AP Cabinet Decisions: ఏపీ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దాదాపు రెండున్నర గంటల పాటు వర్చువల్ గా జరిగిన ఈ సమావేశంలో 30కి పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు-ఎస్ఐపీబీ, సీఆర్డీయే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. పరిశ్రమల ఏర్పాటులో జాప్యాన్ని నివారించేందుకు తీసుకొచ్చిన ఎంఎస్ఎంఈ రైట్ టు బిజినెస్ బిల్లుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రాజధానిలో అభివృద్ధి పనులకు రూ.180కోట్లు
రాజధాని అమరావతిలో గ్రీన్ వర్క్స్ ప్యాకేజ్-2 కింద రూ.180.68 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోద ముద్ర వేసింది. రాజధాని అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ భవనం, సచివాలయ నిర్మాణ పనులకు నిధుల కేటాయింపునకు కూడా మంత్రివర్గం అంగీకరించింది. మౌలిక వసతుల అభివృద్ధికి రూ.1215 కోట్లు కేటాయించారు.
సీఐఐ సదస్సులో ఒప్పందాలకు ఆమోదం
ఇక, సీఐఐ సదస్సులో ఒప్పందాలు చేసుకున్న ఆరు సంస్థల పెట్టుబడి ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వీటి ద్వారా సుమారు రూ.36 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. అలాగే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. సత్యసాయి జిల్లా పెనుకొండలో రూ.19వేల కోట్లతో కియా రెండో ఆటోమొబైల్ ప్లాంట్ విస్తరణకు, శ్రీకాకుళం జిల్లాలో రూ.13వేల 667 కోట్లతో అదానీ ఇంటిగ్రేటెడ్ టైటానియం కాంప్లెక్స్, అచ్యుతాపురంలో రూ.1800 కోట్లతో సెయింట్ గోబియన్ ఫ్లోట్ గ్లాస్ తయారీ పరిశ్రమ ఏర్పాటునకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పరిశ్రమలు, పెట్టుబడులు, రాజధాని నిర్మాణం, ఉపాధి కల్పనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. క్యాబినెట్ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
