జాతీయం

రాముడి కథలో రావణుడి హవా? రణ్‌బీర్ రామాయణంపై ముదురుతున్న వివాదం..!

రామాయణమంటే.. అతో అద్భుత ఘట్టం. ప్రతి హిందువుకీ చిరస్మరణీయ జ్ఞాపకం. భారతీయుల హృదయాల్లో రాముడికి ఉన్న స్థానమది. అలాంటి రామాయణాన్ని వెండితెరపై ఆవిష్కరించాలంటే దర్శక నిర్మాతలకు ఎంతటి బాధ్యత ఉండాలి? కానీ రామాయణ పార్ట్ 1పై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. దీనికి కారణాలేంటి..?

రణ్‌బీర్ రామాయణంపై రణరంగం

సినిమాలో రావణుడికి పెద్దపీట వేశారా..?

సిన్మా బ్యాన్ డిమాండ్ తో ముదిరిన వివాదం

రాముడి పాత్ర నుంచి సీత యుద్ధం వరకు...

సినిమాలో అసలేం చూపించారు..?

రామాయణమంటే.. అతో అద్భుత ఘట్టం. ప్రతి హిందువుకీ చిరస్మరణీయ జ్ఞాపకం. భారతీయుల హృదయాల్లో రాముడికి ఉన్న స్థానమది. రామాయణం అనేది కేవలం ఒక కథ కాదు. తరతరాలుగా మన సమాజాన్ని ప్రభావితం చేస్తున్న ఇతిహాసం. అలాంటి రామాయణాన్ని వెండితెరపై ఆవిష్కరించాలంటే దర్శక నిర్మాతలకు ఎంతటి బాధ్యత ఉండాలి? కథను ఆసక్తికరంగా చూపించాలనే పేరుతో పాత్రల స్వభావాలను మార్చవచ్చా? సృజనాత్మక స్వేచ్ఛ పేరుతో ఇతిహాసంలోని కీలక ఘట్టాలను కొత్తగా ఆవిష్కరించవచ్చా? ఎంత దారుణమిది..? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ ప్రశ్నలే చర్చనీయాంశంగా మారాయి.

నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రామాయణ పార్ట్-1. ఇందులో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ నటించారు. నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ బడ్జెట్, అంతర్జాతీయ స్థాయి సాంకేతికత, స్టార్ కాస్టింగ్‌తో రూపొందిన ఈ సినిమా విడుదలకు ముందే ఎన్నో వివాదాలను ఎదుర్కొంది. అయితే ఇప్పుడు వివాదం మరో స్థాయికి చేరింది. రావణుడి పాత్రను గొప్పగా చూపించారని, రాముడి పాత్రను తక్కువ చేసి చూపించారని ఆరోపిస్తూ విశ్వహిందూ పరిషత్ ఏకంగా సినిమా షోలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తోంది.

సినిమాలో రావణుడిని గొప్పగా చూపించారా..?

వాల్మీకి రామాయణంలోని అసలు కథను మార్చేశారని, కొన్ని కల్పిత ఘట్టాలను చేర్చారని, ముఖ్యమైన పాత్రలు, సన్నివేశాలను తొలగించారని ఆరోపించారు విశ్వహిందూ పరిషత్ జనరల్ సెక్రటరీ బజరంగ్ లాల్ బగ్రా. రావణుడిని పేదలు, అణగారిన వర్గాలకు అండగా నిలిచే పాలకుడిగా చూపించేందుకు ప్రయత్నించారని వీహెచ్‌పీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రావణుడు గొప్ప పండితుడు, శివభక్తుడు అయినప్పటికీ అహంకారం, అధర్మం కారణంగా పతనమయ్యాడని రామాయణం చెబుతుందని.. అలాంటి వ్యక్తిని ప్రజల కోసం పనిచేసే నాయకుడిగా చూపించడం సరైనది కాదని వాదిస్తోంది.

ఇక్కడే మరో ఆసక్తికరమైన ప్రశ్న. రావణుడిలో ఉన్న పాండిత్యం, శివభక్తి, పరాక్రమాన్ని చూపించడం తప్పా? లేక ఆ లక్షణాలను చూపిస్తూ అతడి అధర్మాన్ని, అహంకారాన్ని తక్కువ చేసి చూపించడమే అసలు అభ్యంతరమా? ప్రతినాయకుడిలోని గొప్ప లక్షణాలను చూపించవచ్చు. కానీ అతడి తప్పులను కూడా అంతే స్పష్టంగా చూపించాల్సిన బాధ్యత దర్శకుడిపై ఉంటుంది. లేకపోతే పాత్ర చిత్రణలో అసలు ఉద్దేశమే మారిపోయే ప్రమాదం ఉంది. పైగా ఇది మన చరిత్ర, సంప్రదాయాలతో ముడిపడిన ఇతిహాసం.

రాముడి పోరాటం ప్రతీకారమా..?

రాముడి పాత్రకు సంబంధించిన మరో అంశాన్ని కూడా వీహెచ్‌పీ లేవనెత్తుతోంది. రాముడు రావణుడిపై యుద్ధం చేయడానికి కారణం కేవలం సీతను అపహరించడమే కాదని, సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేస్తూ యజ్ఞాలు, తపస్సులు చేసుకునే ఋషులను వేధిస్తున్న రాక్షస శక్తులను అంతం చేయడం కూడా ఆయన లక్ష్యమని వీహెచ్‌పీ చెబుతోంది. కానీ సినిమాలో రాముడి పోరాటాన్ని సీత అపహరణకు ప్రతీకారంగా చూపించారని ఆరోపిస్తోంది.

అంతేకాదు, అహల్యకు విముక్తి కల్పించే ఘట్టం, నిషాదరాజు గుహతో రాముడి స్నేహం, కేవటుడి భక్తి వంటి కీలక అంశాలు సినిమాలో కనిపించలేదని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఘట్టాలు రాముడిలోని కరుణ, సమానత్వ భావన, మానవీయతను తెలియజేస్తాయనేది వీహెచ్‌పీ వాదన. ఐతే ఇక్కడ మరో కీలక అంశం కూడా ఉంది. ఇది రెండు భాగాలుగా రూపొందుతున్న సినిమా. మొదటి భాగంలో కథకు సంబంధించిన కొన్ని ఘట్టాలను చూపించకపోతే, అవి రెండో భాగంలో ఉంటాయా లేదా అన్నది కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఒక ఘట్టం సినిమాలో లేదని మాత్రమే మొత్తం ఇతిహాసాన్ని వక్రీకరించినట్లు చెప్పలేమనేది మరికొందరి వాదన. కానీ ఏ ఘట్టాలను ఎందుకు తొలగించారన్న ప్రశ్నకు దర్శక నిర్మాతలు సమాధానం చెప్పాల్సిన అవసరమైతే ఉంది.

సీతను యోధురాలిగా చూపించారా..?

ఈ సినిమా చుట్టూ మొదటి నుంచీ ఎక్కువ చర్చకు కారణమైన అంశాల్లో సీత పాత్ర చిత్రీకరణ కూడా ఒకటి. సాయి పల్లవి పోషించిన సీత పాత్రను కొన్ని సన్నివేశాల్లో ఆయుధాలు పట్టి పోరాడే యోధురాలిగా చూపించడం వివాదానికి దారితీసింది. శక్తి, సహనం, త్యాగానికి ప్రతిరూపంగా భావించే సీతను యాక్షన్ సన్నివేశాల్లో చూపించడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వాల్మీకి రామాయణంలో సీత పాత్రకు ఉన్న స్వభావానికి ఇది భిన్నమని విమర్శిస్తున్నారు.

అయితే దర్శకుడు నితీశ్ తివారీ ఈ విమర్శలను సమర్థించడం లేదు. సంస్కృతంలోని అద్భుత రామాయణం, ఒడియా భాషలోని బిలంక రామాయణం వంటి ఇతర రామాయణ రూపాల్లో సీతను అపారమైన శక్తి కలిగిన యోధురాలిగా చిత్రించిన ఘట్టాలు ఉన్నాయని ఆయన వివరణ ఇచ్చారు. కొన్ని కథనాల్లో రాముడు ఒక సందర్భంలో అసమర్థుడైనప్పుడు సీత మహాకాళి రూపం ధరించి సహస్ర రావణుడిని సంహరిస్తుందని కూడా ప్రస్తావించారు. అంటే సీతను కేవలం కష్టాలను భరించిన మహిళగానే కాకుండా, అపారమైన శక్తికి ప్రతిరూపంగా కూడా కొన్ని రామాయణ రూపాలు చూపిస్తున్నాయనేది దర్శకుడి వాదన.

ముఖేష్ ఖన్నా ఫైర్.. రణ్‌బీర్‌పైనా విమర్శలు

ఈ సినిమాపై ప్రముఖ నటుడు ముఖేష్ ఖన్నా కూడా తీవ్రంగా స్పందించారు. రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్‌ను తాను అంగీకరించలేకపోయానని, తెరపై రాముడి కంటే రణ్‌బీర్ మాత్రమే కనిపించాడని అన్నారు. సినిమాలోని సీత స్వయంవరం సన్నివేశం, పరశురాముడి పాత్రకు ఇచ్చిన ప్రాధాన్యం, యాక్షన్ సన్నివేశాలపైనా ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సీతను యోధురాలిగా చూపించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. వాల్మీకి రామాయణంలో లేని అంశాలను తీసుకొచ్చి తమ సొంత కథనాన్ని జోడించవద్దని దర్శక, నిర్మాతలకు సూచించారు.

మరోవైపు మహాభారత్ టీవీ సీరియల్‌లో శ్రీకృష్ణుడిగా గుర్తింపు పొందిన నితీశ్ భరద్వాజ్ కూడా సినిమా కథనంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రైలర్ చూసినప్పుడు ప్రశంసించిన ఆయన, సినిమా చూసిన తర్వాత రావణుడి పాత్రకు ఇచ్చిన ప్రాధాన్యం, రామాయణంలోని ధర్మాధర్మాల చిత్రణపై విమర్శలు చేశారు. అయితే సినీ పరిశ్రమలో అందరూ ఇదే అభిప్రాయంతో లేరు. అనుపమ్ ఖేర్ సహా కొందరు ప్రముఖులు సినిమా విజువల్ వైభవాన్ని, నటీనటుల ప్రతిభను ప్రశంసించారు.

విడుదలకు ముందు నుంచీ వివాదాలే...

ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే రణ్‌బీర్ కపూర్‌ను రాముడిగా ఎంపిక చేయడంపై చర్చ జరిగింది. సాయి పల్లవిని సీతగా ఎంపిక చేయడం, ఆమె రూపం, వస్త్రధారణ, పాత్రకు సరిపోతుందా లేదా అనే అంశాలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సినిమాకు ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ సంగీతం అందించడం కూడా చర్చకు దారితీసింది. ముఖ్యంగా మంగళ్ రంగ్, రావణ తాండవ్ పాటల సంగీత శైలిపై కొందరు విమర్శలు చేశారు. సంప్రదాయ రామాయణ గాథకు తగిన భక్తిభావం కనిపించడం లేదని కొందరు అభిప్రాయపడ్డారు.

ఇక విజువల్ ఎఫెక్ట్స్ విషయంలోనూ ట్రైలర్ విడుదలైనప్పుడు విమర్శలు వచ్చాయి. కొన్ని సన్నివేశాలు కృత్రిమంగా కనిపిస్తున్నాయని, ఇంత భారీ బడ్జెట్ సినిమాకు మరింత మెరుగైన సాంకేతిక నాణ్యత ఉండాలని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. అయితే సినిమా విడుదలైన తర్వాత కొందరు ప్రేక్షకులు విజువల్ గ్రాండియర్‌ను, యష్ నటనను ప్రశంసించారు. మరికొందరు కథనంలో భావోద్వేగాలు తగ్గాయని, సంగీతం ఆశించిన స్థాయిలో లేదని విమర్శించారు.

భారీ కలెక్షన్లు.. అయినా వివాదాలు

ఇన్ని వివాదాల మధ్య కూడా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది. నవంబర్ 20 నాటికి 16 రోజుల వసూళ్లను పరిశీలిస్తే, ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1,574.60 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ ట్రాకర్ సాక్‌నిల్క్ చెబుతోంది. భారత్‌లో గ్రాస్ వసూళ్లు రూ.1,051 కోట్లకు చేరగా, ఓవర్సీస్ మార్కెట్ నుంచి రూ.523 కోట్ల వసూళ్లు వచ్చాయి. అయితే తొలి వారం తర్వాత వసూళ్ల వేగం తగ్గినట్లు కూడా వార్తలొస్తున్నాయి.

అంటే ఒకవైపు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తున్నా, మరోవైపు కథ, పాత్రలు, సంగీతం, సృజనాత్మక స్వేచ్ఛపై చర్చ ఆగడం లేదు. బాక్సాఫీస్ విజయం సాధించిందని విమర్శలకు సమాధానం దొరికినట్లు కాదు. అలాగే వివాదాలు ఉన్నాయని సినిమా మొత్తాన్ని ప్రేక్షకులు తిరస్కరించినట్లు కూడా కాదు.

ఇప్పుడు ఈ వివాదాన్ని ఒక కొత్త కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో రామాయణానికి వాల్మీకి రామాయణంతో పాటు అనేక భాషల్లో, ప్రాంతాల్లో భిన్నమైన కథనాలు ఉన్నాయి. తులసీదాస్ రామచరితమానస్ నుంచి కంబ రామాయణం వరకు ఎన్నో రూపాల్లో రామకథ ప్రజల్లోకి వెళ్లింది. అయితే ఒక సినిమా ఏ రామాయణాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించారు..? వాల్మీకి రామాయణాన్ని ప్రధానంగా తీసుకున్నట్లయితే దానికి ఎంతవరకు కట్టుబడి ఉండాలి..? ఇతర ప్రాంతీయ కథనాలను కలిపితే వాటి మూలాలను ప్రేక్షకులకు స్పష్టంగా తెలియజేయాలా..? ఇవన్నీ చర్చించాల్సిన ప్రశ్నలే.

మొత్తానికి ఎన్నో అంచనాల మధ్య విడుదలైన రామాయణం.. వివాదాల మధ్యే రికార్డులు క్రియేట్ చేస్తోంది. అయితే ఎన్ని రికార్డులు తిరగరాస్తున్నా.. వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాత్రం దర్శక, నిర్మాతలపై ఉంది.

తర్వాత చదవండి