పోలియో మహమ్మారి నుంచి పిల్లలను కాపాడేందుకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ సబ్-నేషనల్ ఇమ్యునైజేషన్ డే (SNID-2026)లో భాగంగా ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆదివారం (నవంబర్ 22) ఉదయం 7 గంటల నుంచే హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, హనుమకొండ జిల్లాల్లో ఐదేళ్లలోపు చిన్నారులకు రెండు చుక్కల ఓరల్ పోలియో వ్యాక్సిన్ (bOPV) వేసే ప్రక్రియ మొదలైంది. సాయంత్రం 6 గంటల వరకు అన్ని పోలియో బూత్‌లలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలని అధికారులు కోరారు.
ఈ ఐదు జిల్లాల్లో కలిపి మొత్తం 18,01,698 మంది చిన్నారులకు టీకా వేయాలని ఆరోగ్య శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకోసం 7,428 పోలియో బూత్‌లు, 245 మొబైల్ బృందాలు, ప్రయాణికుల సౌకర్యార్థం 245 ట్రాన్సిట్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఆదివారం బూత్‌లకు రాలేని చిన్నారుల కోసం నవంబర్ 23, 24 తేదీల్లో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నారు. అంతేకాకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో నవంబర్ 25వ తేదీన కూడా ఈ ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
ముఖ్యంగా వలస కుటుంబాలు, సంచార జాతులు, భవన నిర్మాణ కార్మికులు, ఇటుక బట్టీల వద్ద పనిచేసే కూలీలు, మురికివాడలు, గిరిజన, మత్స్యకార గ్రామాల్లోని చిన్నారులపై వైద్య సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఏ ఒక్క చిన్నారి కూడా టీకాకు దూరం కాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అలాగే జీహెచ్ఎంసీ పరిధిలోని 1,165 అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో ఉన్న 6,172 డిజిటల్ స్క్రీన్లపై మూడు రోజుల పాటు పోలియో చుక్కల ఆవశ్యకతపై అవగాహన సందేశాలను ప్రదర్శిస్తున్నారు.
భావి తరాల ఆరోగ్య భద్రత దృష్ట్యా తల్లిదండ్రులంతా బాధ్యతగా వ్యవహరించి, ఐదేళ్లలోపు ఉన్న తమ పిల్లలకు తప్పనిసరిగా రెండు చుక్కల పోలియో టీకా వేయించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఉన్నతాధికారులు పిలుపునిచ్చారు. బూత్‌లకు వెళ్లలేని పరిస్థితి ఉంటే తదుపరి రోజుల్లో ఇంటికి వచ్చే ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని సూచించారు.
