తెలంగాణ

Rice Prices Down: బియ్యం ధరలు క్రమంగా డౌన్.. కిలో ధరలు ఎలా ఉన్నాయంటే?

గత కొన్ని నెలలుగా వినియోగదారులను తీవ్రంగా కలవరపెట్టిన బియ్యం ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. నెల రోజుల క్రితం వరకు భారీగా పెరిగిన రేట్లు ప్రస్తుతం దిగివస్తుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఊరట లభిస్తోంది. ప్రభుత్వాల కఠిన చర్యలు, మార్కెట్లోకి కొత్త పంట రాక, సరఫరా పెరగడం వంటి కారణాలతో బియ్యం ధరలు తగ్గుతున్నాయి.

 గత కొన్ని నెలలుగా వినియోగదారులను తీవ్రంగా కలవరపెట్టిన బియ్యం ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. నెల రోజుల క్రితం వరకు భారీగా పెరిగిన రేట్లు ప్రస్తుతం దిగివస్తుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఊరట లభిస్తోంది. ప్రభుత్వాల కఠిన చర్యలు, మార్కెట్లోకి కొత్త పంట రాక, సరఫరా పెరగడం వంటి కారణాలతో బియ్యం ధరలు తగ్గుతున్నాయి. దీంతో సామాన్యుడి నెలవారీ బడ్జెట్‌పై సానుకూల ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా నాలుగు నెలల క్రితం కిలో రూ.50 నుంచి రూ.55 ఉన్న కొన్ని సన్న బియ్యం రకాలు రూ.65 నుంచి రూ.80కి చేరగా, ప్రీమియం రకాలు అంతకంటే ఎక్కువ ధర పలికాయి.

కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ సన్న వడ్లకు అకస్మాత్తుగా డిమాండ్ పెరగడం, ఇతర రాష్ట్రాల వ్యాపారులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో స్థానికంగా లభ్యత తగ్గింది. దీనికి తోడు ప్రతికూల వాతావరణం, మిల్లింగ్ ఖర్చులు, సరఫరా వ్యవస్థలో లోపాలు, కృత్రిమ కొరత వల్ల ధరలు పెరిగాయి. ఫిర్యాదుల నేపథ్యంలో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం నిల్వలపై నిఘా పెంచి, ప్రభుత్వ నిల్వలను మార్కెట్లోకి విడుదల చేసింది. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 5 వరకు 1,141 తనిఖీలు నిర్వహించి 35 క్రిమినల్ కేసులతో సహా మొత్తం 55 కేసులు నమోదు చేసింది; తూకంలో మోసాలు, ధరల స్టిక్కర్ల మార్పు వంటి అక్రమాలను గుర్తించింది.

 ప్రస్తుతం మార్కెట్లో బీపీటీ, కేఎన్ఎం రకాలు కిలో రూ.66కు, తెలంగాణ సోనా, ఆర్ఎన్ఆర్ రకాలు కిలో రూ.74కు, హెచ్ఎంటీ, జెఎస్ఆర్ రకాలు కిలో రూ.79కు లభిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో దేశవ్యాప్తంగా ధరలు దిగివచ్చాయి, అయితే రకం, నాణ్యత, బ్రాండ్, ప్రాంతాన్ని బట్టి రేట్లలో తేడాలున్నాయి. కొత్త ధాన్యం రాకతో సరఫరా పెరిగి ధరలు మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది.

 మరోవైపు గతంలో మాదిరిగానే మరింత చౌక ధరలకు బియ్యం అందుబాటులోకి రావాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ నిఘా, కొత్త పంట సరఫరా ఇలాగే కొనసాగితే ధరలు దిగివచ్చే ఛాన్స్ ఉంది. అయితే డిమాండ్ పెరిగి సరఫరాలో ఇబ్బందులు తలెత్తితే భవిష్యత్తులో తిరిగి ధరలు పెరిగే ప్రమాదం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

తర్వాత చదవండి