వ్యాపారం

Gold Loan: గోల్డ్‌లోన్ తీసుకున్న వారికి షాక్.. ఖాతాదారులకు బ్యాంకుల నోటీసులు!

దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు గరిష్ఠ స్థాయిల నుంచి భారీగా పతనం కావడం కొత్తగా ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఊరటనిస్తున్నప్పటికీ, బంగారం తాకట్టు పెట్టి రుణాలు (Gold Loans) తీసుకున్న ఖాతాదారులకు మాత్రం తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతోంది.

దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు గరిష్ఠ స్థాయిల నుంచి భారీగా పతనం కావడం కొత్తగా ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఊరటనిస్తున్నప్పటికీ, బంగారం తాకట్టు పెట్టి రుణాలు (Gold Loans) తీసుకున్న ఖాతాదారులకు మాత్రం తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. తనఖా పెట్టిన బంగారం మార్కెట్ విలువ గణనీయంగా తగ్గిపోవడంతో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ (NBFC) ఆర్థిక సంస్థలు రుణగ్రహీతలకు 'మార్జిన్ కాల్' నోటీసులు జారీ చేస్తున్నాయి.

 బకాయి ఉన్న రుణ మొత్తంలో కొంత భాగాన్ని తక్షణమే చెల్లించాలని, లేనిపక్షంలో తగ్గిన విలువకు సమానంగా అదనపు నగదు జమ చేయడమో లేదా మరింత బంగారాన్ని అదనపు తనఖాగా పెట్టడమో చేయాలని ఆయా సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. గత కొన్ని నెలల క్రితం పసిడి ధరలు ఆల్-టైమ్ రికార్డు స్థాయిలో ఉన్న సమయంలో గరిష్ఠ పరిమితి మేరకు రుణాలు తీసుకున్న వారిపై ఈ ధరల తగ్గుదల ప్రభావం తీవ్రంగా పడింది.

 ఆర్బీఐ నిబంధనలు ఇవే..

మార్కెట్ ధరలు పడిపోవడంతో తనఖా పెట్టిన ఆభరణాల విలువకు, తీసుకున్న రుణ మొత్తానికి మధ్య ఉండే లోన్-టు-వాల్యూ (LTV) నిష్పత్తి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిర్దేశించిన పరిమితిని దాటిపోతోంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రూ. 2.5 లక్షల వరకు తీసుకునే రుణాలకు 85 శాతం, రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు రుణాలకు 80 శాతం, రూ. 5 లక్షల కంటే ఎక్కువ రుణాలకు 75 శాతం మేర ఎల్టీవీ నిష్పత్తిని రుణ కాలపరిమితి ముగిసేవరకు తప్పనిసరిగా కొనసాగించాల్సి ఉంటుంది.

రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పడిపోతే రుణ రికవరీ ప్రక్రియ కష్టతరంగా మారుతుందనే ఆందోళనతో బ్యాంకులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. తనఖా ఆస్తుల (కొలేటరల్) విలువ తగ్గడం ప్రస్తుతం ఆర్థిక సంస్థలకు పెద్ద సవాలుగా మారిందని ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ప్రతినిధి మయాంక్ శర్మ అభిప్రాయపడ్డారు. ఇటీవలి ధరల తగ్గుదల తర్వాత బకాయిల వసూలు కోసం వేలం ప్రక్రియలు పెరిగినట్లు ఇండెల్ మనీ సీఈఓ ఉమేష్ మోహనన్ వెల్లడించారు.

 ఆందోళనలో గోల్డ్ లోన్ ఖాతాదారులు

గరిష్ఠ పరిమితికి లోబడి రుణాలు పొందిన సామాన్య, మధ్యతరగతి ఖాతాదారులకు ఈ ఆకస్మిక పరిణామాలు పెను భారంగా మారాయి. బ్యాంకులు పంపిన నోటీసులకు స్పందించి నిర్ణీత గడువులోగా బకాయిలు చెల్లించకపోయినా లేదా మార్జిన్ మొత్తాన్ని సర్దుబాటు చేయకపోయినా, ఆర్బీఐ నిబంధనలకు లోబడి పారదర్శక పద్ధతిలో ఆభరణాలను వేలం వేసేందుకు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో కొనసాగుతున్న ఈ ఒడిదుడుకులు లక్షలాది మంది గోల్డ్ లోన్ ఖాతాదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

తర్వాత చదవండి