రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సందీప్ నేడు తెలంగాణకు రానున్నారు. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే గాంధీభవన్‌లో జరిగే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC) సమావేశం జరగనుంది. అందులో నూతన ఏఐసీసీ స్టేట్ ఇన్చార్జి పాల్గొంటారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితర సీనియర్ నేతలు పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనున్నట్టు సమాచారం.
ఎజెండా ఖరారు..
ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆధ్వర్యంలోనే పొలిటికల్ అఫైర్స్ కమిటీ, పీసీసీ అడ్వైజరీ కమిటీ, విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం జరగనున్నట్టు సమాచారం. ఈ సమావేశానికి సంబంధించిన ఎజెండాను ఇప్పటికే ఖరారు చేసినట్టు తెలిసింది.ముందుగా ఏఐసీసీ ఇన్చార్జి నియమితులైన బీఎం సందీప్ కుమార్‌కు స్వాగతం తెలుపుతూ తొలి తీర్మానం చేయనున్నారు. అనంతరం గతంలో ఏఐసీసీ స్టేట్ ఇన్చార్జిగా విశేష సేవలు అందించిన మీనాక్షి నటరాజన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ మరో తీర్మానాన్ని ఆమోదించనున్నట్టు తెలిసింది.
తెలంగాణలో మూడేళ్లుగా సాగుతున్న ప్రజాపాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నట్టు సమాచారం. దీంతో పాటు రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అంశం, భవిష్యత్ కార్యాచరణపైనా ఏఐసీసీ, టీపీసీసీ పెద్దలు దృష్టి సారించనున్నారు.
‘సంగఠన్ సృజన్ అభియాన్’ కింద రాష్ట్రంలో సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేకంగా చర్చ జరగనున్నట్టు సమాచారం. వాటితో పాటు ఇతర కీలక అంశాలపైనా అధ్యక్షుడి అనుమతితో చర్చించనున్నట్టు తెలుస్తోంది.అదే విధంగా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్న వారి పట్ల ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇక మీదట ఎవరైనా గీత దాటితే వారిపై ఎటువంటి చర్యలుంటాయని ఈ సందర్భంగా ప్రకటించనున్నారని సమాచారం.
