తెలంగాణలో భూ రికార్డుల ప్రక్షాళన కోసం తీసుకువచ్చిన 'భూ భారతి' పోర్టల్ సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు సాగిస్తున్న భారీ భూదందా సంచలనం సృష్టిస్తోంది. రిటైర్డ్ ఉన్నతాధికారులు, ప్రవాస భారతీయులు (NRI), స్థానికంగా నివాసం ఉండని భూ యజమానులే లక్ష్యంగా ఓ ముఠా ఏకంగా వెబ్సైట్ను హ్యాక్ చేసి యాజమాన్య హక్కులను తారుమారు చేసింది. ఈ క్రమంలో ఏకంగా ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భూమినే కాజేసేందుకు ప్రయత్నించడం, రెవెన్యూ అధికారుల సహకారంతోనే ఈ కుంభకోణం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతుండటం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం సంగుపేట పరిధిలోని సర్వే నంబర్ 329/2లో ఉన్న 4.27 ఎకరాల వ్యవసాయ భూమిని మాజీ ఐపీఎస్ అధికారి ఈశ్ కుమార్ సుమారు 18 ఏళ్ల క్రితం కొనుగోలు చేసి తన ఆధీనంలో ఉంచుకున్నారు. అయితే ఇటీవల ఆ భూమి పక్కన ఓ వ్యక్తి ఫంక్షన్ హాల్ నిర్మిస్తూ సమీపంలోని అసైన్డ్ భూమిని ఆక్రమిస్తున్నాడని స్థానిక రైతులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. సర్వే కోసం వచ్చిన అధికారులు అసైన్డ్ భూమి హద్దులు నిర్ణయిస్తూ, పక్కనే ఉన్న 4.27 ఎకరాల భూమి 'మీర్ మురాద్ అలీ' పేరు మీద రికార్డుల్లో నమోదై ఉందని చెప్పడంతో రైతులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అది రిటైర్డ్ ఐపీఎస్ ఈశ్ కుమార్ భూమి అని రైతులు తెలపడంతో అసలు కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
ఈ విషయం తెలుసుకున్న మాజీ ఐపీఎస్ ఈశ్ కుమార్ తక్షణమే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో సీఐడీ (CID) రంగంలోకి దిగింది. లోతైన దర్యాప్తు చేపట్టిన సీఐడీ అధికారులు మీర్ మురాద్ అలీ పేరిట ఈశ్ కుమార్ భూమితో పాటు సంగారెడ్డిలో మరో 28 గుంటలు, కొల్లూరులో 4 ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించారు. అంతేకాకుండా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఇదే తరహాలో కోట్లాది రూపాయల విలువైన భూముల రికార్డులు తారుమారైనట్లు తేల్చి, ఈ ముఠాకు చెందిన 9 మంది సభ్యులను అరెస్ట్ చేశారు. అనంతరం రెవెన్యూ అధికారులు ఈశ్ కుమార్ 4.27 ఎకరాలతో పాటు అక్రమార్కులు కాజేసిన ఇతర భూములను తిరిగి అసలైన యజమానుల పేరిట రికార్డుల్లో పునరుద్ధరించారు.
కేవలం వెబ్సైట్ను సాంకేతికంగా హ్యాక్ చేయడం వల్ల మాత్రమే ఇంత పెద్ద స్థాయి కుట్ర సాధ్యం కాదని, దీని వెనుక కచ్చితంగా కొందరు రెవెన్యూ అధికారుల అంతర్గత సహకారం ఉండి ఉంటుందని సీఐడీ బలంగా అనుమానిస్తోంది. మరోవైపు ఈశ్ కుమార్ ఉన్నత స్థాయి పరిచయాలు కలిగిన మాజీ ఐపీఎస్ అధికారి కావడంతో ఫిర్యాదు చేసిన వెంటనే సమస్య పరిష్కారమైందని, మరి ఇదే తరహా మోసాలకు గురవుతున్న సామాన్య ప్రజలు, రైతుల భూములకు రక్షణ ఎక్కడుందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
