తెలంగాణ

HMDA Land Auction: హైదరాబాద్ శివారులో భూముల వేలం.. మరోసారి హెచ్ఎండీఏ నోటిఫికేషన్!

రాజధాని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని విలువైన ప్రభుత్వ స్థలాలు, అభివృద్ధి చేసిన లేఅవుట్ ప్లాట్లను విక్రయించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి సిద్ధమైంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) ఆధ్వర్యంలో భూముల వేలం ద్వారా సుమారు రూ.600కోట్ల నిధులను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

 రాజధాని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని విలువైన ప్రభుత్వ స్థలాలు, అభివృద్ధి చేసిన లేఅవుట్ ప్లాట్లను విక్రయించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి సిద్ధమైంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) ఆధ్వర్యంలో భూముల వేలం ద్వారా సుమారు రూ.600కోట్ల నిధులను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. గత నెలలో విడుదల చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించిన రూ.1,500కోట్ల విలువైన భూముల వేలం ప్రక్రియ ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగుతుండగానే, శనివారం మరో విడత భూముల విక్రయానికి హెచ్ఎండీఏ తాజా నోటిఫికేషన్ జారీ చేయడం రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

 ఈ తాజా నోటిఫికేషన్ ప్రకారం కోకాపేట, మూసాపేట, బంజారాహిల్స్‌లోని హుడా ప్లాట్లు, బాచుపల్లి, ఇన్ముల్‌నర్వ ప్రాంతాల్లోని విలువైన స్థలాలను విక్రయానికి ఉంచారు. వీటితో పాటు రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లోని సర్వే నంబర్ 41/14 (41/41)లో ఉన్న 0.21 ఎకరాలు, 1.39 ఎకరాల భూమిని వేర్వేరుగా వేలం వేయనున్నారు. శంకర్‌పల్లి మండలం మోకిలలో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్‌లో 300 నుంచి 500 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన 61 ప్లాట్లు, షాబాద్‌లో 300 గజాల విస్తీర్ణం ఉన్న 35 ప్లాట్లు, తుర్కయాంజాల్‌లోని లేఅవుట్‌లో 600 నుంచి 1,146 గజాల విస్తీర్ణం గల 11 ప్లాట్లు, అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డిపేటలోని 1,452 చదరపు గజాల స్థలాన్ని విక్రయించనున్నారు.

 ఆయా ప్రాంతాల్లోని భూములకు హెచ్ఎండీఏ కనీస ధరలను (అప్‌సెట్ ప్రైస్) ఖరారు చేసింది. ముఖ్యంగా ఐటీ కారిడార్‌కు సమీపంలోని ఖానామెట్ భూములకు ఎకరాకు రూ.99కోట్ల కనీస ధరను నిర్ణయించారు. మోకిల లేఅవుట్‌లోని ప్లాట్లకు చదరపు గజానికి రూ.55వేలు, తుర్కయాంజాల్‌లో గజానికి రూ.50వేలుగా కనీస ధరలు ప్రకటించారు. మధ్యతరగతి ప్రజలకు సైతం అందుబాటులో ఉండేలా షాబాద్ లేఅవుట్‌లోని ప్లాట్లకు చదరపు గజానికి కనీస ధరను రూ.25వేలుగా నిర్ధారించారు.

 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీ (MSTC) ఆధ్వర్యంలో అత్యంత పారదర్శకంగా ఆన్‌లైన్ విధానంలో ఈ వేలం ప్రక్రియ నిర్వహించనున్నారు. శనివారం నుంచే ఆసక్తి గల కొనుగోలుదారులు, సంస్థలు వేలంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే నెల (డిసెంబర్) 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఈ-వేలం కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం హెచ్ఎండీఏ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

తర్వాత చదవండి