తెలంగాణ

Harish Rao : శూన్యహస్తంగా మారిన ‘అభయహస్తం’ : హరీశ్ రావు

4 నిమిషాల పఠనం

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అబద్ధపు హామీలపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ‘అభయహస్తం’ మేనిఫెస్టోకు మూడేళ్లు పూర్తయిందని, నేటికీ హామీల అమలు పూర్తి చేయలేదని హరీశ్ రావు మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అబద్ధపు హామీలపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ‘అభయహస్తం’ మేనిఫెస్టోకు మూడేళ్లు పూర్తయిందని, నేటికీ హామీల అమలు పూర్తి చేయలేదని హరీశ్ రావు మండిపడ్డారు. మంగళవారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు.

కాంగ్రెస్ పార్టీ గొప్పగా ప్రకటించుకున్న అభయహస్తం హామీలను అమలు చేయని మొండి హస్తంగా, శూన్య హస్తంగా మారిందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో తమకు భగవద్గీత, ఖురాన్, బైబిల్‌తో సమానమని, తూచా తప్పకుండా అమలు చేస్తామని మూడేళ్ల కిందట ఇదే రోజు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో నాటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని మాజీ మంత్రి గుర్తుచేశారు.

మూడేళ్లు పూర్తి..అభయహస్తానికి మోక్షమేది?

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడిచినా ప్రజలకు ఇచ్చిన హామీలకు దిక్కులేదని, అమలు ఊసే లేదని విమర్శించారు. ఓట్లు వేసిన ప్రజలనే కాదు, ఒట్లు వేసి దేవుళ్లను, పవిత్ర గ్రంథాలను సైతం మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని హరీశ్ రావు ఆరోపించారు.గాంధీభవన్ సాక్షిగా ప్రజలకు ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేదని ఖర్గే, రేవంత్ రెడ్డి, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలన్నారు. తొలి కేబినెట్‌లోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న హామీ నీటి మూటగానే మిగిలిందన్నారు. ఇప్పటివరకు 38 కేబినెట్ సమావేశాలు జరిగాయని, అయినా చట్టబద్ధత ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు.

6 గ్యారెంటీలు, 420 హామీలతో అరచేతిలో వైకుంఠం చూపించారని, అధికారంలోకి రాగానే హామీలకు తూట్లు పొడిచారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ పేరు చెప్పుకుని రాజకీయాలు చేసే కాంగ్రెస్ పార్టీ, గాంధీ భవన్ సాక్షిగా ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేకపోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ వైఖరి చూస్తే గాంధీ ఆత్మ కూడా క్షోభిస్తుందని దుయ్యబట్టారు. హామీలు అమలు చేయకుండా మూడేళ్లుగా ప్రజలను మభ్యపెట్టడమే కాంగ్రెస్ సాధించిన ఘనత అని అన్నారు. ఆ పార్టీ చేసిన మోసాన్ని తెలంగాణ ప్రజలు ఇప్పటికే గుర్తించారని, తగిన గుణపాఠం చెప్పడమే మిగిలి ఉందని స్పష్టంచేశారు.

#abhayahastham#empty hands#BRS#Harishrao#Congressparty#six guarentees#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి