BMSandeep: దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అతికొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. గతంలో గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, మాణిక్యం ఠాగూర్ వంటి ఉద్దండులు, మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఇన్‌ఛార్జ్‌లుగా పనిచేసిన కీలక రాష్ట్రమిది. అలాంటి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా అధిష్ఠానం కర్ణాటకకు చెందిన యువ నేత బి.ఎం. సందీప్‌ను నియమించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అశోక్ గెహ్లాట్, ముకుల్ వాస్నిక్, సచిన్ పైలట్, అజయ్ మాకన్ వంటి సీనియర్ల పేర్లు రేసులో వినిపించినప్పటికీ.. కనీసం ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయని నేతకు ఏఐసీసీ పగ్గాలు అప్పగించడం వెనుక అసలు వ్యూహం ఏంటనే చర్చ జోరుగా సాగుతోంది.
సీనియర్లను కాదని సందీప్ వైపే మొగ్గు ఎందుకు?
కర్ణాటకలోని చిక్‌మగళూరుకు చెందిన బి.ఎం. సందీప్ రాజకీయ ప్రస్థానం ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ నుంచి మొదలైంది. గతంలో చిక్‌మగళూరు మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేసిన ఆయన, ఆ తర్వాత పూర్తిగా పార్టీ సంస్థాగత బాధ్యతల్లోనే కొనసాగుతున్నారు. ఇప్పటివరకు అసెంబ్లీ, శాసనమండలి, లోక్‌సభ లేదా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ, ఏఐసీసీ కార్యదర్శిగా మహారాష్ట్ర, గుజరాత్, కేరళ వంటి రాష్ట్రాల్లో పనిచేసిన అనుభవం ఆయనకుంది. ముఖ్యంగా ఎన్నికల వ్యూహకర్తగా, అందరినీ కలుపుకొని వెళ్లే నేతగా సందీప్‌కు పేరుంది.
అధిష్ఠానం & సీఎం రేవంత్ మార్క్ వ్యూహం ఇదేనా?
ప్రస్తుత ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తుండటంతో మార్పు అనివార్యమైంది. అయితే ఇక్కడ సీనియర్ నేతలను నియమిస్తే మళ్లీ రాష్ట్ర నాయకత్వానికి, ఇన్ఛార్జ్కు మధ్య అధికార కేంద్రాలు ఏర్పడి సమన్వయ లోపం తలెత్తే అవకాశం ఉందని అధిష్ఠానం భావించినట్లు తెలుస్తోంది. 2023 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో పాటు బీసీ కులగణన, గ్లోబల్ సమ్మిట్ వంటి కార్యక్రమాలతో సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ వద్ద బలమైన నమ్మకాన్ని సంపాదించుకున్నారు. రానున్న ఎన్నికల సమయాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిగా ఉంటూ తనకు పూర్తిస్థాయిలో సహకరించే నేతను పంపాలని రేవంత్ రెడ్డి కోరినట్లు సమాచారం. ఇదే క్రమంలో రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఆలోచనలతో సందీప్ ఎంపికకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
మూడేళ్లలోపే నలుగురు ఇన్ఛార్జ్లు..
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోపే మాణిక్‌రావు ఠాక్రే, దీపాదాస్ మున్షి, మీనాక్షి నటరాజన్ తర్వాత నాలుగో ఇన్‌ఛార్జ్‌గా సందీప్ బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 22న ఆయన హైదరాబాద్‌కు వచ్చి పీఏసీ, టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశాల్లో పాల్గొననున్నారు. అయితే కాకలు తీరిన సీనియర్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌లో జూనియర్ నేత అయిన సందీప్ మాటను సీనియర్లు ఏ మేరకు లెక్క చేస్తారనేది ఇప్పుడు అసలు ప్రశ్న.
ఆయన ముందు భారీ సవాళ్లే ఉన్నాయి..
ఖాళీగా ఉన్న మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు దాదాపు 30 మందికి పైగా నేతలు పోటీ పడుతున్నారు. వీటితో పాటు కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకాన్ని పూర్తి చేయాల్సి ఉంది. వచ్చే ఏడాది జరగబోయే ఎమ్మెల్యే కోటా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థలు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఉంది.
మొత్తానికి సొంతంగా ఎలాంటి రాజకీయ గ్రూపులు లేని, వివాదరహితుడైన సంస్థాగత నేతను రంగంలోకి దించడం ద్వారా రాష్ట్ర నాయకత్వానికి పూర్తి స్వేచ్ఛనిస్తూనే, పార్టీ వ్యవహారాలను చక్కదిద్దాలనేది అధిష్ఠానం వ్యూహంగా కనిపిస్తోంది. ఈ కీలక పరీక్షలో బి.ఎం. సందీప్ ఎలా నెగ్గుకొస్తారో చూడాలి.
