తెలంగాణ

తెలంగాణకు బీజేపీ నేషనల్ లీడర్స్... క్యూ! ఏం జరుగుతోంది?

బీజేపీ ఆలోచనలు, కార్యక్రమాలు మిగిలిన పార్టీలకు అందని స్థాయిలో ఉంటాయా..? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం చెప్పాల్సిందే. ఎందుకంటే.. వాళ్లు ఏ రాష్ట్రంపైనైనా ఫోకస్ చేశారంటే చాలా ముందుగానే రంగంలోకి దిగుతారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరుగుతోంది. వరుసగా మూడు రోజుల పాటు పార్టీకి చెందిన కీలక జాతీయ నేతలు తెలంగాణలో పర్యటించనుండటం ఈ చర్చకు కారణం.

తెలంగాణలో బీజేపీ జాతీయ నాయకుల దండయాత్ర

వరుస పర్యటనలకు స్కెచ్

హైదరాబాద్ కు అమిత్ షా.. కరీంనగర్ కు నితిన్ నబీన్

సిద్దిపేటలో జేపీ నడ్డా ర్యాలీకి ప్లాన్

బీజేపీ ఆలోచనలు, కార్యక్రమాలు మిగిలిన పార్టీలకు అందని స్థాయిలో ఉంటాయా..? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం చెప్పాల్సిందే. ఎందుకంటే.. వాళ్లు ఏ రాష్ట్రంపైనైనా ఫోకస్ చేశారంటే చాలా ముందుగానే రంగంలోకి దిగుతారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరుగుతోంది. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా జాతీయ నాయకత్వం ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. వరుసగా మూడు రోజుల పాటు పార్టీకి చెందిన కీలక జాతీయ నేతలు తెలంగాణలో పర్యటించనుండటం ఈ చర్చకు కారణం. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి జేపీ నడ్డా వరకు వరుసగా రాష్ట్రానికి రానున్నారు. మరోవైపు ఈనెల 26న రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమానికి కూడా ఒక కేంద్ర మంత్రి హాజరయ్యే అవకాశముంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే తెలంగాణపై బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.

కరీంనగర్ కు నితిన్ నబీన్

ఈ నెల 23న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కరీంనగర్‌లో పర్యటించనున్నారు. రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహా పాదయాత్రలో ఆయన పాల్గొంటారు. 'ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం – అరాచకత్వాన్ని పాతరేద్దాం' అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌కు చేరుకునే నితిన్ నబీన్.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కరీంనగర్‌కు వెళ్తారు. మధ్యాహ్నం 12 గంటలకు వైశ్యాభవన్ వద్ద పాదయాత్ర ప్రారంభమవుతుంది. టవర్ సర్కిల్, శాస్త్రీ రోడ్డు మీదుగా కమాన్ వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సహా పలువురు ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

SIRపై విపక్షాలు రాజ్యాంగ సంస్థలకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. ప్రజలకు వాస్తవాలు వివరించేందుకే ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు పార్టీ నాయకత్వం చెబుతోంది. ఈ అంశాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.

24న హైదరాబాద్ కు అమిత్ షా

నితిన్ నబీన్ పర్యటన మరుసటి రోజే కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నెల 24న ఆయన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వస్తున్నారు. సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి ఇందిరాపార్క్ దగ్గరకు చేరుకుంటారు. ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఐతే ఈ కార్యక్రమం ముగిశాక.. పార్టీ కీలక నేతలతో అమిత్ షా సమావేశమవుతారని తెలుస్తోంది. నాయకులకు దిశా నిర్దేశం చేసి.. ఆ రాత్రికే మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు షా.

రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, సంస్థాగత నిర్మాణం, నాయకుల మధ్య సమన్వయం, భవిష్యత్ రాజకీయ కార్యాచరణ వంటి అంశాలపై అమిత్ షా నేతలకు దిశానిర్దేశం చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. గత కొంతకాలంగా తెలంగాణలో పార్టీ సంస్థాగత బలోపేతంపై బీజేపీ నాయకత్వం దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో అమిత్ షా పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.

25న సిద్దిపేటలో జేపీ నడ్డా ర్యాలీ

ఇక ఈనెల 25న కేంద్ర మంత్రి జేపీ నడ్డా సిద్దిపేటలో జరిగే మహా పాదయాత్రలో పాల్గొననున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈ కార్యక్రమాన్ని కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కరీంనగర్‌లో నితిన్ నబీన్, సిద్దిపేటలో జేపీ నడ్డా పర్యటనల ద్వారా ఉత్తర తెలంగాణతో పాటు మెదక్ ప్రాంతంలోనూ పార్టీ కార్యకర్తలను సమీకరించాలని బీజేపీ భావిస్తోంది.

సిద్దిపేటకు ప్రత్యేక రాజకీయ ప్రాధాన్యం ఉంది. బీఆర్ఎస్ కు మంచి పట్టున్న ఈ ప్రాంతంలో బీజేపీ మహా పాదయాత్ర నిర్వహించడం రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలతో పాటు SIR, రాజ్యాంగ సంస్థల అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈ పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో బీజేపీ తన రాజకీయ ఉనికిని మరింత బలంగా చాటుకోవాలని ప్రయత్నిస్తోంది.

రాజ్యాంగ దినోత్సవానికి మరో కేంద్రమంత్రి..?

ఇదే సమయంలో నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమానికి మరో కేంద్ర మంత్రి హాజరయ్యే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇలా వరుసగా నాలుగు రోజుల వ్యవధిలో జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి, మరో కీలక కేంద్ర మంత్రి తెలంగాణలో పర్యటించనుండటంతో రాష్ట్ర బీజేపీలో ఉత్సాహం కనిపిస్తోంది.

తెలంగాణపై బీజేపీ వ్యూహమేంటి..?

తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతోంది. మరోవైపు బీజేపీ కూడా రాష్ట్రంలో తన రాజకీయ బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. జాతీయ నాయకుల వరుస పర్యటనల ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడం, కేంద్ర నాయకత్వం అండగా ఉందనే సందేశం ఇవ్వడం, స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేయడం వంటి లక్ష్యాలు ఉండవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

మరి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని రాజకీయంగా ఎలా వినియోగించుకుంటుంది? బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా తనను తాను ఎలా నిలబెట్టుకుంటుంది? స్థానిక సమస్యలపై ఎలాంటి పోరాటాలు చేపడుతుంది? అన్న అంశాలే బీజేపీకి కీలకంగా మారనున్నాయి. ఐతే షెడ్యూల్ ప్రకారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయముంది. అయినా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ తో పోటీ విషయంలో ఎక్కడా వెనుకపడొద్దనేది కమలనాథుల వ్యూహంగా కనిపిస్తోంది.

తర్వాత చదవండి