తెలంగాణ

మెటా ఆఫీసుపై కాంగ్రెస్ దండయాత్ర.. హైదరాబాద్ బ్రాండ్‌పై రాజకీయ యుద్ధం!.. అసలేం జరిగింది..?

హైదరాబాద్ మెటా కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి పెద్ద వివాదానికి దారి తీసింది. సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేశారనే కారణంతో మెటాపై ఎటాక్ చేశారు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు. దీనిపై బీజేపీ, బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

మెటా వర్సెస్ కాంగ్రెస్

సోషల్ మీడియా ఖాతాలపై ఆంక్షలతో మొదలైన వివాదం..

మెటా కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తల హంగామా

హైదరాబాద్‌ మెటా కార్యాలయంలో పూలకుండీలు ధ్వంసం..

కాంగ్రెస్ తీరుపై బీజేపీ, బీఆర్ఎస్ ఫైర్..

పెట్టుబడులపై ప్రభావం పడుతుందంటూ ఆందోళన

విదేశీ సంస్థలు వ్యాపారం చేయాలి.. రాజకీయాలు కాదు: అఖిలేష్ యాదవ్

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఒక్క రోజులో వచ్చింది కాదు. ఇది ఎన్నో రోజుల కష్టం. ఎంతో మంది నాయకుల కష్టం. దేశంలోని ఐటీ రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన నగరం హైదరాబాద్. ప్రపంచ దిగ్గజ టెక్నాలజీ సంస్థలకు కేంద్రంగా ఎదిగిన నగరం. అలాంటి హైదరాబాద్‌లో ఇప్పుడు ఓ అంతర్జాతీయ సంస్థ కార్యాలయం రాజకీయ నిరసనలకు వేదికైంది. సోషల్ మీడియా ఖాతాలపై ఆంక్షలు విధించారంటూ మెటా ఆఫీసులోకి ప్రవేశించిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలతో హల్చల్ చేశారు. పూలకుండీలు ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త వివాదం మొదలైంది. సోషల్ మీడియా స్వేచ్ఛ కోసం పోరాటమా? లేక నిరసన పేరుతో ప్రైవేట్ సంస్థలపై దాడి చేయడమా? ఇప్పుడు ఇదే ప్రశ్న రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది.

వివాదం ఎక్కడ మొదలైంది..?

ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్, జాతీయ ఇన్‌ఛార్జ్ మనీష్ శర్మకు చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై మెటా ఆంక్షలు విధించింది. కొన్ని పోస్టులను కూడా తొలగించిందని యూత్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ రెండు ఖాతాలపై భారత ఐటీ నిబంధనల కింద ఆంక్షలు విధించినట్లు తమకు సమాచారం వచ్చిందని పేర్కొన్న యూత్ కాంగ్రెస్.. అసలు ఎవరి ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు? ఏ కారణాలతో ఖాతాలను నిలిపివేశారు? అనే ప్రశ్నలు లేవనెత్తింది.

ప్రతిపక్ష నేతల గొంతుకలను అణచివేసేందుకు బీజేపీ ప్రభుత్వం సోషల్ మీడియా సంస్థలపై ఒత్తిడి తెస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష నేతల ఖాతాలను లక్ష్యంగా చేసుకుంటోందని మెటాపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని రాయదుర్గం ప్రాంతంలో ఉన్న మెటా కార్యాలయానికి చేరుకున్నారు.

నిరసన నుంచి విధ్వంసం వరకు!.. సీన్ టు సీన్

దాదాపు 25 మంది కార్యకర్తలు ప్లకార్డులతో కార్యాలయ ప్రాంగణంలోకి ప్రవేశించి మెటాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు కార్యాలయ కారిడార్లలో పరుగులు తీశారు. మరికొందరు క్యాఫెటేరియా ప్రాంతంలో హంగామా చేశారు. పూలకుండీని నేలకేసి కొట్టిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఐతే.. యూత్ కాంగ్రెస్ నేతల వాదన మరోలా ఉంది. మెటా కార్యాలయానికి వెళ్లి తమ అభ్యంతరాలను తెలియజేయాలనుకున్నామని, తమకు లోపలికి పర్మిషన్ ఇవ్వలేదని రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు తమను అదుపులోకి తీసుకున్నారని ఆయన చెబుతున్నారు. మరోవైపు పోలీసులు సుమారు 21 మందిని అరెస్ట్ చేశారు. మూడు గంటల తర్వాత బెయిల్ ష్యూరిటీలు సమర్పించడంతో విడుదల చేశారు. మెటా అధికారులు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, పూలకుండీ ధ్వంసం జరిగిన ప్రాంతం సంస్థ ప్రధాన కార్యాలయ భవనం బయటదని పోలీసు వర్గాలు తెలిపాయి.

మెటాకు 7 రోజుల డెడ్‌లైన్!

ఈ ఘటనతో ఆగకుండా ఇండియన్ యూత్ కాంగ్రెస్ మెటాకు ఏడు రోజుల అల్టిమేటం జారీ చేసింది. తమ నేతల ఖాతాలపై ఆంక్షలు తొలగించాలని, తొలగించిన పోస్టులను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. మెటా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా స్వతంత్రంగా వ్యవహరించాలని హెచ్చరించింది. 7 రోజుల్లో తమ డిమాండ్లు నెరవేర్చకపోతే కోర్టుల్లోనూ, రోడ్లపైనా, మెటా కార్యాలయాల వద్ద కూడా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించింది. హైదరాబాద్‌తో పాటు ముంబై, గురుగ్రామ్‌లోనూ యూత్ కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది.

మరోవైపు తమ నిరసనల తర్వాత జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్, జాతీయ ఇన్‌ఛార్జ్ మనీష్ శర్మ ఖాతాలు యాక్టివేట్ అయ్యాయని యూత్ కాంగ్రెస్ ప్రకటించింది. అయితే ఆంక్షలు ఎందుకు విధించారు? వాటిని తొలగించడానికి మెటా తీసుకున్న నిర్ణయం వెనుక కారణాలేంటి? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

బీజేపీ ఎదురుదాడి.. కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు

మెటా కార్యాలయంలో జరిగిన ఘటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్‌ను గూండాల పార్టీగా అభివర్ణిస్తూ బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ విమర్శలు చేశారు. ప్రైవేట్ ఆఫీసులను ధ్వంసం చేయడమే కాంగ్రెస్ మోడలా? అంటూ ప్రశ్నించారు. గతంలో వరల్డ్ ఏఐ సమ్మిట్ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన నిరసనను కూడా ప్రస్తావించారు.

ముఖ్యంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేలా కాంగ్రెస్ కార్యకర్తలు వ్యవహరించారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దశాబ్దాలుగా హైదరాబాద్‌ను అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వాలు, పారిశ్రామికవేత్తలు కృషి చేశారని గుర్తుచేస్తున్నారు.

బీఆర్ఎస్ మాట కూడా అదే...

ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసింది. తమ పార్టీకి చెందిన పలు సోషల్ మీడియా ఖాతాలను కూడా మెటా గతంలో ఏకపక్షంగా నిలిపివేసిందని, అయితే తాము చట్టపరమైన మార్గంలో పోరాడామని గుర్తు చేస్తున్నారు. అంతర్జాతీయ సంస్థల కార్యాలయాలపై ఇలాంటి దాడులు జరిగితే పెట్టుబడిదారులు భయపడతారని హెచ్చరిస్తున్నారు.

మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ ఘటనపై స్పందించారు. హైదరాబాద్‌లో మెటాకు దేశంలోనే అతిపెద్ద క్యాంపస్ ఉందని, సురక్షితమైన వ్యాపార వాతావరణంపై నమ్మకంతోనే సంస్థ ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు.

మెటా కార్యాలయంలో జరిగిన ఘటన కేవలం ఫిజికల్ డ్యామేజీ మాత్రమే కాదని, హైదరాబాద్ బ్రాండ్‌పై ఉన్న నమ్మకాన్ని కూడా దెబ్బతీసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లలో మెటా వంటి అంతర్జాతీయ సంస్థను హైదరాబాద్‌కు తీసుకొచ్చిందా? అంటూ ప్రశ్నించారు. కంపెనీలను భారత్‌కు తీసుకురావడానికి విధ్వంసమే మార్గమా? అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రశ్నించారు.

కాంగ్రెస్ కు మద్దతుగా అఖిలేష్ యాదవ్

ఈ వివాదంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా స్పందించారు. విదేశీ సంస్థలు మన దేశంలో వ్యాపారం చేసుకోవాలే తప్ప రాజకీయాలు చేయకూడదని అన్నారు. అందరినీ సమానంగా చూడటమే ఒక మంచి సంస్థకు ఉండాల్సిన లక్షణమని పేర్కొన్నారు. అదే సమయంలో విదేశీ సంస్థల వ్యాపార వ్యవహారాల్లో ప్రభుత్వం కూడా అనవసరమైన రాజకీయ ఒత్తిళ్లు తీసుకురాకూడదని హితవు పలికారు.

అఖిలేష్ వ్యాఖ్యలు ఈ వివాదంలో మరో కోణాన్ని తెరపైకి తీసుకొచ్చాయి. సోషల్ మీడియా సంస్థలు రాజకీయాలకు దూరంగా ఉండాలన్నది ఒక వాదన అయితే.. వాటి నిర్ణయాల్లో పారదర్శకత, సమానత్వం ఉండాలన్నది మరో వాదనగా మారింది.

ముంబైలోనూ ఆందోళన.. అశ్విని వైష్ణవ్ పోస్టర్ దహనం

హైదరాబాద్‌లో జరిగిన ఘటనతో పాటు ముంబైలోని బీకేసీ ప్రాంతంలో కూడా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు మెటా కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ముంబై యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు జీనత్ షాబ్రిన్ నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పోస్టర్‌ను దహనం చేశారు. సోషల్ మీడియా సంస్థలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయంటూ ఆరోపించారు. ప్రతిపక్ష నేతల ఖాతాలపై ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్య గొంతుకలను అణచివేసే ప్రయత్నమని విమర్శించారు.

హైదరాబాద్ బ్రాండ్‌కు నిజంగా ప్రమాదమా?

ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు అత్యంత కీలకమైన అంశం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా వంటి అంతర్జాతీయ సంస్థలకు హైదరాబాద్ కీలక కేంద్రంగా ఉంది. ఐటీ రంగంలో నగరానికి ఉన్న గుర్తింపు ఒక్కరోజులో వచ్చింది కాదు. అనేక ప్రభుత్వాల విధానాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడిదారులకు కల్పించిన అవకాశాల ఫలితంగా ఈ స్థాయికి చేరుకుంది.

ఇలాంటి సమయంలో అంతర్జాతీయ సంస్థ కార్యాలయం వద్ద విధ్వంసం జరగడం సహజంగానే చర్చకు దారితీస్తోంది. అయితే ఒక్క ఘటనతో పెట్టుబడులు తరలిపోతాయని చెప్పలేం. కానీ ప్రైవేట్ సంస్థల భద్రత, చట్టబద్ధమైన నిరసనలకు అవకాశం, పారిశ్రామిక వాతావరణంపై నమ్మకం వంటి అంశాలు పెట్టుబడిదారులకు కీలకం.

ఇక్కడ మరో ముఖ్యమైన ప్రశ్న కూడా ఉంది. రాజకీయ పార్టీలకు చెందిన సోషల్ మీడియా ఖాతాలపై ఆంక్షలు విధించినప్పుడు వాటికి స్పష్టమైన కారణాలు వెల్లడించాల్సిన బాధ్యత ప్లాట్‌ఫామ్‌లకు లేదా? ఒకవేళ తప్పు జరిగితే దాన్ని ప్రశ్నించే హక్కు రాజకీయ పార్టీలకు లేదా? ఆ హక్కు ఉందని చెప్పి ప్రైవేట్ కార్యాలయాల్లోకి వెళ్లి ఆస్తులను ధ్వంసం చేయవచ్చా?

మొత్తానికి సోషల్ మీడియా స్వేచ్ఛ, రాజకీయ పార్టీల హక్కులు, ప్రైవేట్ సంస్థల భద్రత.. ఈ మూడు అంశాల మధ్య ఇప్పుడు మెటా వివాదం నడుస్తోంది. రాజకీయ పోరాటాలు ఎలా ఉన్నా హైదరాబాద్‌కు ఉన్న అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రం అనే గుర్తింపు మాత్రం దెబ్బతినకూడదు.

తర్వాత చదవండి