తెలంగాణ

Telangana Weather: హైదరాబాద్‌లో వర్షం.. రాష్ట్రంలో చలి మరింత పెరుగుతుందా?

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా, హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా, హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది. దీంతో రహదారులపై నీరు చేరగా, కొన్ని కాలనీల్లో వర్షపు నీరు ప్రవహించింది.

ఇటీవల వర్షాలు లేక భూగర్భ జలాలు తగ్గి, తాగునీటి సమస్యలు, ట్యాంకర్ల డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఈ వర్షం నగరవాసులకు కొంత ఊరటనిచ్చింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. నేడు కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది.

ముఖ్యంగా నెల్లూరు, కర్నూలు, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇక తెలంగాణలో రానున్న ఐదు రోజుల్లో చలి తీవ్రత మరోసారి పెరగనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. డిసెంబర్ 3 వరకు రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉండటంతో రాత్రి, తెల్లవారుజామున చలి ప్రభావం పెరుగుతుందని అంచనా వేసింది. ఇప్పటికే కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు పేర్కొంటూ, రానున్న రోజుల్లో ప్రజలు చలిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

తర్వాత చదవండి