* కొల్లాపూర్లో అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవాలు
* వేడుకల్లో పాల్గొన్న మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి
Jupally Krishna Rao: కొల్లాపూర్లో నిర్వహించిన అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవాల్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులకు వారు శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు పేర్కొన్నారు. మత్స్యకారుల కష్టానికి తగిన ఆదాయం వచ్చేలా చేపల ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని అన్నారు.
కొల్లాపూర్ మత్స్యకారుల కోసం కోల్డ్ స్టోరేజ్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు కొత్తగా నిధులు మంజూరు చేయాలని, మత్స్యకారుల అభివృద్ధి కోసం 100 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా అవసరమైన నిధులు సమకూర్చి ఈ ప్రాంత మత్స్యకారులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.
అంతకుముందు అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామంలో పండుగ సాయన్న విగ్రహాన్ని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ఆవిష్కరించారు. పండుగ సాయన్న ఆశయాలను ఆదర్శంగా తీసుకొని పేదలు, బడుగు బలహీన వర్గాలు, మత్స్యకారుల అభ్యున్నతికి సమష్టిగా కృషి చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు.
