జాతీయం

Wedding Season 2026: దేశంలో పెళ్లిళ్ల సందడి.. సంచలన నివేదిక!

దేశవ్యాప్తంగా మళ్లీ పెళ్లిళ్ల సందడి ఘనంగా మొదలైంది. రాబోయే 23 రోజుల వ్యవధిలో దేశంలో ఏకంగా 52 లక్షలకు పైగా వివాహాలు జరగనున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ భారీగా పుంజుకోనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వివాహాల సీజన్‌లో దాదాపు రూ.7.5లక్షల కోట్ల మేర వ్యాపార లావాదేవీలు జరుగుతాయని అఖిల భారత వర్తక సమాఖ్య (CAIT) తాజా సర్వేలో అంచనా వేసింది.

 దేశవ్యాప్తంగా మళ్లీ పెళ్లిళ్ల సందడి ఘనంగా మొదలైంది. రాబోయే 23 రోజుల వ్యవధిలో దేశంలో ఏకంగా 52 లక్షలకు పైగా వివాహాలు జరగనున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ భారీగా పుంజుకోనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వివాహాల సీజన్‌లో దాదాపు రూ.7.5లక్షల కోట్ల మేర వ్యాపార లావాదేవీలు జరుగుతాయని అఖిల భారత వర్తక సమాఖ్య (CAIT) తాజా సర్వేలో అంచనా వేసింది. నవంబర్ 21వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు కొనసాగే ఈ వివాహ ముహూర్తాల నేపథ్యంలో దేశంలోని 25 రాష్ట్రాల్లో 300 మంది ప్రముఖ వ్యాపారులు, 550 వర్తక సంఘాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా సీఏఐటీ ఈ సమగ్ర నివేదికను రూపొందించింది.

 సీఏఐటీ నివేదిక ప్రకారం.. మొత్తం రూ.7.5లక్షల కోట్ల వ్యాపారంలో సింహభాగం అంటే సుమారు 54 శాతం (రూ.4.05 లక్షల కోట్లు) వస్తువుల కొనుగోళ్ల రూపంలోనే జరగనుంది. ఇందులో ప్రధానంగా బంగారం, వెండి, వజ్రాభరణాల కొనుగోళ్లపై కుటుంబాలు రూ. 1.2 లక్షల కోట్లు వెచ్చించనున్నాయి. వస్త్రాలు, పట్టుచీరలు, దుస్తుల రంగానికి రూ. 90,000 కోట్లు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్ కొనుగోళ్లకు రూ.75,000కోట్లు, బహుమతులు, ఇతర సరుకుల విక్రయాల ద్వారా రూ. 37,500 కోట్ల వ్యాపారం నమోదు కానుందని సీఏఐటీ విశ్లేషించింది.

 వస్తువుల కొనుగోళ్లతో పాటు సేవల రంగం ద్వారా మరో రూ. 3.5 లక్షల కోట్ల మేర ఆర్థిక కార్యకలాపాలు జరగనున్నాయి. ఇందులో కల్యాణ మండపాలు, హోటళ్లు, రిసార్టులకు రూ. 60,000 కోట్లు, ఈవెంట్ మేనేజ్‌మెంట్, పూల అలంకరణకు రూ.37,500 కోట్లు దక్కనున్నాయి. అంతేకాకుండా ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ రంగానికి రూ. 22,500 కోట్లు, బ్యూటీ పార్లర్లు, మేకప్ సర్వీసులకు మరో రూ. 22,500 కోట్ల చొప్పున వ్యాపారం జరగనుంది. రవాణా, సంగీత విభావరి, బ్యాండ్ మేళం వంటి అనుబంధ సేవలకు సైతం భారీ స్థాయిలో గిరాకీ ఏర్పడింది.

 ఈ వివాహాల సీజన్ కేవలం వ్యాపార వర్గాలకే కాకుండా సామాన్య శ్రామికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించనుంది. క్యాటరింగ్, డెకరేషన్, ఫొటోగ్రఫీ, టెంట్ హౌస్, రవాణా, ఈవెంట్ నిర్వహణ వంటి విభిన్న రంగాల్లో సుమారు 1.25 కోట్ల మందికి తాత్కాలిక ఉపాధి లభిస్తుందని సీఏఐటీ వెల్లడించింది. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న దేశీయ మార్కెట్లకు ఈ పెళ్లిళ్ల సీజన్ కొత్త కళను తీసుకురావడంతో పాటు ఆర్థిక వృద్ధికి కీలక చోదకశక్తిగా నిలవనుంది.

తర్వాత చదవండి