తెలంగాణలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) పేరిట ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన రైస్ మిల్లర్ల అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అక్రమాలకు పాల్పడిన మిల్లులపై ప్రత్యేక దృష్టి సారించిన ఈడీ అధికారులు, మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద మరిన్ని కొత్త కేసులను నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపు రూ.6,700 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టినట్లు ఈడీ ప్రాథమికంగా అంచనా వేసింది.
ఈ భారీ కుంభకోణం ద్వారా అక్రమంగా ఆర్జించిన సొమ్మును ఎటు మళ్లించారు, ఎవరెవరి ఖాతాల్లోకి నగదు చేరిందనే కోణంలో లోతైన విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు సంబంధించిన రైస్ మిల్లులతో పాటు ఆమె నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ తనిఖీల్లో సుమారు రూ.30లక్షల నగదు, అత్యంత కీలకమైన ఆర్థిక లావాదేవీల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాజాగా ఏఆర్ఎస్ (ARS) ఇండస్ట్రీస్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర బడా రైస్ మిల్లులపైనా ఈడీ తన నిఘాను పెంచింది. రాష్ట్ర పోలీసు విభాగం, విజిలెన్స్ అధికారుల వద్ద ఇప్పటికే నమోదైన క్రిమినల్ కేసుల ఎఫ్ఐఆర్ల వివరాలను ఈడీ సేకరించి ఆయా మిల్లుల యజమానుల ఆర్థిక మూలాలను జల్లెడ పడుతోంది. పౌరసరఫరాల శాఖ రికార్డుల ఆధారంగా ఈడీ అధికారులు అక్రమాల లెక్కలను పక్కాగా తేలుస్తున్నారు. ప్రభుత్వం మిల్లర్లకు కేటాయించిన ధాన్యం ఎంత, దానికి బదులుగా తిరిగి ప్రభుత్వానికి అప్పగించిన బియ్యం ఎంత అనే వివరాలపై ఆరా తీస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 300 రైస్ మిల్లుల్లో విజిలెన్స్ బృందాలు తనిఖీలు చేపట్టగా, మొత్తంగా మూడు వేలకు పైగా రైస్ మిల్లుల పూర్తి వివరాలను ఈడీ అధికారులు సేకరించారు. నిబంధనలకు విరుద్ధంగా ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించుకుని సొమ్ము చేసుకున్న మిల్లర్ల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ధాన్యం మళ్లింపు ద్వారా అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన స్థిర, చరాస్తులను గుర్తించే ప్రక్రియను ఈడీ వేగవంతం చేసింది. అక్రమ సంపాదనతో కూడబెట్టిన ఆస్తులను త్వరలోనే జప్తు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
