బీజేపీ వ్యూహంతో కాంగ్రెస్ కి షాకుల మీద షాకులు
డీలిమిటేషన్ బిల్లు ముంగిట.. కూటమిలో చీలికలు
కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పే యోచనలో శరద్ పవార్ ఎన్సీపీ
మిగిలిన వారైనా ఉంటారా..? టాటా చెబుతారా..?
రాహుల్ నాయకత్వానికి ఇది పరీక్షా కాలం
డీలిమిటేషన్ బిల్లు పార్లమెంట్ ముందుకు రాకముందే దేశ రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఒకవైపు మోదీ ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలతో ముందుకు వెళ్తుంటే.. మరోవైపు ప్రతిపక్ష ఇండియా కూటమిలో విభేదాలు బయటపడుతున్నాయి. బిల్లును వ్యతిరేకించాలని కాంగ్రెస్ పట్టుబడుతుంటే.. కూటమిలోని కొన్ని పార్టీలు మాత్రం ప్రభుత్వ ప్రతిపాదనలకు మద్దతు ప్రకటిస్తున్నాయి. తమిళనాడులో డీఎంకే మద్దతు ప్రకటన.. మహారాష్ట్రలో శరద్ పవార్ ఎన్సీపీ వైఖరి.. కాంగ్రెస్‌కు ఊహించని రాజకీయ సవాళ్లుగా మారాయి. ఒకే కూటమిలో ఉండి.. ఒకే అంశంపై ఒకే మాట చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. ఐతే డీఎంకే ఇప్పటికే ఇండీ కూటమికి దూరమైంది.
మరి ఇది బీజేపీ వ్యూహానికి దక్కుతున్న ఫలితమా? లేక రాష్ట్రాల ప్రయోజనాల కోసం ప్రాంతీయ పార్టీలు తీసుకుంటున్న స్వతంత్ర నిర్ణయాలా? ఏదేమైనా.. ఈ పరిణామాలు రాహుల్ గాంధీ నాయకత్వానికి పెద్ద పరీక్షగా మారుతున్నాయి.
డీఎంకే దూరం.. కాంగ్రెస్‌కు తొలి షాక్!
డీలిమిటేషన్ అంశంలో కాంగ్రెస్‌కు మొదటి గట్టి షాక్ తమిళనాడు నుంచి తగిలింది. డీఎంకే అధినేత స్టాలిన్ తన పార్టీ ఎంపీలతో సమావేశమై కేంద్రం ప్రతిపాదించిన సవరించిన డీలిమిటేషన్ బిల్లులకు మద్దతు ప్రకటించారు. తమిళనాడు లోక్‌సభ స్థానాల వాటా తగ్గకుండా ఉండటం, రాష్ట్రాల మధ్య రేషియోని కొనసాగించడం వంటి అంశాలను కేంద్రం ప్రతిపాదనల్లో చేర్చిందని డీఎంకే చెబుతోంది. అందుకే బిల్లుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించింది.
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. డీఎంకే ప్రస్తుతం ఇండియా కూటమిలో భాగస్వామి కాదు. అయినప్పటికీ కాంగ్రెస్‌తో గతంలో ఉన్న రాజకీయ సంబంధాలు, తమిళనాడులో కాంగ్రెస్‌తో ఏర్పడిన కొత్త రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారింది. డీఎంకే మద్దతు ప్రకటించిన సమయంలోనే ఢిల్లీలో ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు. కానీ డీఎంకే ఆ భేటీకి హాజరుకాలేదు. అంటే డీలిమిటేషన్‌పై కాంగ్రెస్ ఒక వైఖరితో ముందుకెళ్తుంటే.. తమిళనాడులోని ప్రధాన ప్రాంతీయ పార్టీ తన సొంత లెక్కలతో నిర్ణయం తీసుకుంది.
శరద్ పవార్ ఎన్సీపీ.. కూటమిలో ఉంటుందా? బయటకు వెళ్తుందా?
ఇప్పుడు కాంగ్రెస్‌కు మరింత ఇబ్బందికరంగా మారిన అంశం శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) వైఖరి. ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న ఈ పార్టీ.. డీలిమిటేషన్ ప్రక్రియకు మద్దతు ప్రకటించింది. అన్ని రాష్ట్రాల్లోనూ లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచే ప్రతిపాదన ఉంటే మద్దతిస్తామని పార్టీ నేత జితేంద్ర అవ్హాద్ వెల్లడించారు. ఈ ప్రకటనతో కాంగ్రెస్ నాయకత్వానికి కొత్త చిక్కులు మొదలయ్యాయి.
ఇక నవంబర్ 28న ఖర్గే నివాసంలో జరిగిన ఇండియా కూటమి సమావేశానికి ఎన్సీపీ (ఎస్పీ) హాజరుకాలేదు. శరద్ పవార్ ఆరోగ్య పరిస్థితి కారణంగా సుప్రియా సూలే సమావేశానికి దూరంగా ఉన్నట్లు వివరించారు. అయితే అదే సమయంలో బిల్లుకు పార్టీ మద్దతు ప్రకటించడం రాజకీయంగా చర్చకు దారితీసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్సీపీ మోదీ ప్రభుత్వానికి దగ్గరవుతోందా? కూటమి నుంచి బయటకు వెళ్లే ఆలోచనలో ఉందా? అనే చర్చ మొదలైంది. సుప్రియా సూలేకు కేంద్ర మంత్రి పదవి, మహారాష్ట్రలో అధికారంలో వాటా వంటి అంశాలపై బేరసారాలు జరుగుతున్నాయంటూ వార్తలొస్తున్నాయి. అయితే ఎన్సీపీ.. ఇండియా కూటమిని వీడుతున్నట్లు కూడా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
రాహుల్ ఏమంటున్నారు? ఖర్గే వ్యూహం ఏంటి?
ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇండియా కూటమి నేతలతో సమావేశమై ఉమ్మడి వ్యూహాన్ని సిద్ధం చేశారు. ప్రస్తుత లోక్‌సభ స్థానాల సంఖ్యను కొనసాగించాలి, మహిళా రిజర్వేషన్‌ను ఇప్పుడున్న స్థానాల్లోనే అమలు చేయాలి, రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తిని మరో 25 ఏళ్లపాటు మార్చకూడదనే డిమాండ్లను కేంద్రం ముందుంచారు.
మరోవైపు రాహుల్ గాంధీ డీలిమిటేషన్‌పై కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించారు. లోక్‌సభ స్థానాలను 850కి పెంచే ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల సరిహద్దులను మార్చేందుకు కేంద్రానికి నియంత్రణలేని అధికారం ఇవ్వకూడదని విమర్శించారు.
అయితే ఎన్సీపీ వైఖరిపై అడిగిన ప్రశ్నకు రాహుల్ ఆసక్తికరంగా స్పందించారు. డీలిమిటేషన్‌కు మద్దతు ఇచ్చినంత మాత్రాన ఇండియా కూటమిలో ఆ పార్టీ స్థానం మారదని చెప్పారు. అంటే విభేదాలు ఉన్నా కూటమిని కొనసాగించాలన్నది కాంగ్రెస్ వైఖరిగా కనిపిస్తోంది.
బీజేపీ స్కెచ్చా..? లేక ప్రాంతీయ పార్టీల సొంత లెక్కలా?
ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే. డీలిమిటేషన్ అంశం ప్రతిపక్షాలను విడదీసే రాజకీయ సాధనంగా మారిందా? కాంగ్రెస్ నేతలు కేంద్రం వ్యూహంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ ప్రతిపక్ష పార్టీల మధ్య విభేదాలను ఉపయోగించుకుంటోందని విమర్శిస్తున్నారు. అయితే డీఎంకే, ఎన్సీపీ తీసుకున్న నిర్ణయాలకు ఆయా పార్టీలు తమ రాష్ట్రాల ప్రయోజనాలనే కారణంగా చూపిస్తున్నాయి.
డీఎంకేకు తమిళనాడు ప్రాతినిధ్యంపై ఆందోళన. ఎన్సీపీకి అన్ని రాష్ట్రాల్లో సమానంగా సీట్ల పెంపు జరగాలన్న షరతు. కాంగ్రెస్‌కు మాత్రం బిల్లును వ్యతిరేకించడంతో పాటు కూటమి ఐక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత. ఇదే ఇప్పుడు రాహుల్ గాంధీ ముందున్న అసలు సవాల్.
మిగిలిన వారైనా కలిసి ఉంటారా?
ఇండియా కూటమిలో ఇంకా తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఖర్గే సమావేశానికి ఆ పార్టీల నేతలు హాజరయ్యారు. అయితే అందరూ ఒకే విధంగా బిల్లును వ్యతిరేకిస్తారా? పార్లమెంట్‌లో చివరి వరకు కాంగ్రెస్ వెంట నిలబడతారా? అన్నది కీలకం.
డీఎంకే, ఎన్సీపీ నిర్ణయాలు కూటమిలో చర్చకు దారితీశాయి. మిగిలిన భాగస్వామ్య పక్షాలు కూడా తమ రాష్ట్రాల రాజకీయ అవసరాల ఆధారంగా వేర్వేరు వైఖరులు తీసుకుంటే కాంగ్రెస్‌కు సమస్య మరింత పెరుగుతుంది. డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అన్నది ఒక అంశం. కానీ ఆ బిల్లు చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు మాత్రం మరో ప్రశ్నను ముందుకు తెచ్చాయి.
ప్రతిపక్షాలను ఒక్కతాటిపైకి తీసుకురావడంలో రాహుల్ గాంధీ ఎంతవరకు సఫలమవుతారు? ఇండియా కూటమి ఐక్యంగా నిలబడుతుందా? లేక డీలిమిటేషన్ వివాదమే కూటమిలో కొత్త రాజకీయ దూరాలకు కారణమవుతుందా? రాహుల్ నాయకత్వానికి ఇది నిజంగానే పరీక్షా కాలం! ఐతే ఈ పరీక్షలో రాహుల్ నెగ్గుతారా లేదా అనేది కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.
