Tollywood: తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. 2024లో విడుదలై భారీ స్థాయిలో సంచలన విజయాన్ని అందుకున్న ‘హను-మాన్’ సినిమాకు మరో సీక్వెల్ ని ప్రకటించారు. కానీ, ఇందులో హీరో తేజ సజ్జా కాకపోవడం షాకింగ్ విషయం. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ ఇందులో నటిస్తుండటంవిశేషం. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ సంస్థ తాజాగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించింది.
‘ది రైజ్ ఆఫ్ వానరాస్’గా టైటిల్..
‘హనుమాన్ 2 – ది రైజ్ ఆఫ్ వానరాస్’ పేరుతో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించనున్నారు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఊరు పేరు భైరవకోన’ లాంటి విభిన్నమైన ఫాంటసీ, థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు వీఐ ఆనంద్ దీనికి దర్శకత్వం వహించనున్నారు. కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మాతలు.
ఇక, తాజాగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ ప్రతీ ఒక్కరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. కాషాయ వస్త్రధారణలో వైష్ణవ్ తేజ్ పోస్టర్‌ను డిజైన్ చేశారు. భారీ వానర తోక, ఆకాశంలో కనిపించే దివ్య రూపం ఈ పోస్టర్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. అంతేకాదు, ఈ పోస్టర్ చూస్తుంటే మరో భారీ ఫాంటసీ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఫ్రాంచైజీ ఒకటే..సీక్వెల్స్ రెండు!
ఇక్కడ ఎవరూ అసలు ఊహించని ట్విస్ట్ ఉంది. ‘హను-మాన్’ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ.. ఇప్పటికే, రిషబ్ శెట్టి హీరోగా ‘జై హనుమాన్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు. మరోవైపు, ఒరిజినల్ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి ఇప్పుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ‘హనుమాన్ 2’ ప్రకటించడం ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికరంగా మారింది.
