అధికార కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. పదవులు,పార్టీలో ప్రాధాన్యత కోసం కొందరు నేతలు అధిష్టానం ఎంత చెప్పినా వినకుండా ఎదురుతిరుగుతున్నారు.పార్టీకి వ్యతిరకంగా మాట్లాడొద్దని, ఏదైనా సమస్య ఉంటే తమ వద్దకు తీసుకురావాలని క్రమశిక్షణా కమిటీ పెద్దలు చెబితే ‘మేం చాలా సీనియర్లం, మమ్మల్నే క్వశ్చన్ చేస్తారా?’ అని రివర్స్ కౌంటర్ ఇస్తున్నట్టు తెలిసింది. దీంతో ఏం చేయాలో తెలియక టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ పెద్దలు తలలు పట్టుకున్నారు.
అయితే, కొందరు సీనియర్లు పార్టీకి అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు దక్కకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలో గత మూడేండ్లుగా తనకు మంత్రి వస్తుందని ఎదురుచూసిన బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి తాజాగా సంచలన ప్రకటన చేశారు.వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటూ ప్రకటించారు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలో 'చేయూత' పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పదవిలో ఉండే మరో రెండేళ్ల కాలంలో ప్రజల కనీస అవసరాలు తీర్చడమే తన లక్ష్యమని తెలిపారు. బోధన్‌లో జరిగిన 'చేయూత' పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. "వయసు అయిపోతోంది.. పెద్ద మనిషిగా చెప్తున్నా.. ఏళ్లు గడిచిపోతున్నాయి.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదు.. అయినా మీకోసం తిరుగుతున్నా" అని అన్నారు. అలాగే "మా గేమ్‌లు అయిపోయాయి" అని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు అటు నియోజకవర్గంలోనూ, ఇటు పార్టీలోనూ హాట్ టాపిక్ అయ్యాయి.
పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బోధన్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.అక్టోబర్ 31, 2025న తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ఇదిలాఉండగా, సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడంపై 2025 జూన్‌లో ఆయన వర్గం, నియోజకవర్గ కార్యకర్తలు నిరాశ వ్యక్తం చేశారు.దాంతో 2025 అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు క్యాబినెట్ హోదాతో ప్రభుత్వ సలహాదారు పదవిని కట్టబెట్టింది.
