TG: హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో ఏసీబీ అధికారులు చేసిన సోదాలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. ఈ తనిఖీలపై అధికారులు రిలీజ్ చేసిన ప్రకటనలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. పేదలకు అండగా ఉండాల్సిన ఆరోగ్యశ్రీ పథకంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
డిశ్చార్జ్ అయినా.. చనిపోయినా బిల్లులు ఆగలేదు!
టీజీ సేఫ్, డ్రగ్ కంట్రోల్, లేబర్ శాఖల ఆఫీసర్స్‌తో కలిసి ఏసీబీ బృందం నిమ్స్‌లో తనిఖీలు చేసింది. ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ పేషంట్స్ చికిత్స బిల్లుల విషయంలో జరిగిన గోల్మాల్ చూసి అధికారులే ఆశ్చర్యపోయారు. రోగులు చికిత్స చేయించుకుని డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిపోయిన తర్వాత కూడా వారి పేర్లతో బిల్లులు ప్రాసెస్ చేసినట్లు ఈ తనిఖీలో బయటపడింది. అంతేకాకుండా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన రోగుల పేర్లతోనూ బిల్లులు క్లెయిమ్ చేసే ప్రయత్నం జరిగినట్లు ఈ ప్రకటనలో చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది.
టెండర్లు లేకుండానే ఆరేళ్లుగా సేవలు!
కేవలం రోగుల బిల్లులే కాకుండా, ఆస్పత్రి నిర్వహణకు సంబంధించిన టెండర్లు, ఉద్యోగాల భర్తీలోనూ రూల్స్‌ను పక్కన పెట్టేశారని ఏసీబీ తేల్చింది. 2019 నుంచి 2025 మధ్య కాలంలో మ్యాన్‌పవర్ టెండర్ల ప్రక్రియను పూర్తి చేయకుండానే పాత వాళ్లతోనే సేవలను కొనసాగించినట్లు తనిఖీల్లో తేలింది.
ఆస్పత్రిలో ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరగడంతో పాటు, క్యాంటీన్ టెండర్ల కేటాయింపుల్లోనూ రూల్స్ పాటించలేదని అధికారులు గుర్తించారు. సెక్యూరిటీ సర్వీస్ టెండర్లలో తీవ్ర ఆలస్యం జరిగినట్లు, అలాగే ఆస్పత్రిలోని మెడికల్ షాపులో మందుల రికార్డులను సరిగ్గా నిర్వహించలేదని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.
సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందాల్సిన ప్రభుత్వ ఆస్పత్రిలో ఇలాంటి అక్రమాలు జరగడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ తనిఖీల్లో దొరికిన ఆధారాల ప్రకారం బాధ్యులైన వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
