తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ విద్యను విద్యాశాఖలో విలీనం చేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది విద్యార్థులు పదో తరగతి వరకే చదువుకుని ఇంటర్ చదువుకునేందుకు పట్టణాలకు వెళ్లలేక చదువుమధ్యలో మానేస్తున్నారని, అలా డ్రపౌట్స్ తగ్గించేందుకు 10+2 విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
అయితే, ఇంటర్ బోధించే లెక్చరర్లు ఈ విధానంపై అభ్యంతరం తెలపగా వారి సేవలను సైతం వినియోగించుకుంటామని ప్రభుత్వం స్పష్టంచేసింది.ఈ మేరకు విద్యాశాఖ అధికారులు పాఠశాలలోనే ఇంటర్ చదువు చెప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.ఇంటర్ బోర్డు విలీనంతో ఇక మీదట సీబీఎస్‌ఈ మాదిరి తెలంగాణలో 10+2 విద్యావిధానం కొనసాగనుంది. అయితే,ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలోని ప్రయివేటు విద్యాసంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ఇదిలాఉండగా, రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కార్పొరేట్ కాలేజీలకు మేలు చేసేందుకే అని తాజాగా ప్రచారం జరుగుతోంది. కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకే ఇంటర్ బోర్డును విలీనం చేశారని.. 9, 10 తరగతులను కాలేజీల్లో నిర్వహించాలని ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు చేసిందని ప్రచారం జరుగుతోంది. పాఠశాల విద్యలో ఇంటర్ బోర్డును విలీనం చేస్తూ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంలో భాగంగా 9, 10 తరగతులను కాలేజీల్లో నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
అదే నిజమైతే చైతన్య, నారాయణ వంటి విద్యా సంస్థలకు దోపిడీ చేసేందుకు మరింత అవకాశం ఇచ్చినట్టవుతుందని, ఆ ప్రతిపాదనలను వెంటనే వెనక్కి తీసుకోవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఈ ప్రతిపాదనలు అమలు చేస్తే 9వ తరగతి నుంచే ఐఐటీ, నీట్ కోచింగ్ పేరుతో ప్రైవేట్ విద్యా సంస్థలు దోపిడీకి పాల్పడతాయని నిపుణుల హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రముఖ ప్రైవేట్ కాలేజీలు తమకు 9వ తరగతి నుంచి పర్మిషన్లు వస్తున్నాయని ప్రచారం మొదలుపెట్టాయని తెలుస్తోంది. అది చూసి ప్రైవేట్ విద్యాసంస్థలకు మేలు చేసేందుకే రేవంత్ రెడ్డి ఇంటర్ బోర్డును విలీనం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


