క్రైమ్

USA Accident: అమెరికాలో మునుగోడు యువకుడి మృతి.. ఉద్యోగం సాధించిన వారానికే విషాదం!

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనతో నల్గొండ జిల్లా మునుగోడు పట్టణంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. చదువు పూర్తి చేసుకుని కేవలం వారం రోజుల క్రితమే ఉద్యోగం సాధించాడని కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగితేలుతున్న తరుణంలోనే ఈ విషయం తెలియడంతో కన్నీరుమున్నీరవుతున్నారు.

 అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనతో నల్గొండ జిల్లా మునుగోడు పట్టణంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. చదువు పూర్తి చేసుకుని కేవలం వారం రోజుల క్రితమే ఉద్యోగం సాధించాడని కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగితేలుతున్న తరుణంలోనే ఈ విషయం తెలియడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. న్యూయార్క్ రాష్ట్రంలోని ఇంటర్‌స్టేట్-90 రహదారిపై జరిగిన ఈ ప్రమాదం స్థానిక తెలుగు ప్రవాసులను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది.

 పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మునుగోడు పట్టణానికి చెందిన ఈరమళ్ల ప్రసాద్, శ్రీకన్య దంపతుల పెద్ద కుమారుడు సాయితేజ(25) ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి న్యూయార్క్‌లోని యుటికా వెళ్లాడు. ఇటీవలే చదువు పూర్తయిన అనంతరం వారం రోజుల క్రితం కొత్త ఉద్యోగంలో చేరాడు. బుధవారం సాయంత్రం సుమారు 6:30 గంటల సమయంలో అతడు కారులో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా ఒక జింక రోడ్డుపైకి అడ్డుగా వచ్చింది. జింకను ఢీకొట్టడంతో సాయితేజ ప్రయాణిస్తున్న కారు రహదారి మధ్యలోనే నిలిచిపోయింది.

 అదే సమయంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన సరుకులు తరలించే వ్యాన్ ఆగి ఉన్న కారును బలంగా ఢీకొట్టడంతో మరో రెండు వాహనాలు సైతం ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సాయితేజకు తీవ్రగాయాలు కాగా సమాచారం అందుకున్న న్యూయార్క్ స్టేట్ పోలీసులు, అత్యవసర సహాయక బృందాలు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని అతడిని సమీపంలోని సెయింట్ మేరీస్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే సాయితేజ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

 కారులో ఉన్న మరో ప్రయాణికుడికి తీవ్ర గాయాలు కావడంతో అల్బానీ మెడికల్ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉన్నత చదువులు పూర్తి చేసి, ఉద్యోగంలో స్థిరపడి తమకు అండగా నిలుస్తాడని ఆశించిన పెద్ద కొడుకు ఇక లేడన్న నిజాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో మునుగోడు పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సాయితేజ భౌతికకాయాన్ని అమెరికా నుంచి స్వస్థలానికి తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు కొనసాగుతున్నాయని, ఆదివారం రాత్రికి మృతదేహం మునుగోడుకు చేరుకునే అవకాశం ఉందని సన్నిహితులు వెల్లడించారు.

తర్వాత చదవండి