెక్టులు, ద్వైపాక్షిక వాణిజ్యం, మౌలిక సదుపాయాల కల్పన, సరిహద్దు కనెక్టివిటీ వంటి కీలక అంశాలతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అంతకుముందు ఆదివారం విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో సమావేశమైన బాలేన్ షా.. వాణిజ్యం, రవాణా, విద్య, ఇంధన సహకారం, ప్రజల మధ్య సంబంధాల బలోపేతంపై చర్చించారు.

 ఇరు దేశాల మధ్య వాణిజ్యం, అభివృద్ధి భాగస్వామ్యం, జలవనరులు, డిజిటల్ కనెక్టివిటీ రంగాల్లో సహకారం గణనీయంగా పెరిగిందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. స్టార్టప్‌లు, సాంకేతిక ఆవిష్కరణలు, క్రీడల వంటి నూతన రంగాల్లోనూ ఇరు దేశాల భాగస్వామ్యం విస్తరిస్తోందని పేర్కొంది. భారత్ అనుసరిస్తున్న 'నైబర్‌హుడ్ ఫస్ట్' (పొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యం) విధానంలో భాగంగా నేపాల్‌కు ఇస్తున్న అత్యున్నత ప్రాధాన్యతకు బాలేంద్ర షా పర్యటన అద్దం పడుతోందని, ఈ భేటీ ద్వారా ద్వైపాక్షిక భాగస్వామ్యం మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని విదేశాంగ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.

తర్వాత చదవండి