క్రైమ్

Accident : అనంతగిరిలో ఘోర ప్రమాదం.. నలుగురు దుర్మరణం

రాష్ట్రంలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం ఆదివారం చోటుచేసుకుంది.

రాష్ట్రంలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం ఆదివారం చోటుచేసుకుంది. బుగ్గరామేశ్వరం సమీపంలో ఓ మూల మలుపు వద్ద ఎదురెదురుగా వస్తున్న లారీ, ఆటో బలంగా ఢీకొన్నాయి. ఈ యాక్సిడెంట్‌లో ఆటోలో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్యాసింజర్స్ అక్కడికక్కడే మృతిచెందారు.

పెండ్లి మడుగు గ్రామం నుంచి కేరెళ్లి వైపు వెళ్తుండగా ఈ విషాదకర ఘటన సంభవించింది. లారీ బలంగా ఢీకొనడంతో ప్రమాద తీవ్రతకు ఆటో మొత్తం నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.దీంతో స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

ఆటోలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. మృతులు పెండ్లిమడుగుకు చెందిన చంద్రమ్మ, పార్వతమ్మ, సరిత, నాగేష్‌గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు తెలిసింది.

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఒకేసారి మరణించడంతో పెండ్లిమడుగు గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వేగంగా లారీ నడుపుతూ వచ్చి ఆటోను ఢీకొట్టిన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.

తర్వాత చదవండి