కేంద్రంలోని బీజేపీ సర్కార్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ,మహిళా రిజర్వేషన్ బిల్లును ఎలాగైనా పాస్ చేయించాలని కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ రెండింటినీ సాధ్యం చేసి వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగాలని చూస్తున్నది. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించడంతో పాటు డీలిమిటేషన్ పూర్తి చేసి దేశవ్యాప్తంగా ‘వన్ నేషన్- వన్ ఎలక్షన్’ (జమిలి) కలను సాకారం చేసుకోవాలని చూస్తున్నట్టు తెలిసింది.ఈ క్రమంలోనే దేశ రాజకీయాల్లో పెను సంచలనానికి తెరలేపుతూ రేపు లోక్‌సభలో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం.
డీమిలిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు..
రేపు ఉదయం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), శాతం మహిళా రిజర్వేషన్ల అమలుకు ఉద్దేశించిన కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది.దీనికి తోడు డీలిమిటేషన్‌కు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లును సైతం ప్రవేశపెట్టునున్నారని సమాచారం. కాగా, ప్రస్తుత లోక్‌సభ స్థానాలను 543 నుంచి 50 శాతం పెంపుతో గరిష్ఠంగా 850 వరకు పెంచే ప్రతిపాదన ఈ బిల్లులో ప్రధాన అంశంగా చేర్చారు.
మరోసారి అధికారం కోసమే డీలిమిటేషన్ : రాహుల్
లోక్‌సభ సీట్లను 850కి పెంచే నిర్ణయాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సీట్ల పెంపుతో సంబంధం లేకుండా ప్రస్తుతమున్న 543 స్థానాల్లోనే 33 శాతం మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో ప్రధాని మోడీ, అమిత్ షా తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఎన్నికల మ్యాప్‌ను మార్చుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని రాహుల్ గాంధీ మండిపడ్డారు. నియోజకవర్గాల సరిహద్దులను మార్చి వచ్చే ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని, దీనిని జెన్ జీ గుర్తించాలని.. ప్రధాని మోడీ డీలిమిటేషన్ పేరిట దేశ ఆత్మపై దాడి చేసేందుకు సిద్దమయ్యారని విమర్శించారు.
ఇండియా కూటమిలో లుకలుకలు..
మరోవైపు, ఈ బిల్లు విషయంలో ‘ఇండియా’ (INDIA) కూటమిలో లుకలుకలు మరోసారి బయటపెడ్డాయి. అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం సీట్లు పెంచుతామని కేంద్రం ప్రకటించడంతో దక్షిణాది రాష్ట్రాల వాటాకు ఎలాంటి నష్టం జరగదని భావిస్తూ తమిళనాడు ప్రతిపక్ష పార్టీ డీఎంకే (DMK) ఈ బిల్లుకు మద్దతు ప్రకటించింది.అదేవిధంగా శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (SP) కూడా సానుకూల సంకేతాలు ఇవ్వడం, తెలంగాణలోని ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం మద్దతు పలకడంతో ఇండియా కూటమిలోని మిగతా పార్టీలు, కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. బిల్లుకు మద్దతు ఇవ్వొద్దని కాంగ్రెస్ ఇండియా కూటమి పార్టీలను కోరుతోంది. ఈ మేరకు కూటమి నేతలతో భేటీకి రాహుల్ గాంధీ పిలుపునిచ్చినట్టు సమాచారం.
కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పక్షాలే భిన్న వైఖరులు తీసుకోవడంతో విపక్షాల ఐక్యతపై నీలినీడలు కమ్ముకున్నాయి.ఇండియా కూటమిలోని ఈ గందరగోళంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని కావాలన్న రాహుల్ గాంధీ కల ఎప్పటికీ నెరవేరదని ఆయన ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ వ్యతిరేక మనస్తత్వంతో దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
క్రాస్ ఓటింగ్ భయం..
పార్లమెంట్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై ఓటింగ్ జరిగితే తమ సొంత ఎంపీలే పార్టీ లైన్ దాటి ఓటు వేస్తారనే ‘క్రాస్ ఓటింగ్’ భయం ఇప్పుడు ఇండియా కూటమిని వెంటాడుతోంది. రేపటి నుంచి డిసెంబర్ 3 వరకు సాగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు ఆమోదం కోసం ఎన్డీయే సర్కార్ సర్వశక్తులూ ఒడ్డుతుండగా, విపక్షాల అనైక్యత అధికార పక్షానికి కలిసొచ్చేలా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇండియా కూటమి పార్టీలు భిన్న స్వరాలు వినిపిస్తుండగా.. తమ సొంత పార్టీ ఎంపీలు క్రాస్ ఓటింగ్ జరపకుండా కాంగ్రెస్ సీరియస్‌గా దృష్టి సారించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే నేడు ఢిల్లీలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎం భేటీ జరగనుంది. అనంతరం డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా వీరంతా తమ గళం వినిపిస్తారని సమాచారం.
