తెలంగాణ

Manne Krishank: సీఎం కూతురు కార్పొరేట్ స్కూల్స్.. మంత్రి కుమార్తె ఇంటర్నేషనల్ స్కూల్స్!

Manne Krishank: సీఎం కూతురు కార్పొరేట్ స్కూల్స్.. మంత్రి కుమార్తె ఇంటర్నేషనల్ స్కూల్స్!

* సీఎం, మంత్రుల కుటుంబాలకు విద్యా వ్యాపారాలపై మోజు

* సీఎం కుమార్తె కార్పొరేట్ స్కూల్స్.. మంత్రి పొంగులేటి కుమార్తె ఇంటర్నేషనల్ స్కూల్స్ కంపెనీ

* ప్రభుత్వ బడులు, ఆసుపత్రులు పట్టించుకోరు.. ప్రైవేట్ వ్యాపారాలపై మాత్రం ఆసక్తి

* మంత్రుల కుటుంబాల వ్యాపారాల విలువ లక్ష కోట్లు దాటిందన్న మన్నె క్రిశాంక్

Manne Krishank తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుటుంబ సభ్యుల వ్యాపార వ్యవహారాలను ప్రస్తావిస్తూ పలు ఆరోపణలు చేశారు. ప్రభుత్వ విద్య, వైద్య రంగాలను నిర్లక్ష్యం చేస్తూ.. పాలకుల కుటుంబాలు ప్రైవేట్ విద్యా వ్యాపారాలపై దృష్టి పెడుతున్నాయని విమర్శించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడారు క్రిశాంక్.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమార్తె నైమిష రెడ్డి కార్పొరేట్ స్కూల్స్ వ్యాపారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూతురు కూడా నైమిష రెడ్డి బాటలోనే నడుస్తున్నారని క్రిశాంక్ తెలిపారు. మంత్రి పొంగులేటి కుమార్తె స్వప్ని రెడ్డి సైతం ప్రైవేట్ విద్యా వ్యాపారంపై దృష్టి పెట్టారని వెల్లడించారు. ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ స్కూల్స్ వ్యాపారాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. MAV EDU పేరుతో ఇంటర్నేషనల్ స్కూల్స్ కంపెనీని ఏర్పాటు చేసినట్లు వివరించారు. విద్యాశాఖ మంత్రికి సంబంధించిన కుటుంబం కార్పొరేట్ స్కూల్స్ నిర్వహిస్తుంటే, రెవెన్యూ శాఖ మంత్రికి సంబంధించిన కుటుంబం ఇంటర్నేషనల్ స్కూల్స్ వ్యాపారంలో ఉందని విమర్శించారు.

మూడేళ్లయినా ప్రారంభం కాని ఆసుపత్రులు

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య, విద్యా వ్యవస్థల పరిస్థితిపై క్రిశాంక్ ప్రశ్నలు సంధించారు. మూడేళ్లు గడుస్తున్నా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభానికి నోచుకోలేదన్నారు. టిమ్స్ అల్వాల్, టిమ్స్ సనత్ నగర్, టిమ్స్ ఎల్బీ నగర్ ఆసుపత్రులు కూడా ఇంకా ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంపై పాలకులకు ఆసక్తి లేదని ధ్వజమెత్తారు. ప్రైవేట్ రంగంలో మాత్రం వ్యాపారాలు విస్తరించుకుంటున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల పరిస్థితి దారుణంగా ఉందని క్రిశాంక్ వాపోయారు.

''సీఎం కూతురు కార్పొరేట్ స్కూల్స్‌ను చూసి మంత్రి పొంగులేటి కూతురు స్వప్ని రెడ్డి కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ కంపెనీ మొదలుపెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి కూతురు నైమిష రెడ్డి కార్పొరేట్ స్కూల్ గురించి అంద‌రికి తెలిసిందే. ప్రతి ఏడాది ఒక్క విద్యార్థి ఫీజు రూ.2.50 ల‌క్ష‌లు.. కొంప‌ల్లిలో, కొల్లూరు, కోకాపేట‌లో ర‌క‌ర‌కాల నెట్ వ‌ర్క్ కార్పొరేట్ స్కూల్స్ వేగంగా నిర్మిస్తున్నారు. ఒక్క‌టంటే ఒక్క గురుకుల పాఠ‌శాల‌వైపు రేవంత్ రెడ్డి పోరు.. అక్క‌డ ఫుడ్ పాయిజ‌నింగ్ అవుతుంటే.. విద్యార్థులు పురుగుల అన్నం తింటుంటే.. ఆస్ప‌త్రుల పాల‌వుతుంటే.. రేవంత్ రెడ్డికి ప‌ట్టింపు లేదు'' అని క్రిశాంక్ అన్నారు.

కేసీఆర్ పొలంపై ప్రశ్నలు.. మరి మీ వ్యాపారాల సంగతేంటి?

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పొలం ఉంటేనే పెద్ద నేరం చేసినట్లు కాంగ్రెస్ నాయకులు హడావిడి చేశారని క్రిశాంక్ మండిపడ్డారు. మరి పాలకుల కుటుంబాలకు సంబంధించిన స్కూల్స్, హ్యుందాయ్ షోరూమ్స్, మెడికవర్ ఆసుపత్రులు, డిఫెన్స్ కంపెనీలు, R9 కన్ స్ట్రక్షన్స్, మాల్స్ వంటి వ్యాపారాల సంగతేంటని ప్రశ్నించారు. ఈ వ్యాపారాలన్నింటి విలువ లక్ష కోట్ల రూపాయలు దాటిపోయిందని ఆయన ఆరోపించారు. పాలకుల కుటుంబాల వ్యాపారాలపై ఒక రకంగా, ప్రతిపక్ష నేతల ఆస్తులపై మరో రకంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు క్రిశాంక్.

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, ఆసుపత్రుల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు క్రిశాంక్. ప్రభుత్వ విద్య, వైద్య రంగాల అభివృద్ధి ఎప్పుడు? పాలకుల కుటుంబాల వ్యాపారాలపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పేదెవరు? అని నిలదీశారాయన.

తర్వాత చదవండి