బంగాళాఖాతంలో నెలకొన్న తూర్పు గాలుల ద్రోణి ప్రభావంతో నేడు (మంగళవారం) తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొననున్నాయని భారత వాతావరణ విభాగం (IMD) కీలక సూచనలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు.
దీని ఫలితంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, తెలంగాణలోని అత్యధిక జిల్లాల్లో పొడి వాతావరణం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA), అమరావతి వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం.. నేడు కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
వర్షాలు కురిసే సమయంలో తీర ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉదయం వేళల్లో పలు ప్రాంతాల్లో పొగమంచు కురిసే అవకాశం కూడా ఉంది. మరోవైపు రాయలసీమ జిల్లాల్లోనూ నేడు భిన్న వాతావరణం కనిపించనుంది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే సూచనలు ఉండటంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. రాబోయే మూడు నాలుగు రోజుల పాటు ఏపీలో ఇదే తరహాలో చెదురుమదురు వర్షాలు కొనసాగే వీలుందని వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో నేడు పొడి వాతావరణమే ఉండనుంది.
అయితే ద్రోణి ప్రభావం వల్ల కొన్ని ప్రాంతాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండే అవకాశం ఉందని, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొంది. రాష్ట్రంలో పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు సుమారు 30 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉండగా, ఉదయం వేళల్లో పొగమంచు, చలి తీవ్రత స్వల్పంగా కొనసాగనుంది. ప్రస్తుతం తెలంగాణ జిల్లాలకు ఎలాంటి ప్రత్యేక వాతావరణ హెచ్చరికలు జారీ చేయలేదని అధికారులు స్పష్టం చేశారు.
