తెలంగాణ

Cancer cure Immune system : క్యాన్సర్‌‌ను గుర్తుపెట్టుకుని అంతం చేసే రోగనిరోధక శక్తి!

మనిషి శరీరంలో రోగనిరోధక శక్తికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అదే లేకపోతే నిత్యం జబ్బుల బారిన పడి అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే చాన్స్ ఉంది. అయితే, ఈ రోగనిరోధకశక్తికి ప్రత్యేకంగా మొమెరీ పవర్ ఉంటుందని చాాలా మందికి తెలీదు.

మనిషి శరీరంలో రోగనిరోధక శక్తికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అదే లేకపోతే నిత్యం జబ్బుల బారిన పడి అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే చాన్స్ ఉంది. అయితే, ఈ రోగనిరోధకశక్తికి ప్రత్యేకంగా మొమెరీ పవర్ ఉంటుందని, గతంలో దాడి చేసిన సూక్ష్మజీవులను గుర్తుపెట్టుకుని, అవి మళ్లీ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు వేగంగా స్పందించి వాటిపై ఎదురుదాడి చేసి చంపేశాయని సైంటిస్టులు తాజా పరిశోధనలో గుర్తించారు.

అయితే, ఇదే తరహా జ్ఞాపకశక్తిని క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా కూడా బలోపేతం చేయవచ్చని అమెరికాకు చెందిన ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ 'రీజెనెరాన్ ఫార్మాస్యూటికల్స్' శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. క్యాన్సర్‌ను అంతం చేసే మందులు, కొత్తగా రూపొందించిన ఒక ప్రయోగాత్మక యాంటీబాడీని (Antibody)ని కలిపి శాస్త్రవేత్తలు ఎలుకలపై ప్రయోగించారు.ఈ టెస్టులో రొమ్ము, కడుపు క్యాన్సర్ల చికిత్సలో వాడే 'ఎన్‌హెర్తు' (ట్రాస్టుజుమాబ్ డెరుక్స్‌టెకాన్) అనే మందును ఉపయోగించారు.

క్యాన్సర్ కణాల నాశనం..

ఇది క్యాన్సర్ కణాలపై ఉండే 'HER2' అనే ప్రోటీన్‌ను గుర్తించి, ఆ కణాలను వెంటనే నాశనం చేస్తుంది. దీనికి తోడుగా, రోగనిరోధక కణాలైన 'T-సెల్స్'ను ఉత్తేజపరిచే 'బైస్పెసిఫిక్ యాంటీబాడీ'ని జతచేశారు. ఇది ఒకవైపు క్యాన్సర్ కణాన్ని, మరోవైపు T-సెల్స్‌పై ఉండే 'CD28' ప్రోటీన్‌ను బంధించి క్యాన్సర్‌పై దాడిని తీవ్రతరం చేస్తుంది. కేవలం క్యాన్సర్ మందు మాత్రమే ఇచ్చినప్పుడు సగం కంటే తక్కువ ఎలుకలలోనే కణుతులు పూర్తిగా తగ్గినట్టు తెలిసింది. కానీ, కొత్త యాంటీబాడీతో కలిపి ఇచ్చినప్పుడు ప్రయోగంలో పాల్గొన్న 9 ఎలుకలన్నింటిలోనూ క్యాన్సర్ కణుతులు పూర్తిగా మాయమయ్యాయని సమాచారం.

క్యాన్సర్ కణుతులు తగ్గిన 4 వారాల తర్వాత, అదే ఎలుకలకు మళ్లీ అదే రొమ్ము క్యాన్సర్ కణాలను ఎక్కించారు. ఎలాంటి అదనపు చికిత్స లేకుండానే, వాటి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఆ క్యాన్సర్ కణాలను గుర్తించి తిప్పికొట్టింది. ఇదే ఎలుకలకు వేరొక రకమైన (పెద్దపేగు) క్యాన్సర్ కణాలను ఎక్కించినప్పుడు అవి పెరిగాయి. దీనిని బట్టి రోగనిరోధక వ్యవస్థ కేవలం ఒక ప్రోటీన్‌ను మాత్రమే కాకుండా, మొదటి క్యాన్సర్ కణాల ప్రత్యేక లక్షణాలను గుర్తుపెట్టుకుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

మానవులపై ప్రాథమిక దశ పరీక్షల్లో ఉన్న 'EGFR' లక్ష్యంగా పనిచేసే మరో ప్రయోగాత్మక యాంటీబాడీని ‘ఎన్‌హెర్తు’తో కలిపి ఇచ్చినప్పుడు, మొండి రొమ్ము క్యాన్సర్ కణుతులు ఉన్న 75 శాతం ఎలుకల్లో క్యాన్సర్ నయమైందని సమాచారం. ఇక పెద్దపేగు క్యాన్సర్‌లో వాడే 'ఫ్లోరోయురాసిల్' (5-FU) కీమోథెరపీ మందుతో ఈ యాంటీబాడీని కలిపినప్పుడు, విడివిడిగా పనిచేయని కణుతుల పెరుగుదలను కూడా సమర్థవంతంగా అడ్డుకున్నట్టు తెలిసింది. ఈ చికిత్సలో 'CD8 T-సెల్స్', 'నేచురల్ కిల్లర్ (NK) సెల్స్', క్యాన్సర్ ఆనవాళ్లను గుర్తించే 'డెండ్రిటిక్ కణాలు' కీలక పాత్ర పోషిస్తున్నాయని తేలింది. కాగా, ఎలుకలపై జరిగిన ఈ ప్రయోగాల ద్వారా మనుషుల్లో ఊపిరితిత్తులు, పేగులు, గుండె, చర్మంపై కలిగే దుష్ప్రభావాలను పూర్తిగా అంచనా వేయలేమని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. మనుషుల్లో దీని భద్రత, సమర్థతపై మరిన్ని లోతైన పరిశోధనలు జరగాల్సి ఉంది.

తర్వాత చదవండి