Food Poison: సంగారెడ్డి జిల్లా ఆంధోల్ మండలం జోగిపేట ఎస్పీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. ఉదయం విద్యార్థినులు పులిహోర తిన్నారు. ఆ తర్వాత ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పులిహోర తిన్న విద్యార్థినులు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డారు. వాంతులు కూడా చేసుకున్నారు. దీంతో విద్యార్థినులను వెంటనే జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కొన్ని రోజులుగా పురుగుల అన్నమే పెడుతున్నారని కంటతడి
ఫుడ్ పాయిజన్ విషయం తెలుసుకున్న ఆర్డీవో, ఎంఆర్ ఓ, మున్సిపల్ కమిషనర్, ఎస్ఐ ఆసుపత్రికి చేరుకున్నారు. డాక్టర్లతో మాట్లాడి విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ఆ తర్వాత బాధిత విద్యార్థులతోనూ వారు మాట్లాడారు. అధికారులను చూడగానే విద్యార్థులు కంటతడి పెట్టారు.
కొన్ని రోజులుగా హాస్టల్ లో పురుగుల అన్నమే పెడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం గురించి హాస్టల్ వార్డన్ కు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ వార్డన్ తీరుపై విద్యార్థినుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి హాస్టల్ లో తనిఖీలు నిర్వహించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
నాణ్యత లేని ఆహారం
మరోవైపు హాస్టల్లో నాణ్యత లేని ఆహారాన్ని పిల్లలకు పెడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. అంతేకాదు అస్వస్థతకు గురైన తమ పిల్లలను ఆసుపత్రికి తరలించకుండా నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. పిల్లలు అస్వస్థతకు గురయ్యారని తెలియగానే హాస్టల్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. విషయం బయటకు పొక్కకుండా సిబ్బంది హాస్టల్ తలుపులు మూసివేసి మిగిలిన ఆహారాన్ని పారబోసి వంట పాత్రలను శుభ్రం చేసినట్లు సమాచారం. తహసీల్దార్, ఎస్ఐ వచ్చినా అరగంట వరకు హాస్టల్ తలుపులు తీయలేదని తెలుస్తోంది.
చిన్న చిన్న పరుగులు వస్తుంటాయి.. సర్దుకుపోవాలని హుకుం..
''పులిహోర పెట్టారు. అందులో మొత్తం పురుగులే ఉన్నాయి. ఎవరూ తినలేదు. కొందరు తిన్నారు. వారికేమో ఇలా అస్వస్థతకు గురయ్యారు. కొందరు తినకుండా పడేశారు. మూడు నాలుగు రోజుల నుంచి పురుగుల అన్నమే పెడుతున్నారు. మేడమ్ కు ఫిర్యాదు చేస్తే.. మేడమ్ వార్డెన్ ను సపోర్ట్ చేసింది. చిన్న చిన్న పురుగులు వస్తుంటాయి, సర్దుకుపోవాలని చెప్పింది. ఒకరిద్దరికి వస్తే అడ్జస్ట్ చేసుకోగలం. అందరికీ పులిహోరలో ఈరోజు పురుగులే వచ్చాయి. దీని గురించి ఫిర్యాదు చేస్తే మీరు హాస్టల్ కు చదువుకోవడానికి వచ్చారా? లేక ఇలా ఇతర పనులు చేసేందుకు వచ్చారా? అని ప్రశ్నిస్తున్నారు. హాస్టల్ అన్నాక కొంచెం అటు ఇటు జరుగుతుంటాయి, అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పారు. ఫుడ్ అసలేమీ బాగుండదు. ఇక నీళ్లు కూడా సరిగ్గా రావడం లేదు'' అని బాధిత విద్యార్థినులు వాపోయారు.
