BJP: హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన భారత్ సమ్మిట్ పై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆ సదస్సులో ఓ విదేశీయుడు భారత దేశాన్ని విమర్శిస్తుంటే ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ చప్పట్లు కొట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు. ఇది ముమ్మాటికే దేశద్రోహమే అన్నారు. ఈ అంశంపై ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డీజీపికి ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. విదేశీయుడి మీద ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏంటో చెప్పాలని డీజీపీని డిమాండ్ చేశారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. దేశ ద్రోహానికి పాల్పడ్డ రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ లను వెంటనే అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకి తరలించాలని డిమాండ్ చేశారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
140కోట్ల మంది భారతీయులను అవమానించడమే
''కాంగ్రెస్ పార్టీ.. ఇటలీ నుంచి ఒక విదేశీ నాయకుడిని తీసుకొచ్చి, మన దేశాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేస్తుంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చప్పట్లు కొట్టడం 140 కోట్ల మంది భారతీయులను అవమానించడమే. దేశ గౌరవాన్ని, సార్వభౌమాధికారాన్ని కించపరిచిన ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలపై దేశద్రోహ కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు పంపాలి'' అని డిమాండ్ చేశారు.
దేశద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేయాలి
''యూరోపియన్ సోషలిస్ట్ పార్టీ సెక్రటరీ జనరల్, ఇటలీ నేత ఓట్ చోర్ గద్దీ చోడ్ అని నినాదాలు చేస్తే, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతుంటే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చప్పట్లు కొట్టడం ఈ దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదా? అని ప్రశ్నిస్తున్నా. ఇది ముమ్మాటికీ దేశద్రోహం కాదా? వారి మీద దేశద్రోహం కేసు ఎందుకు పెట్టకూడదు? వారిని ఎందుకు అరెస్ట్ చేయకూడదు? దీనికి సమాధానం చెప్పాలి. రామచంద్రరావు డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. దీని మీద ఏం చర్యలు తీసుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత డీజీపీ మీద ఉంది. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. రాహుల్ గాంధీ ఎక్కడున్నా అరెస్ట్ చేసి హైదరాబాద్ చంచల్ గూడ జైలుకి తరలించాలి.
భారత సమ్మిట్ కు పెట్టిన ఖర్చు లెక్కలు కూడా బయట పెట్టాలి. సమ్మిట్ కు రాష్ట్ర ఖజానా నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టిన రేవంత్ రెడ్డి.. కనీసం ఇటలీ నేత వ్యాఖ్యలకు అడ్డు చెప్పలేదు. ఇది తప్పు అని వాదించలేదు. పైగా సమర్థిస్తూ, చప్పట్లు కొట్టడాన్ని చూసి దేశ ప్రజలంతా విస్తుపోయారు. భారత్ సమ్మిట్ పేరుతో 100 కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేశారు. విదేశీయులను పిలిచి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు'' అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు.


