రాజకీయాలు

Chinnareddy : రేవంత్ అవినీతి రూ. లక్ష కోట్లు దాటింది.. సోనియాకు చిన్నారెడ్డి లేఖ!

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు క్రమంగా పెరుగుతున్నాయి. సీఎం రేవంత్ ప్రభుత్వంపై ఓవైపు ఎమ్మెల్యేలు,మరోవైపు పార్టీని అంటి పెట్టుకుని ఎంతో కాలంగా ఉంటున్న సీనియర్లు సైతం పెదవి విరుస్తున్నారు. కొందరు మంత్రి పదవులు దక్కలేదని, మరికొందరు పార్టీలో తమకు ప్రాధాన్యం లేకుండా పోయిందని, అధికారులు,నేతలు ఎవరూ తమ మాట వినడం లేదని అసంతృప్తి రాగాన్ని పెంచుతున్నారు.

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు క్రమంగా పెరుగుతున్నాయి. సీఎం రేవంత్ ప్రభుత్వంపై ఓవైపు ఎమ్మెల్యేలు,మరోవైపు పార్టీని అంటి పెట్టుకుని ఎంతో కాలంగా ఉంటున్న సీనియర్లు సైతం పెదవి విరుస్తున్నారు. కొందరు మంత్రి పదవులు దక్కలేదని, మరికొందరు పార్టీలో తమకు ప్రాధాన్యం లేకుండా పోయిందని, అధికారులు,నేతలు ఎవరూ తమ మాట వినడం లేదని అసంతృప్తి రాగాన్ని పెంచుతున్నారు. నేతలు నోరుజారొద్దని టీపీసీసీ, ఏఐసీసీ ఎన్నిమార్లు హెచ్చరికలు పంపినా అధికార పార్టీ నేతలు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు.

బాంబ్ పేల్చిన చిన్నారెడ్డి..

కాంగ్రెస్ పార్టీలో తాజాగా నెలకొన్న పరిస్థితులపై మాజీ మంత్రి, తెలంగాణ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన పూర్తి వివరాలతో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖరాసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి అవినీతి రూ.లక్ష కోట్లు దాటిందని సీనియర్ కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి సోనియా గాంధీకి లేఖ రాయడం సొంత పార్టీలోనే కలకలం రేపింది.

ముఖ్యమంత్రి వద్దే విద్యా, మున్సిపల్, హోంశాఖలు ఉన్నాయి. అవన్నీ అవినీతితో నిండిపోయాయని, ఆర్ఆర్ టాక్స్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారని లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర గృహ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి అడ్డగోలుగా భూములు దోచుకుంటున్నారని చిన్నారెడ్డి ఆరోపించారు.

స్వయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులైన ఇద్దరూ రూ.వేల కోట్ల భూములను దోచేస్తున్నారని, బీజేపీకి తెలంగాణలో 8 ఎంపీ సీట్లు రావడానికి కారణం రేవంత్ రెడ్డే అని.. ఆయన బీజేపీ కోవర్ట్ అని లేఖలో సంచలన ఆరోపణలు చేశారు. మాజీమంత్రి జీవన్ రెడ్డి లాంటి ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను పార్టీ నుంచి బయటికి పంపిస్తున్నాడని, ఈ విషయంలో వెంటనే అధిష్ఠానం జోక్యం చేసుకోకపోతే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం కష్టమే అని చిన్నారెడ్డి స్పష్టంచేసినట్టు తెలిసింది. కాగా, చిన్నారెడ్డి లేఖపై ఏఐసీసీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.

ఓవైపు ఎమ్మెల్యేలు అనిరుధ్ రెడ్డి, మరోవైపు రాజగోపాల్ రెడ్డిలు ఇప్పటికే సీఎం రేవంత్ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకరు నిధుల కోసం మరొకరు నిధులు, మంత్రి పదవి రాలేదనే అసహనంతో సొంత పార్టీపైనే విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. తాజాగా చిన్నారెడ్డి ఏకంగా సోనియా గాంధీకి సీఎంకు వ్యతిరేకంగా లేఖ రాయడంతో ఏం జరుగుతుందోననే చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికల నాటికి ముఖ్యమంత్రి అభ్యర్థి రేసు నుంచి రేవంత్ రెడ్డిని జరుపుతారా? లేదా ఆయనపై సంచలన ఆరోపణలు చేస్తున్న నేతల మీదే వేటు పడుతుందా? అనేది తెలియాల్సి ఉంది. కాగా, గతంలో చిన్నారెడ్డి సీఎం రేవంత్ మీద ఆరోపణలు చేయడంతో ఆయన్ను కనీసం వివరణ అడగకుండానే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే.

తర్వాత చదవండి