PM Fasal Bima Yojana: ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలు, తుఫాన్లు, చీడపురుగుల దాడితో రైతులు తీవ్రంగా నష్టపోతుంటారు. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి అన్నదాతలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన' (PMFBY) పథకాన్ని అమలు చేస్తోంది. అయితే, చాలామంది రైతులకు పంట నష్టపోయాక ఆఫీసుల చుట్టూ తిరగకుండా, కేవలం తమ ఫోన్‌లోని వాట్సాప్ ద్వారానే నిమిషాల్లో పరిహారం కోసం క్లెయిమ్ చేసుకునే అద్భుతమైన సౌకర్యం ఉందన్న విషయం తెలియదు.
తక్కువ ప్రీమియం.. ఎక్కువ పరిహారం!
పీఎం కిసాన్ ద్వారా ఏటా రూ. 6 వేల ఆర్థిక సాయం అందిస్తున్న కేంద్రం, రబీ, ఖరీఫ్ సీజన్లలో పంటలకు బీమా రక్షణ కల్పిస్తోంది. తుఫాన్లు, భారీ వర్షాలు, వరదలు, కరువు, భూకంపాలు, చీడపురుగులు లేదా జంతువుల దాడి వల్ల పంట దెబ్బతింటే ఈ స్కీమ్ కింద వెంటనే నష్టపరిహారం అందుతుంది. పంటను బట్టి చాలా తక్కువ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ప్రతి పంటకు వేర్వేరుగా ప్రీమియం, బీమా మొత్తం ఉంటాయి. దాని ఆధారంగానే నష్టపరిహారం అందిస్తారు.
ఇంట్లో నుంచే దరఖాస్తు.. ఎలాగంటే?
దీనికి దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ బుక్, బ్యాంక్ పాస్ బుక్, పంట వివరాలు ఉంటే సరిపోతుంది. ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి 'క్రాప్ ఇన్సూరెన్స్' యాప్ డౌన్‌లోడ్ చేసుకుని, మీ మొబైల్ నెంబర్‌తో లాగిన్ అవ్వాలి. తర్వాత రిజిస్ట్రేషన్ ట్యాబ్‌పై క్లిక్ చేసి మీ పేరు, ఆధార్ నెంబర్, జిల్లా, మండలం, గ్రామం, బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత ఖరీఫ్ లేదా రబీ సీజన్ ఎంచుకుని, మీ భూమి, సాగు చేసిన పంట వివరాలతో పాటు అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. ఇప్పుడు మీ పంటకు నిర్ణయించిన ప్రీమియంను బ్యాంక్ ఖాతా ద్వారా చెల్లించి, వచ్చే స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరుచుకోవాలి.
పంట నష్టపోతే వాట్సాప్‌లో ఇలా క్లెయిమ్ చేసుకోండి..
ఒకవేళ ప్రకృతి విపత్తుల వల్ల పంట దెబ్బతింటే ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. నేరుగా మీ ఫోన్‌లో ఇలా చేయండి. ముందుగా PMFBY అధికారిక చాట్‌బాట్ నెంబర్ 7065514447 కు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి వాట్సాప్‌లో 'Hi' అని మెసేజ్ పంపండి. అక్కడ కనిపించే ఆప్షన్లలో 'క్రాప్ లాస్ ఇంటిమేషన్' ఎంచుకుని, మీ సీజన్ (రబీ/ఖరీఫ్), సంవత్సరం సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ భూమి సర్వే నెంబర్ల ఆధారంగా పంట వివరాలను ఎంచుకోండి. ఆ తర్వాత పంట నష్టానికి కారణం (తుఫాన్, భారీ వర్షాలు, కరువు, చీడపురుగులు, జంతువుల దాడి వంటివి), నష్టం జరిగిన తేదీని నమోదు చేయండి. చివరగా దెబ్బతిన్న పంట ఫోటోలను అప్‌లోడ్ చేయగానే మీ దరఖాస్తు పూర్తయి, ఒక అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ సాయంతో మీ పరిహారం స్టేటస్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.


