తెలంగాణ

డీలిమిటేషన్ తో మారనున్న తెలంగాణ మ్యాప్.. కొత్తగా ఏ జిల్లాలో ఏ నియోజకవర్గాలు?

తెలంగాణ ఇప్పటివరకు 119 అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. పునర్విభజన తర్వాత ఈ సంఖ్య 179 దాటే అవకాశం ఉంది. ఒక్కో లోక్‌సభ స్థానానికి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల లెక్కను కొనసాగిస్తే మొత్తం 182కి చేరవచ్చన్న అంచనాలూ వినిపిస్తున్నాయి. అంటే రాష్ట్రంలో కొత్తగా 60కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది.

డీలిమిటేషన్‌తో తెలంగాణలో 182 సీట్లు?

ఉమ్మడి జిల్లాల్లో కొత్త నియోజకవర్గాలు ఎక్కడెక్కడ?

హైదరాబాద్‌ నుంచి పల్లెల వరకు మారనున్న రాజకీయ మ్యాప్‌!

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మార్పుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటివరకు 119 అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. వచ్చే పునర్విభజన తర్వాత ఈ సంఖ్య 179 దాటే అవకాశం ఉంది. ఒక్కో లోక్‌సభ స్థానానికి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల లెక్కను కొనసాగిస్తే మొత్తం 182కి చేరవచ్చన్న అంచనాలూ వినిపిస్తున్నాయి. అంటే రాష్ట్రంలో కొత్తగా సుమారు 60కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ మార్పుతో కొత్త నాయకులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు పెరగడమే కాదు.. ఇప్పుడున్న ఎమ్మెల్యేల నియోజకవర్గాల పరిధులు కూడా మారిపోవచ్చు.

ముఖ్యంగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ ప్రాంతాల్లో ఎక్కువ నియోజకవర్గాలు వచ్చే అవకాశాలున్నాయి. ఈ ప్రాంతాల్లో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉండడమే దీనికి కారణం. మరోవైపు వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌, నల్గొండ వంటి ఉమ్మడి జిల్లాల్లోనూ కొత్త సెగ్మెంట్లు తెరపైకి రావచ్చు.

పెరిగే సీట్లు.. 179 లేక 182.. అసలు లెక్క ఇదే!

తెలంగాణలో ప్రస్తుతం 119 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 50 శాతం పెంపు లెక్క ప్రకారం 119 స్థానాలు 179కి చేరుతాయి. ఇక లోక్‌సభ స్థానాలు 17 నుంచి 26కి పెరిగే అవకాశం ఉంది. ఇక్కడే మరో లెక్క తెరపైకి వస్తోంది. ప్రస్తుతం ఒక్కో లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అదే నిష్పత్తిని 26 లోక్‌సభ స్థానాలకు వర్తింపజేస్తే 182 అసెంబ్లీ స్థానాలు వస్తాయి.

అందుకే 179, 182 అనే రెండు నెంబర్లు చర్చలో ఉన్నాయి. 182 అనేది ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నిష్పత్తి ఆధారంగా వచ్చిన అంచనా. ఫైనల్ నెంబర్ ని అధికారిక పునర్విభజన ప్రక్రియే నిర్ణయిస్తుంది.

ఉమ్మడి జిల్లాల వారీగా ఎక్కడ కొత్త సీట్లు?

1. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా

ప్రస్తుత 10 స్థానాలకు అదనంగా ఐదు కొత్త నియోజకవర్గాలు రావచ్చన్న అంచనా ఉంది. ఆదిలాబాద్‌ అర్బన్‌, ఉట్నూర్‌, మంచిర్యాల రూరల్‌ లేదా లక్షెట్టిపేట, నిర్మల్‌ జిల్లాలోని నర్సాపూర్‌ ప్రాంతాల్లో కొత్త సెగ్మెంట్ల ప్రతిపాదనలు ఉన్నాయి. మరొక కొత్త స్థానం కూడా ఏర్పడే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి.

2. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా

ప్రస్తుత ఐదు స్థానాలకు మరో మూడు జతకావచ్చని అంచనా. నిజామాబాద్‌ నార్త్‌ లేదా సౌత్‌ పేరుతో కొత్త పట్టణ నియోజకవర్గం, ఎడపల్లి లేదా బోధన్‌ రూరల్‌ ప్రాంతంలో మరో స్థానం ఏర్పడవచ్చని చర్చ జరుగుతోంది. కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి రూరల్‌ పేరుతో కొత్త నియోజకవర్గం వచ్చే అవకాశమూ ఉంది.

3. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా

ఈ ప్రాంతంలో మరో ఐదు నియోజకవర్గాలు రావచ్చని అంచనా. కరీంనగర్‌ రూరల్‌, జగిత్యాల రూరల్‌, మెట్ పల్లి, సుల్తానాబాద్‌, సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట ప్రాంతాలు కొత్త నియోజకవర్గాలుగా మారే అవకాశాలున్నాయి.

4. ఉమ్మడి మెదక్‌ జిల్లా

ఇక్కడ ఏడు కొత్త నియోజకవర్గాల వరకు ఏర్పడవచ్చన్న అంచనా ఆసక్తి రేపుతోంది. సంగారెడ్డి జిల్లాలో రామచంద్రాపురం, అమీన్‌పూర్‌, సదాశివపేట ప్రాంతాలు కొత్త సెగ్మెంట్లుగా మారవచ్చని చెబుతున్నారు. మెదక్‌ జిల్లాలో రామాయంపేట, సిద్ధిపేట జిల్లాలో సిద్ధిపేట రూరల్‌ పేర్లతో కొత్త నియోజకవర్గాల ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.

5. ఉమ్మడి నల్గొండ జిల్లా

ప్రస్తుత స్థానాలకు మరో ఆరు కొత్త నియోజకవర్గాలు జతకావచ్చని అంచనా. మిర్యాలగూడ రూరల్‌, నల్గొండ రూరల్‌ పేర్లతో కొత్త సెగ్మెంట్లు రావచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లాలో రామన్నపేట, చౌటుప్పల్‌ లేదా మోత్కూరు ప్రాంతాల్లో కొత్త నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉంది. సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట రూరల్‌, మునగాల వంటి ప్రాంతాల పేర్లూ ప్రతిపాదనల్లో వినిపిస్తున్నాయి.

6. ఉమ్మడి ఖమ్మం జిల్లా

ఇక్కడ రెండు కొత్త నియోజకవర్గాలు రావచ్చని అంచనా. రఘునాథపాలెం, ఖమ్మం రూరల్‌ పేర్లతో కొత్త స్థానాలు ఏర్పడవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ మరో కొత్త నియోజకవర్గం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

7. ఉమ్మడి వరంగల్‌ జిల్లా

ఈ ప్రాంతంలో కొత్త స్థానాల సంఖ్య ఎక్కువగా ఉండొచ్చని అంచనాలు చెబుతున్నాయి. మరో తొమ్మిది నియోజకవర్గాలు ఏర్పడే అవకాశాన్ని ప్రస్తావిస్తున్నారు. కాజీపేట, హసన్‌పర్తి, శాయంపేట, మడికొండ, వరంగల్‌ సెంట్రల్‌, గీసుకొండ ప్రాంతాల్లో కొత్త సెగ్మెంట్లు రావచ్చని చర్చ జరుగుతోంది. మహబూబాబాద్‌ రూరల్‌, తొర్రూరు, కాటారం ప్రాంతాల పేర్లూ ఈ జాబితాలో ఉన్నాయి.

8. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా

ఈ ప్రాంతంలో మరో 6 కొత్త నియోజకవర్గాలు ఏర్పడవచ్చన్న అంచనా ఉంది. మహబూబ్‌నగర్‌ రూరల్‌, గండీడ్‌, కొడంగల్‌ పరిసరాలు, కోస్గి, అమరచింత, పెబ్బేరు, ఐజ ప్రాంతాలు కొత్త నియోజకవర్గాల ఏర్పాటులో పరిశీలనకు రావచ్చని సమాచారం. ముఖ్యంగా కొడంగల్‌ నియోజకవర్గం పరిధిలోని కొన్ని మండలాలు విడిపోయి కొత్త సెగ్మెంట్లు ఏర్పడే అవకాశం ఉందన్న చర్చ కూడా ఉంది.

హైదరాబాద్‌.. శివారు ప్రాంతాల్లోనే భారీ మార్పులు!

ఇక తెలంగాణ డీలిమిటేషన్‌లో అత్యంత ఆసక్తికరమైన మార్పులు హైదరాబాద్‌ మెట్రో ప్రాంతంలో కనిపించవచ్చు. ప్రస్తుత హైదరాబాద్‌ అసెంబ్లీ స్థానాలు 15. ఇవి 20కి చేరవచ్చని అంచనా. అంటే నగరానికి మరో ఐదు కొత్త నియోజకవర్గాలు రావచ్చు.

మరోవైపు మేడ్చల్‌, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలను కలిపి చూసినప్పుడు ఈ ప్రాంతంలో మొత్తం 31 అసెంబ్లీ స్థానాలు ఉండవచ్చని ఒక అంచనా. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ప్రస్తుతం ఉన్న 14 నియోజకవర్గాల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యే అవకాశముందని కూడా విశ్లేషణలు చెబుతున్నాయి.

శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, మహేశ్వరం వంటి అధిక జనాభా ఉన్న నియోజకవర్గాలను విభజించాల్సిన పరిస్థితి రావచ్చు. మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్‌, ఎల్బీనగర్‌ వంటి పట్టణ ప్రాంతాల్లోనూ సరిహద్దుల మార్పులు తప్పకపోవచ్చు. ఒకప్పుడు నగర శివార్లుగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు భారీ నివాస ప్రాంతాలుగా మారాయి. కొత్త కాలనీలు, ఐటీ కారిడార్లు, రియల్‌ ఎస్టేట్‌ హబ్‌లు విస్తరించాయి. ఈ జనాభా మార్పులే కొత్త నియోజకవర్గాల ఏర్పాటులో కీలకంగా మారవచ్చు.

నియోజకవర్గాల పేర్లే కాదు.. రాజకీయ లెక్కలూ మారతాయి!

డీలిమిటేషన్‌ అంటే కొత్త పేర్లు పెట్టడం మాత్రమే కాదు. ఒక నియోజకవర్గంలోని కొన్ని మండలాలు మరో నియోజకవర్గంలోకి వెళ్లవచ్చు. పెద్ద నియోజకవర్గాలు రెండు లేదా అంతకంటే ఎక్కువ భాగాలుగా విడిపోవచ్చు. ప్రస్తుతం ఒకటి కంటే ఎక్కువ జిల్లాల్లో విస్తరించిన కొన్ని నియోజకవర్గాల సరిహద్దులు కూడా కొత్తగా నిర్ణయించే అవకాశం ఉంది.

2011 జనగణన జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే రాష్ట్ర జనాభా సుమారు 3.52 కోట్లు. ఈ లెక్కన ఒక్కో నియోజకవర్గానికి సగటున సుమారు 1.93 లక్షల జనాభా వచ్చేలా సరిహద్దులు నిర్ణయించే అవకాశం ఉందని ఒక అంచనా. సాధ్యమైనంత సమాన జనాభా ఉండేలా నియోజకవర్గాలను ఏర్పాటు చేయడమే ప్రధాన లక్ష్యం.

ఇక మహిళా రిజర్వేషన్‌ కూడా ఈ మార్పుల్లో కీలకం. 33 శాతం రిజర్వేషన్‌ అమల్లోకి వస్తే 179 స్థానాల లెక్క ప్రకారం సుమారు 60 అసెంబ్లీ స్థానాలు మహిళలకు కేటాయించే అవకాశం ఉంటుంది.

ఫైనల్ మ్యాప్‌ ఎప్పుడు వస్తుంది?

ప్రస్తుతం చర్చలో ఉన్న కొత్త నియోజకవర్గాల పేర్లు, నెంబర్లు అన్నీ ప్రాథమిక అంచనాలే. పార్లమెంట్‌ ఆమోదం, చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత డీలిమిటేషన్‌ కమిషన్‌ నియోజకవర్గాల సరిహద్దులను పరిశీలిస్తుంది. జనాభా, భౌగోళిక పరిస్థితులు, పరిపాలనా సౌలభ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రతిపాదనలు రూపొందిస్తుంది. ప్రజల అభ్యంతరాలు, సూచనలు స్వీకరించిన తర్వాతే ఫైనల్ లిస్ట్ రిలీజవుతుంది.

ఇక.. కొత్త నియోజకవర్గాలు వస్తే కొత్త నాయకులకు అవకాశాలు వస్తాయి. అదే సమయంలో ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలకు తమ నియోజకవర్గాల పరిధులే మారిపోయే పరిస్థితి రావచ్చు. తెలంగాణలో పెరగబోయే సీట్లు ఎన్ని అన్నదానికంటే.. ఆ సీట్లు ఎక్కడ వస్తాయి? ఎవరికి కొత్త రాజకీయ అవకాశాలు కల్పిస్తాయి? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ తో పాటు, బీఆర్ఎస్, బీజేపీ నేతలు.. డీలిమిటేషన్ ప్రక్రియ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

తర్వాత చదవండి