జాతీయం

పంజాబ్ లో పాతమిత్రులు.. యూపీలో తెగని లెక్కలు! 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ పొలిటికల్ హీట్

పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. పంజాబ్‌లో ఆరేళ్లుగా దూరంగా ఉన్న బీజేపీ, శిరోమణి అకాలీదళ్ మళ్లీ చేతులు కలిపాయి. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మరోసారి కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు పరిణామాల వెనుక ఉన్న రాజకీయ లెక్కలు ఇప్పుడు 2029 ఎన్నికల వ్యూహాలకు కూడా కీలకంగా మారనున్నాయి.

5 రాష్ట్రాల ఎన్నికలు 2029కి సెమీఫైనల్సా..?

వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు

పంజాబ్‌లో పాత మిత్రుల కలయిక..

యూపీలో కాంగ్రెస్‌- ఎస్పీ మధ్య సీట్ల పంచాయితీ!

2029 సాధారణ ఎన్నికలకు వచ్చే ఏడాది జరగబోయే 5 రాష్ట్రాల ఎన్నికలు సెమీఫైనల్సా..? కచ్చితంగా సెమీఫైనల్సే. ఎందుకంటే.. ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఎంతో కీలకమైన ఉత్తరప్రదేశ్ కూడా ఉంది. వాస్తవానికి 2029 లోక్ సభ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. కానీ అప్పుడే జాతీయ రాజకీయాల్లో కొత్త లెక్కలు మొదలయ్యాయి. అధికారంలో ఉన్న ఎన్డీఏ మరోసారి తన బలాన్ని నిరూపించుకోవాలని చూస్తుంటే.. ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ నేపథ్యంలో 2027లో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారుతున్నాయి.

ముఖ్యంగా పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. పంజాబ్‌లో ఆరేళ్లుగా దూరంగా ఉన్న బీజేపీ, శిరోమణి అకాలీదళ్ మళ్లీ చేతులు కలిపాయి. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మరోసారి కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఇక్కడ పొత్తు కంటే సీట్ల పంపకాలే పెద్ద సమస్యగా మారాయి. ఒక రాష్ట్రంలో పాత మిత్రులు మళ్లీ ఒక్కటవుతుంటే.. మరో రాష్ట్రంలో మిత్రపక్షాల మధ్యే సీట్ల కోసం చర్చలు జరుగుతున్నాయి. ఈ రెండు పరిణామాల వెనుక ఉన్న రాజకీయ లెక్కలు ఇప్పుడు 2029 ఎన్నికల వ్యూహాలకు కూడా కీలకంగా మారనున్నాయి.

పంజాబ్‌లో బీజేపీ కొత్త వ్యూహం.. అకాలీదళ్‌కు పెద్దన్న పాత్ర

పంజాబ్ లో ఆరేళ్ల విరామానికి తెరదించుతూ బీజేపీ, శిరోమణి అకాలీదళ్ మళ్లీ పొత్తు పెట్టుకున్నాయి. నవంబర్ 24న ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ సంయుక్తంగా ఈ ప్రకటన చేశారు.

2020లో రైతు చట్టాల వివాదంతో విడిపోయిన ఈ రెండు పార్టీలు.. ఇప్పుడు 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం మళ్లీ ఒక్కటయ్యాయి. అయితే ఈసారి పొత్తులో బీజేపీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అకాలీదళ్‌కే పెద్దన్న పాత్ర ఉంటుందని అమిత్ షా స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కూడా అకాలీదళ్ నుంచే ఉంటారని ప్రకటించారు.

రెండు పార్టీలు కలిసి మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నాయి. అయితే ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలనే విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. గతంలో అకాలీదళ్ 94, బీజేపీ 23 స్థానాల్లో పోటీ చేసేవి. ఇప్పుడు బీజేపీ తన పోటీ స్థానాలను పెంచుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. సుమారు 40 స్థానాల్లో పోటీ చేసే ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది.

అయితే ఈ పొత్తు వెనుక కేవలం సీట్ల లెక్కలే లేవు. పంజాబ్ రాజకీయాల్లో తిరిగి తమ స్థానాన్ని బలోపేతం చేసుకోవాలనే రెండు పార్టీల ప్రయత్నం కనిపిస్తోంది. ఒకప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. గ్రామీణ ప్రాంతాల్లో అకాలీదళ్‌కు ఉన్న పట్టు, పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి ఉన్న మద్దతు.. కూటమికి ఉపయోగ పడే అవకాశముంది. కానీ రైతు ఉద్యమం తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

2020లో వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అకాలీదళ్ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర మంత్రివర్గానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత రెండు పార్టీలు విడివిడిగా ఎన్నికల్లో పోటీ చేశాయి. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 92 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. అకాలీదళ్‌కు మూడు, బీజేపీకి రెండు స్థానాలే వచ్చాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ ఒక్క స్థానాన్ని గెలవలేకపోయింది. అకాలీదళ్ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది.

ఇప్పుడు ఈ రెండు పార్టీలు తమ పాత ఓటు బేస్‌ను మళ్లీ కలిపేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే రైతు ఉద్యమం తర్వాత మారిన రాజకీయ వాతావరణంలో ఈ పొత్తుకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది కీలకం. మరోవైపు పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా ఈ పరిణామం కొత్త సవాలుగా మారుతోంది. కాంగ్రెస్ కూడా అక్కడ బలమైన రాజకీయ శక్తిగా ఉంది. దీంతో 2027లో పంజాబ్ ఎన్నికల పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది.

యూపీలో కాంగ్రెస్–ఎస్పీ మధ్య తెగని సీట్ల పంచాయితీ..

పంజాబ్‌లో రెండు పార్టీల మధ్య పొత్తు ఖరారైతే.. ఉత్తరప్రదేశ్‌లో మరో రెండు పార్టీల మధ్య మాత్రం పొత్తు కంటే సీట్ల పంపకాలే పెద్ద చర్చగా మారాయి. దేశ రాజకీయాల్లో యూపీకి ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 80 లోక్‌సభ స్థానాలున్న ఈ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు జాతీయ రాజకీయాలకు ఒక కీలక సంకేతంగా మారనున్నాయి.

2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 255 స్థానాలు గెలుచుకుని అధికారాన్ని నిలబెట్టుకుంది. సమాజ్‌వాదీ పార్టీ 111 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. కాంగ్రెస్‌కు కేవలం రెండు స్థానాలే వచ్చాయి. కానీ 2024 లోక్‌సభ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి పరిస్థితి మారింది. బీజేపీ 33 స్థానాలకే పరిమితమైంది. సమాజ్‌వాదీ పార్టీ 37 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ ఆరు స్థానాల్లో విజయం సాధించింది. అంటే ఇండియా కూటమి మొత్తం 43 స్థానాలు సాధించింది.

ఈ ఫలితాలే ఇప్పుడు కాంగ్రెస్, ఎస్పీ మధ్య పొత్తు చర్చలకు ప్రధాన బలంగా మారాయి. గతంలో వచ్చిన విజయాన్ని 2027 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని రెండు పార్టీలు భావిస్తున్నాయి. అయితే ఇక్కడే సీట్ల లెక్కలు మొదలయ్యాయి. మొదట కాంగ్రెస్ 181 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని ప్రతిపాదించింది. కానీ ఎస్పీ నుంచి ఆ నెంబర్ కు సానుకూలత కనిపించలేదు. దీంతో కాంగ్రెస్ తన డిమాండ్‌ను తగ్గించుకుంది. తాజాగా సుమారు 120 స్థానాలతో కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చింది.

కాంగ్రెస్ వాదన ప్రకారం.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తాము గెలిచిన రాయ్‌బరేలీ, సహారన్‌పూర్, బారాబంకీ, సీతాపూర్, అమేథీ, అలహాబాద్ వంటి ప్రాంతాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లలో తమకు ప్రాధాన్యం ఉండాలి. అంతేకాదు.. రాష్ట్రంలోని 75 జిల్లాల్లో కనీసం ఒక్కో స్థానంలోనైనా పోటీ చేసే అవకాశం కావాలని కోరుతోంది. కానీ అఖిలేశ్ యాదవ్ లెక్కలు మరోలా ఉన్నాయి.

కాంగ్రెస్‌కు 26 స్థానాలు కేటాయించే ప్రతిపాదనను ఎస్పీ ముందుకు తెచ్చింది. 2022 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన రెండు స్థానాలు, రెండో స్థానంలో నిలిచిన మరో నాలుగు స్థానాలతో పాటు.. మిగిలిన 20 స్థానాలను కూడా ఎస్పీ ప్రతిపాదించింది. ఈ 20 నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఎస్పీకి 60 వేల నుంచి 70 వేల వరకు ఓట్లు వస్తే.. కాంగ్రెస్‌కు సుమారు రెండు వేల ఓట్లు మాత్రమే వచ్చాయని ఎస్పీ వాదిస్తోంది. అంటే గెలుపు అవకాశాలను బట్టి సీట్లు కేటాయించాలన్నది అఖిలేశ్ వ్యూహం.

అయితే కాంగ్రెస్‌కు ఈ ప్రతిపాదన నచ్చలేదు. ముఖ్యంగా అమేథీ, రాయ్‌బరేలీ వంటి ప్రాంతాల్లో తమ రాజకీయ ప్రాధాన్యాన్ని తగ్గించుకోవడానికి ఆ పార్టీ సిద్ధంగా లేదు. నవంబర్ 23, 24 తేదీల్లో రెండు పార్టీల మధ్య రెండు విడతల చర్చలు జరిగాయి. ఈ సమావేశాల తర్వాత ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. చర్చలు చాలా సానుకూలంగా జరిగాయని, మరో రెండు సమావేశాల్లో సీట్ల ఒప్పందాన్ని ఖరారు చేస్తామని చెప్పారు.

అంటే పొత్తు విషయంలో రెండు పార్టీల మధ్య చర్చలు ముందుకు సాగుతున్నాయి. కానీ 120 స్థానాలు కోరుతున్న కాంగ్రెస్, 26 స్థానాలు ప్రతిపాదిస్తున్న ఎస్పీ మధ్య దూరం ఇంకా తగ్గాల్సి ఉంది. వాస్తవానికి ఈ దూరం చాలా పెద్దదే. ఎక్కడ 120 సీట్లు.. ఎక్కడ 26 స్థానాలు. అందుకే ఎవరు తగ్గినా, ఎవరు పెరిగినా.. ఆ నెంబర్ భారీగానే ఉండాలి. అప్పుడే ఈ ఎపిసోడ్ కు ఎండ్ కార్డ్ పడుతుంది.

యూపీ ఎన్నికలపై బీజేపీ చూపు.. 2029కు అసలు పరీక్ష!

ఇక అధికారంలో ఉన్న బీజేపీ కూడా యూపీ ఎన్నికలను చాలా కీలకంగా చూస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎదురైన సీట్ల తగ్గుదల తర్వాత.. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి తన బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో మూడోసారి అధికారంలోకి రావడమే బీజేపీ లక్ష్యం. మరోవైపు అఖిలేశ్ యాదవ్ 2024లో వచ్చిన విజయాన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని చూస్తున్నారు.

ఇక కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్తుకు కూడా ఇది కీలకమైన ఎన్నిక. ఎస్పీతో పొత్తులో ఎన్ని స్థానాలు దక్కించుకుంటుంది? వాటిలో ఎన్ని గెలుస్తుంది? రాష్ట్రంలో తన సొంత రాజకీయ బలాన్ని ఎంతవరకు పెంచుకుంటుంది? అన్నది ఆ పార్టీకి ముఖ్యమైన అంశం. బీఎస్పీ కూడా తన ఓటు బేస్‌ను తిరిగి సమీకరించుకునే ప్రయత్నం చేస్తోంది. మాయావతి పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా? ఇతర పార్టీలతో పొత్తు దిశగా వెళ్తుందా? అన్నది కూడా ఎన్నికల ముందు స్పష్టత రావాల్సి ఉంది.

2029కు ముందు రాజకీయ పార్టీలకు సెమీఫైనల్!

మొత్తానికి పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కేవలం రెండు రాష్ట్రాల అధికార మార్పిడి పోటీగా మాత్రమే ఉండబోవు. 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాన రాజకీయ పార్టీల బలం, పొత్తుల ప్రభావం, ఓటర్ల మద్దతు ఎలా ఉందో తెలుసుకునే కీలక పరీక్షగా మారనున్నాయి.

అయితే ఈ రెండింటిలో ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రాధాన్యం మరింత ఎక్కువ. ఎందుకంటే లోక్‌సభలో 80 స్థానాలున్న ఈ రాష్ట్రంలో వచ్చే ఫలితాలు 2029 ఎన్నికల రాజకీయ లెక్కలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 2024లో బీజేపీకి తగిలిన ఎదురుదెబ్బను 2027లో అధిగమించగలదా? కాంగ్రెస్, ఎస్పీ కలిసి తమ విజయాన్ని కొనసాగించగలవా? అన్నది జాతీయ రాజకీయాల్లో కీలక చర్చగా మారనుంది.

పంజాబ్‌లో బీజేపీ, అకాలీదళ్ పాత బంధాన్ని తిరిగి బలపరచుకోవాలని చూస్తుంటే.. యూపీలో కాంగ్రెస్, ఎస్పీ తమ కూటమిని మరింత పటిష్టం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఒకవైపు ఎన్డీఏ తన మిత్రపక్షాలను తిరిగి కలుపుకుంటోంది. మరోవైపు ఇండియా కూటమి రాష్ట్రాలవారీగా తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.

ఈ రెండు రాష్ట్రాలతో పాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో కూడా ఇప్పుడిప్పుడే రాజకీయ హడావుడి ఊపందుకుంటోంది. ఉత్తరాఖండ్ లో ఆమ్ ఆద్మీ ఒంటరిగా పోటీ చేస్తుండడం కాంగ్రెస్ కు సవాల్ గా మారింది. మొత్తానికి 2027లో ఈ 5 రాష్ట్రాల ప్రజలు ఇచ్చే తీర్పు.. 2029 ఎన్నికలకు ముందు దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు సంకేతంగా భావించాల్సిందే. అందుకే ఈ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ తో పాటు ప్రాంతీయ పార్టీలన్నీ సీరియస్ గా తీసుకున్నాయి.

తర్వాత చదవండి