AP : బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అక్వాన్’ తుపాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు పెను గండంగా మారింది. ప్రస్తుతం దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఈ తుపాను.. గంటగంటకూ మరింత బలపడుతూ ఏపీ వైపు దూసుకొస్తోంది. ఇవాళ రాత్రికి తీవ్ర తుపానుగా, ఎల్లుండి ఉదయానికి ‘అతి తీవ్ర తుపాను’గా మారే ప్రమాదం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ హెచ్చరించారు.
ఆ రెండు రోజులు అత్యంత కీలకం.. ఇళ్లలోనే ఉండండి..
తుపాను ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కోస్తా జిల్లాల్లో వాతావరణం బీభత్సంగా మారనుంది. కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. గురు, శుక్రవారాల్లో కోస్తా తీర ప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు స్పష్టం చేశారు. ఈదురుగాలులు, భారీ వర్షాల వల్ల పంట నష్టం జరగకుండా రైతులు వ్యవసాయ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
శుక్రవారం మధ్యాహ్నం తీరం దాటే ఛాన్స్
గడిచిన ఆరు గంటల్లో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదిలిన అక్వాన్ తుపాను.. ప్రస్తుతం చెన్నైకి 590 కి.మీ, మచిలీపట్నానికి 650 కి.మీ, విశాఖపట్నానికి 660 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 780 కి.మీ దూరంలో ఉంది. పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణిస్తున్న ఈ తుపాను, శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు – విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుపాను అతి తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉన్నందున తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.


