తెలంగాణ

Nagarjuna Sagar Tunnel: ఏపీ జలదోపిడీకి సహకరిస్తున్న దొంగల వ్యవస్థ? టన్నెల్ నిర్మాణంపై అనేక అనుమానాలు

Nagarjuna Sagar Tunnel: ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదం ముదురుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తరలించేందుకు చేపడుతున్న భారీ టన్నెల్ నిర్మాణం తీవ్ర చర్చకు దారితీస్తోంది. నాగార్జునసాగర్ పరిధిలో చేపడుతున్న నీటి తరలింపు ప్రయత్నాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Nagarjuna Sagar Tunnel: ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదం ముదురుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తరలించేందుకు చేపడుతున్న భారీ టన్నెల్ నిర్మాణం తీవ్ర చర్చకు దారితీస్తోంది. నాగార్జునసాగర్ పరిధిలో చేపడుతున్న నీటి తరలింపు ప్రయత్నాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డెడ్ స్టోరేజ్‌లో నీరు ఉన్నప్పటికీ టన్నెల్ ద్వారా నీటిని తరలించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారనే ఆరోపణలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.

90 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించే కుట్ర

ఏపీ ప్రభుత్వం నాగార్జునసాగర్‌‌లో భారీ సొరంగం నిర్మించి, ఎలాంటి అనుమతులు లేకుండా, కేఆర్ఎంబీకి సమాచారం ఇవ్వకుండా 90 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించే కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ చేసిన ఆరోపణలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలం రేపాయి. ఇప్పటికే శ్రీశైలానికి కన్నమేసి పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తోడుకుంటున్న ఆంధ్రా పాలకులు ఇప్పుడు ఏకంగా నాగార్జునసాగర్‌‌కే కన్నం వేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.

తాగునీటి పథకం పేరుతో పైప్‌‌లైన్ నిర్మించి 90 టీఎంసీల నీటిని తరలించేందుకు ఏపీ ప్రయత్నిస్తోందని, పేరుకు తాగునీటి పథకమైనా దాని ముసుగులో సాగునీటిని కూడా తరలించే కుట్ర జరుగుతోందని కేటీఆర్ అంటున్నారు. ముఖ్యంగా డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని తీసుకోవడం వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఒకవైపు హైదరాబాద్ నగరానికి తాగునీటి అవసరాలు తీర్చుకోవడమే సవాల్ గా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో.. ఆంధ్రప్రదేశ్‌కు భారీగా నీటిని తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయనే వార్తలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల హయాంలో జరిగిన నీటి తరలింపుతో పోలిస్తే ప్రస్తుతం మరింత ఎక్కువగా నీటిని తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

9 నెలలుగా పనులు.. ప్రభుత్వానికి తెలియదా?

టన్నెల్ నిర్మాణ పనులు తొమ్మిది నెలలుగా కొనసాగుతున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రేవంత్ ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఎందుకు దృష్టి సారించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. 36 పవర్ ప్రాజెక్టులకు నీటిని తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నప్పటికీ, వాటికి సంబంధించిన నీటి లెక్కలు ఎందుకు బయటపెట్టడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

రైట్ బ్యాంక్ కెనాల్ ఉండగా టన్నెల్ ఎందుకు?

ఇప్పటికే రైట్ బ్యాంక్ కెనాల్ అందుబాటులో ఉండగా కొత్తగా భారీ టన్నెల్ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఏమిటన్నది మరో కీలక ప్రశ్న. గతంలో బనకచర్ల ప్రాజెక్టు వివాదం తెరపైకి రాగా, ఇప్పుడు భారీ టన్నెల్ నిర్మాణం చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్మాణం వెనకున్న అసలు ఉద్దేశం ఏమిటి? దీని ద్వారా ఎంత నీటిని తరలించనున్నారు? తెలంగాణకు కలిగే నష్టం ఎంత? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

సలహాదారు నియామకంపైనా అనేక ప్రశ్నలు

ఏపీకి చెందిన అధికారిని తెలంగాణ ప్రభుత్వంలో సలహాదారుగా నియమించుకోవడంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ అధికారిని సలహాదారుడిగా పెట్టుకుంటే ఇంతకంటే ఎక్కువ ఏం ఆశించగలం అని తెలంగాణ ప్రజలు నిట్టూరుస్తున్నారు. మరి ఆదిత్యనాథ్ దాస్ పాత్ర ఏమిటి? ఈ వ్యవహారంలో ఆయన బాధ్యతలపై ప్రభుత్వం వివరణ ఇస్తుందా? ఆయనపై చర్యలు తీసుకుంటారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

తెలంగాణ నీటి హక్కులు, ప్రజల తాగునీటి అవసరాలు, సాగునీటి ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. నీటి తరలింపుపై వస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం చెప్పడంతో పాటు, టన్నెల్ నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రజల ముందుంచాల్సిన అవసరం ఉంది. మరి ఏపీ జలదోపిడీ ఆరోపణలపై విచారణ ఎప్పుడు? తెలంగాణ నీటి ప్రయోజనాలకు రక్షణ ఎప్పుడు? అన్నదానికి రేవంత్ సర్కార్ జవాబు చెప్పాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

తర్వాత చదవండి