తెలంగాణ

హే.. కృష్ణా! సర్కారు మాటలు నమ్మాలా.. హరీష్ వాదన వినాలా..? ఏది నిజం?

కృష్ణా జలాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి హరీష్‌రావు అన్నట్టుగా రాజకీయ యుద్ధం మొదలైంది. నవంబర్ 23న రేవంత్‌రెడ్డి మీడియా ముందు తన వాదనలు వినిపించారు. తాజాగా హరీష్‌రావు 5 ప్రధాన అంశాలను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రికి కౌంటర్ ఇచ్చారు. అయితే ఇందులో ఎవరి వాదన నిజం? ఎవరి దగ్గర బలమైన ఆధారాలున్నాయి? ఎక్కడ రాజకీయ విమర్శలు వాస్తవాలను పక్కదారి పట్టిస్తున్నాయి?

కృష్ణా జలాలపై రేవంత్ వర్సెస్ హరీష్..

తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు?

512 టీఎంసీల కేటాయింపు నుంచి పోతిరెడ్డిపాడు వరకు..

పల్నాడు వాటర్ గ్రిడ్ నుంచి నీటి వినియోగం లెక్కల వరకు..

ఇద్దరి వాదనల్లోనూ కీలకమైన ప్రశ్నలు

రాజకీయ ఆరోపణల మధ్య అసలు వాస్తవాలేమిటి?

తెలంగాణ నీటి హక్కుల విషయంలో ఎవరు ఎక్కడ తప్పు చేశారు?

తెలంగాణకు నీళ్లు కావాలి. ప్రాజెక్టులు పూర్తి కావాలి. రైతుల పొలాలకు సాగునీరు అందాలి. ఇదే ప్రజల ఆకాంక్ష. కానీ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా ఎంత? ఆ వాటాను సాధించడానికి గత ప్రభుత్వాలు ఏం చేశాయి? ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన పాలకులు, ప్రతిపక్ష నేతలు ఇప్పుడు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.

కృష్ణా జలాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి హరీష్‌రావు అన్నట్టుగా రాజకీయ యుద్ధం మొదలైంది. నవంబర్ 23న రేవంత్‌రెడ్డి సుదీర్ఘంగా మీడియా ముందు తన వాదనలు వినిపించారు. తాజాగా హరీష్‌రావు ఐదు ప్రధాన అంశాలను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రికి కౌంటర్ ఇచ్చారు. అయితే ఇందులో ఎవరి వాదన నిజం? ఎవరి దగ్గర బలమైన ఆధారాలున్నాయి? ఎక్కడ రాజకీయ విమర్శలు వాస్తవాలను పక్కదారి పట్టిస్తున్నాయి?

2015లో 299 : 512 టీఎంసీల కేటాయింపు.. తెలంగాణ హక్కులు వదులుకున్నట్టేనా?

సీఎం రేవంత్‌రెడ్డి ప్రధానంగా లేవనెత్తిన అంశం 2015లో కృష్ణా జలాల తాత్కాలిక పంపిణీ. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీల చొప్పున నీటి వినియోగానికి తాత్కాలిక సర్దుబాటు జరిగింది. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఈ విధానాన్ని అంగీకరించిందని రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో తెలంగాణ వాటా ఎక్కువగా ఉన్నప్పటికీ, తక్కువ నీటితో సరిపెట్టుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం ఎలా అంగీకరించిందని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణకు కనీసం 575 టీఎంసీలు రావాలని తమ ప్రభుత్వం వాదిస్తోందని చెబుతున్నారు.

అయితే హరీష్‌రావు వాదన మరోలా ఉంది. 299 : 512 అనేది శాశ్వత కేటాయింపు కాదని, ట్రిబ్యునల్ తుది నిర్ణయం వచ్చే వరకు కొనసాగాల్సిన తాత్కాలిక నీటి వినియోగ సర్దుబాటు మాత్రమేనని అంటున్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారని, 50 : 50 నిష్పత్తిలో నీటి పంపిణీ జరగాలని కూడా డిమాండ్ చేశామని గుర్తు చేస్తున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన వాస్తవాన్ని గుర్తించాలి. తాత్కాలిక నీటి వినియోగ సర్దుబాటును శాశ్వత హక్కుల కేటాయింపుగా పరిగణించడం సరికాదు. అదే సమయంలో తాత్కాలికమనే పేరుతో సంవత్సరాల తరబడి కొనసాగుతున్న పంపిణీ విధానంపై ప్రశ్నించకూడదనడం కూడా సరికాదు.

పోతిరెడ్డిపాడు.. హరీష్‌రావు నిజంగానే బాధ్యులా?

ఇప్పుడు రెండో అంశం. పోతిరెడ్డిపాడు. 2005లో అప్పటి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచుతూ జీవో 170 జారీ చేసింది. ఈ నిర్ణయం రాయలసీమకు కృష్ణా జలాలను తరలించే సామర్థ్యాన్ని పెంచిందన్నది ప్రధాన అభ్యంతరం. అప్పటి మంత్రివర్గంలో హరీష్‌రావు కూడా ఉన్నారని, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం లభించినప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారని రేవంత్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారు.

హరీష్ వాదనేంటి..?

జీవో 170 విడుదలయ్యే సమయానికి తాము మంత్రివర్గంలో లేమని, తెలంగాణ ప్రయోజనాల కోసం పదవులకు రాజీనామా చేశామని చెబుతున్నారు హరీష్. అప్పట్లో అసెంబ్లీలోనూ పోతిరెడ్డిపాడు విస్తరణను వ్యతిరేకించామని గుర్తు చేస్తున్నారు. ఇక్కడ కూడా రెండు వేర్వేరు అంశాలున్నాయి.

ఒకటి.. జీవో విడుదలైన తేదీ. రెండోది.. ఆ జీవోకు సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలు, ముందస్తు నిర్ణయాల్లో ఎవరి పాత్ర ఎంత? ఐతే..

రాజకీయ ఆరోపణలతో కాదు.. అప్పటి మంత్రివర్గ సమావేశాల రికార్డులు, బడ్జెట్ పత్రాలు, రాజీనామాల తేదీలు, జీవో జారీ తేదీలతోనే ఈ వివాదంపై మరింత క్లారిటీ వస్తుంది.

పల్నాడు వాటర్ గ్రిడ్.. రేవంత్ ప్రభుత్వం ఎందుకు ఆలస్యంగా స్పందించింది?

ఇక తాజాగా రాజకీయాలను వేడెక్కించిన అంశం పల్నాడు వాటర్ గ్రిడ్. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు ప్రాంతానికి తాగునీరు అందించేందుకు నాగార్జునసాగర్ జలాశయం నుంచి నీటిని తరలించే ప్రాజెక్టు చేపట్టారు. సుమారు రూ.1,200 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 363 గ్రామాలకు తాగునీరు అందించాలన్నది ఏపీ ప్రభుత్వ లక్ష్యం.

ఈ ప్రాజెక్టు విషయంలో రేవంత్‌రెడ్డి రెండు ముఖ్యమైన అంశాలను ప్రస్తావిస్తున్నారు. మొదటిది.. కేసీఆర్, జగన్ ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలోనే పల్నాడు వాటర్ గ్రిడ్‌కు సంబంధించి జీవో 56 విడుదలైందని, అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నిస్తున్నారు.

రెండోది.. 2022లోనే ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక ప్రతిపాదనలు ముందుకొచ్చినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదన్నది ఆయన ప్రశ్న. కానీ హరీష్‌రావు ఇక్కడే అసలు మెలిక ఉందంటున్నారు. 2022లోని జీవో 56 ఆర్థికపరమైన అంశాలకు సంబంధించినదే తప్ప, నాగార్జునసాగర్ నుంచి నీటిని తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చిన జీవో కాదని చెబుతున్నారు. నాగార్జునసాగర్‌ను నీటి వనరుగా చూపిస్తూ అనుమతులు ఇచ్చింది 2025లోనేనని వాదిస్తున్నారు.

అంతేకాదు.. 2025 జనవరిలోనే ఏపీ టెండర్లు పిలిచిందని, 2026లో పనులు మొదలయ్యాయని, తెలంగాణ ప్రభుత్వం ముందుగానే ఎందుకు అడ్డుకోలేకపోయిందని నిలదీస్తున్నారు. ఇక్కడ హరీష్‌రావు లేవనెత్తిన ప్రశ్నకు ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఒక ప్రాజెక్టుకు నిధులు మంజూరు కావడం వేరు. ఒక నిర్దిష్ట జలాశయం నుంచి నీటిని తీసుకునేందుకు అనుమతి రావడం వేరు. ఈ రెండింటినీ ఒకటిగా చూడలేం.

అయితే ఈ వివాదంపై నవంబర్ 23న జరిగిన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలోనూ పూర్తి పరిష్కారం రాలేదు. నవంబర్ 24న వెల్లడైన వివరాల ప్రకారం, పల్నాడు ప్రాజెక్టు అంశంపై తుది నిర్ణయం తీసుకోలేదు. ఏపీ కోరిన 9 టీఎంసీల తాగునీటి విడుదలకు మాత్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.

అంటే పల్నాడు ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు, నీటి వనరులు, నీటి వినియోగంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయంలో రేవంత్ ప్రభుత్వం తన వద్ద ఉన్న లేఖలు, అనుమతులు, అభ్యంతరాలను ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. హరీష్‌రావు కోరుతున్నట్టుగా జీవోల పూర్తి వివరాలు కూడా బయటపెట్టాలి.

నీటి వినియోగంలో ఎవరి లెక్క నిజం?

ఇప్పుడు ఈ మొత్తం వివాదంలో అత్యంత కీలకమైన అంశం నీటి వినియోగం. సీఎం రేవంత్‌రెడ్డి మీడియా సమావేశంలో చాలా గణాంకాలను ప్రస్తావించారు. 2023-24లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ 119 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకుందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024-25లో 285.17 టీఎంసీలు, 2025-26లో 268.17 టీఎంసీలు వినియోగించామని వివరించారు.

దీనికి హరీష్‌రావు మరో లెక్కను తెరపైకి తెచ్చారు. 2024-25లో ఏపీ 718 టీఎంసీలు వినియోగిస్తే, తెలంగాణ 286 టీఎంసీలకే పరిమితమైందని అన్నారు. 2025-26లో ఏపీ వినియోగం 771 టీఎంసీలకు చేరితే తెలంగాణ వినియోగం 267 టీఎంసీలేనని చెబుతున్నారు.

ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. రేవంత్‌రెడ్డి చెప్పిన తెలంగాణ నీటి వినియోగ గణాంకాలకు, హరీష్‌రావు ప్రస్తావించిన గణాంకాలకు పెద్దగా తేడా లేదు. 2024-25లో ఇద్దరూ దాదాపు 285 టీఎంసీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు. 2025-26లో మాత్రం 268 టీఎంసీలు, 267 టీఎంసీలు అంటూ స్వల్ప వ్యత్యాసం ఉంది.

కానీ అసలు ప్రశ్న తెలంగాణ ఎంత నీటిని వాడిందన్నది మాత్రమే కాదు. ఏపీతో పోలిస్తే తెలంగాణకు ఎంత నీరు అందింది? కేటాయింపుల్లో తనకు రావాల్సిన వాటాను తెలంగాణ పూర్తిగా వినియోగించుకోగలిగిందా? అన్నదే అసలు ప్రశ్న. ఇక్కడ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు 2023-24 వార్షిక నివేదికను పరిశీలిస్తే, రెండు రాష్ట్రాల కృష్ణా బేసిన్ వినియోగం మొత్తం 332.917 టీఎంసీలు. ఇందులో ఏపీ వినియోగం 211.790 టీఎంసీలు కాగా, తెలంగాణ వినియోగం 121.127 టీఎంసీలు.

అంటే రేవంత్‌రెడ్డి చెప్పిన 119 టీఎంసీలకు బోర్డు నివేదికలోని 121.127 టీఎంసీలకు స్వల్ప తేడా ఉంది. అయితే ఇది కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఆ ఏడాది తెలంగాణ వినియోగం చాలా తక్కువ స్థాయిలోనే ఉంది.

అయితే ఇక్కడ మరో జాగ్రత్త అవసరం. రెండు రాష్ట్రాల మొత్తం వినియోగాన్ని పోల్చేటప్పుడు ఒకే నీటి సంవత్సరం, ఒకే జలాశయాల పరిధి, ఒకే లెక్కింపు విధానాన్ని తీసుకోవాలి. బేసిన్ మొత్తం వినియోగం, ఉమ్మడి జలాశయాల నుంచి తీసుకున్న నీరు, ఇతర ప్రాజెక్టుల వినియోగం వేర్వేరు లెక్కలు. వాటిని కలిపి గందరగోళం సృష్టించడం సరికాదు. తెలంగాణకు నీళ్లు ఎక్కువగా వాడామని చెప్పుకోవడం గొప్ప కాదు. తనకు న్యాయంగా రావాల్సిన నీటిని రైతుల అవసరాలకు వినియోగించగలగడమే ప్రభుత్వానికి అసలైన పరీక్ష.

రాయలసీమ లిఫ్ట్.. బీఆర్ఎస్ అడ్డుకుందా? కాంగ్రెస్ అడ్డుకుంటోందా?

ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టినప్పుడు తెలంగాణ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టుకు అనుమతులు లేవని, కృష్ణా జలాలను అక్రమంగా తరలించే ప్రయత్నం జరుగుతోందని తెలంగాణ వాదించింది.

హరీష్‌రావు చెబుతున్నదాని ప్రకారం, బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 జనవరి నుంచే ఈ ప్రాజెక్టును వ్యతిరేకించింది. కేఆర్‌ఎంబీ, అపెక్స్ కౌన్సిల్, కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాసింది. మొత్తం 19 లేఖలు రాశామని చెబుతున్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్‌లోనూ పోరాడామని గుర్తుచేస్తున్నారు.

మరి ఇక్కడ రేవంత్‌రెడ్డి ప్రశ్న ఏంటి?

బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ఏపీ ప్రాజెక్టుల సామర్థ్యం పెరిగిందని, తెలంగాణ ప్రాజెక్టులు మాత్రం పూర్తికాలేదని విమర్శిస్తున్నారు. రోజుకు 4.47 టీఎంసీలుగా ఉన్న ఏపీ నీటి తరలింపు సామర్థ్యం బీఆర్ఎస్ పాలనలో 13.17 టీఎంసీలకు చేరిందని ఆరోపిస్తున్నారు.

ఇక్కడ రెండు విషయాలను విడదీసి చూడాలి. రాయలసీమ లిఫ్ట్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకించలేదనడం వాస్తవం కాదు. ఆ ప్రాజెక్టుపై అభ్యంతరాలు, లేఖలు, న్యాయపోరాటం జరిగినట్లు ఆధారాలున్నాయి. అయితే ఆ వ్యతిరేకతతో ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోయిందా? ఏపీ నీటిని తరలించే సామర్థ్యం పెరగకుండా నిరోధించగలిగారా? అన్నది వేరే ప్రశ్న.

ఈ విషయంలో బీఆర్ఎస్ తన పోరాటానికి సంబంధించిన లేఖలు, న్యాయస్థానాల ఉత్తర్వులు మాత్రమే కాకుండా, వాస్తవంగా సాధించిన ఫలితాలను కూడా ప్రజలకు వివరించాలి.

పాలమూరు-రంగారెడ్డి.. పూర్తి చేయలేకపోయింది ఎవరు?

తెలంగాణకు అత్యంత కీలకమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలోనూ ఇద్దరు నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాజెక్టు 80 శాతానికి పైగా పూర్తయిందని, కేవలం రెండు మూడు కిలోమీటర్ల పనులు మాత్రమే మిగిలాయని హరీష్‌రావు చెబుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లవుతున్నా ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయిందని ప్రశ్నిస్తున్నారు.

అంతేకాదు.. పాలమూరు ప్రాంతంలో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ప్రాజెక్టును పక్కనపెట్టి, ఏపీకి నీటి తరలింపుపై ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తోందని నిలదీస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది.

ప్రాజెక్టు పురోగతి ఎంత? పెండింగ్‌లో ఉన్న పనులెన్ని? పర్యావరణ, అటవీ అనుమతులు ఎక్కడివరకు వచ్చాయి? భూసేకరణ, విద్యుత్, నిధుల సమస్యలేమైనా ఉన్నాయా? అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చేసింది? కేవలం గత ప్రభుత్వాన్ని నిందిస్తే సరిపోదు. అదే సమయంలో గత ప్రభుత్వం 80 శాతం పూర్తి చేసిందన్న వాదనను కూడా స్వతంత్రంగా ధ్రువీకరించాలి. ప్రాజెక్టు పురోగతి నివేదికలు, ఆర్థిక వ్యయం, పూర్తయిన పనుల వివరాలను ప్రభుత్వం విడుదల చేయాలి.

అసలు తెలంగాణకు 575 టీఎంసీలు వస్తాయా?

ఇక్కడ మరో కీలకమైన అంశాన్ని ప్రస్తావించాలి. కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో తెలంగాణ వాటా సుమారు 71 శాతం ఉందని, అందువల్ల 811 టీఎంసీల్లో తెలంగాణకు కనీసం 575 టీఎంసీలు రావాలని రేవంత్‌రెడ్డి వాదిస్తున్నారు. వినడానికి ఈ వాదన బలంగానే కనిపిస్తుంది. కానీ పరీవాహక ప్రాంతం ఎంత ఉందన్న ఒక్క అంశం ఆధారంగా నీటి వాటాను చట్టబద్ధంగా నిర్ణయించలేం.

నదీ జలాల పంపిణీలో పరీవాహక ప్రాంతంతో పాటు నీటి లభ్యత, గత వినియోగం, సాగు అవసరాలు, ప్రాజెక్టుల పరిస్థితులు, ట్రిబ్యునల్ కేటాయింపులు వంటి అంశాలు కూడా కీలకం.

ప్రస్తుతం కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదం కొనసాగుతోంది. 2023 అక్టోబరులో కేంద్రం అదనపు నిబంధనలతో ఈ అంశాన్ని ట్రిబ్యునల్‌కు రిఫర్ చేసింది. 811 టీఎంసీలతో పాటు అదనపు కేటాయింపులు, గోదావరి నుంచి కృష్ణాకు బదిలీ అయ్యే నీటి అంశాలను కూడా పరిశీలించాల్సి ఉంది. అయితే ఏదేమైనా.. తెలంగాణకు 575 టీఎంసీలు రావాలన్నది రాష్ట్ర ప్రభుత్వం బలంగా వినిపించాల్సిన డిమాండ్.

ఎవరి వాదనలో నిజం ఉంది?

ఇప్పుడు మొత్తం వివాదాన్ని పరిశీలిస్తే కొన్ని విషయాలు స్పష్టమవుతున్నాయి. 2015లో 299 : 512 టీఎంసీల పంపిణీ శాశ్వత ఒప్పందం కాదు. అది తాత్కాలిక నీటి వినియోగ సర్దుబాటు. కాబట్టి తెలంగాణ నీటి హక్కులను కేసీఆర్ ప్రభుత్వం శాశ్వతంగా వదులుకుందని రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణను ఇప్పుడున్న ఆధారాలతో నిర్ధారించలేం.

పోతిరెడ్డిపాడు విషయంలో హరీష్‌రావు రాజీనామా చేసిన తేదీ, జీవో 170 జారీ తేదీ, అంతకుముందు జరిగిన బడ్జెట్ ఆమోదాల రికార్డులు అన్నింటినీ కలిపి పరిశీలించాలి. ఒక్క అంశంతోనే ఆయన బాధ్యతను నిర్ధారించడం సరికాదు.

పల్నాడు వాటర్ గ్రిడ్ విషయంలో మాత్రం రేవంత్‌రెడ్డి ప్రస్తావించిన 2022 జీవో, హరీష్‌రావు చెబుతున్న 2025 అనుమతుల మధ్య తేడాను స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో పూర్తి లెక్కలను బయటపెట్టాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వానిదే.

నీటి వినియోగం విషయంలోనూ ఇద్దరి గణాంకాల్లో కొన్ని విషయాలు సరిపోతున్నాయి. కానీ తెలంగాణకు అందాల్సిన వాటా పూర్తిగా అందిందా? ఏపీ అదనపు నీటిని వినియోగిస్తోందా? అన్న ప్రశ్నలకు బోర్డు ధ్రువీకరించిన సమగ్ర లెక్కలతోనే సమాధానం చెప్పాలి.

చివరగా ఒక విషయం మాత్రం స్పష్టం. తెలంగాణకు జరిగిన అన్యాయానికి గత ప్రభుత్వాన్ని నిందించి ప్రస్తుత ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోలేదు. గతంలో తాము పోరాడామని చెప్పుకుంటూ ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ కూడా కప్పిపుచ్చుకోలేదు. కృష్ణా జలాల విషయంలో రాజకీయ పార్టీలకు ఐదేళ్లు, పదేళ్ల లెక్కలు ఉండొచ్చు. కానీ రైతులకు మాత్రం ప్రతి పంట కాలానికి నీళ్లు కావాలి.

కేసీఆర్ హయాంలో ఏం జరిగింది? రేవంత్ పాలనలో ఏం జరుగుతోంది? ఏపీకి ఎన్ని టీఎంసీలు వెళ్తున్నాయి? తెలంగాణకు ఎన్ని టీఎంసీలు వస్తున్నాయి? ఏ ప్రాజెక్టుకు ఎన్ని అనుమతులున్నాయి? ఈ ప్రశ్నలన్నింటికీ జీవోలు, ఒప్పందాలు, ట్రిబ్యునల్ రికార్డులు, కేఆర్‌ఎంబీ గణాంకాలతో సమాధానం చెప్పాలి.

అసెంబ్లీలో వారం రోజులైనా చర్చిద్దామని హరీష్‌రావు సవాల్ విసిరారు. ఆ సవాల్‌ను ప్రభుత్వం స్వీకరించాలి. అవసరమైతే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించాలి. అన్ని పేపర్లను సభ ముందు పెట్టాలి. ఎందుకంటే ఇది రేవంత్‌రెడ్డి గెలుపోటముల సమస్య కాదు. హరీష్‌రావు రాజకీయ భవిష్యత్తు సమస్య అంతకంటే కాదు. ఇది తెలంగాణ నీటి హక్కుల సమస్య. ఇక్కడ గెలవాల్సింది ఏ పార్టీ కాదు. తెలంగాణ రైతన్న గెలవాలి. అన్నదాతకు ప్రభుత్వంతో పాటు అన్ని పార్టీలు అండగా నిలవాలి.

తర్వాత చదవండి