తెలంగాణ

హరీష్ కోటలో రేవంత్ రాజకీయ రణం.. సిద్దిపేటలో అసలైన సమరం!

8 నిమిషాల పఠనం

సీఎం రేవంత్ పర్యటనకు బీఆర్ఎస్ శ్రేణుల నుంచి ప్రతిస్పందన తప్పదా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. హరీష్ ముఖ్యమంత్రిపై డైరక్ట్ ఎటాక్ మొదలుపెట్టారు. సిద్దిపేటకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇక్కడ అడుగు పెట్టొద్దని హెచ్చరించారు. గతంలో ప్రకటించిన అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు ముందు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సిద్దిపేటలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్

సై అంటే సై అంటున్న రెండు పార్టీల శ్రేణులు

ఈనెల 19న సీఎం రేవంత్ పర్యటన

హామీలు అమలు చేశాకే రావాలని హరీష్ వార్నింగ్

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ ఇలాఖా సిద్దిపేట రణరంగాన్ని తలపించనుందా..? ఈ నెల 19న సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో అక్కడ ఏం జరగనుంది..? హామీలు అమలు చేశాకే సిద్దిపేట గడ్డపై అడుగుపెట్టాలని హరీష్ ఎందుకంటున్నారు..? సీఎం పర్యటన సాఫీగానే సాగుతుందా..?

సీఎం రేవంత్ సిద్దిపేట పర్యటనపై వస్తున్న ప్రశ్నలివి. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సొంత గడ్డ సిద్దిపేటపై గురిపెట్టారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ సీనియర్ నేతల నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తున్న రేవంత్.. తాజాగా సిద్దిపేటను టార్గెట్ చేశారు. ఈ నెల 19న ఆయన అక్కడ పర్యటించనున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించనున్నారు. మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభించనున్నారు.

అభివృద్ధా.. రాజకీయమా..?

సీఎం రేవంత్ పర్యటన పైకి.. అభివృద్ధి కార్యక్రమంగానే కనిపిస్తున్నా లోపల మాత్రం రాజకీయ కోణమే ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో భారీ బహిరంగ సభ నిర్వహించారు రేవంత్. ఇప్పుడు హరీష్ కోటను టార్గెట్ చేశారు. అంటే.. బీఆర్ఎస్ సీనియర్లే టార్గెట్ గా రేవంత్ అడుగులేస్తున్నారని అర్థమవుతోంది. వరుస పర్యటనలతో బిజీ బిజీగా ఉన్న ముఖ్యమంత్రి పనిలో పనిగా కీలకమైన నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. ఇప్పుడు సిద్దిపేటలో అడుగు పెడుతుండడంతో.. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

రేవంత్ పై హరీష్ ఎటాక్

ఇక సీఎం రేవంత్ పర్యటనకు బీఆర్ఎస్ శ్రేణుల నుంచి ప్రతిస్పందన తప్పదా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. హరీష్ ముఖ్యమంత్రిపై డైరక్ట్ ఎటాక్ మొదలుపెట్టారు. సిద్దిపేటకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇక్కడ అడుగు పెట్టొద్దని హెచ్చరించారు. గతంలో ప్రకటించిన అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు ముందు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా ఏమయ్యాయని నిలదీశారు. సీఎం గతంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి వస్తే.. తానే స్వయంగా వెళ్లి స్వాగతం పలుకుతానని చెప్పారు హరీష్.

సిద్దిపేటలో ఎక్కడి అభివృద్ధి అక్కడే ఉందనేది బీఆర్ఎస్ వాదన. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్పితే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏం చేశారో చెప్పాలని హరీష్ సైతం డిమాండ్ చేస్తున్నారు. గతంలో మంజూరైన వెటర్నరీ కాలేజీ, వ్యవసాయ కళాశాల, ఔటర్ రింగ్ రోడ్డు, శిల్పారామం, క్రీడా మౌలిక సదుపాయాల పనులు ఏమయ్యాయని ప్రశ్నించారు. కావాలనే సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకుంటున్నారనేది హరీష్ వాదన. అందుకే రేవంత్ పర్యటనపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆ రోజు బీఆర్ఎస్ శ్రేణులు.. ఏమైనా నిరసన తెలుపుతాయా అని పోలీసులు సైతం ఆందోళన చెందుతున్నారు. పర్యటన సాఫీగా సాగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎవరి రాజకీయం వారిదే..

సిద్దిపేటలో ఎవరి రాజకీయం వారిదే అన్నట్టుగా తయారైంది పరిస్థితి. అభివృద్ధి పనుల పేరుతో రేవంత్ భారీ సభకు ప్రయత్నిస్తుంటే.. కౌంటర్ ఎటాక్ కి బీఆర్ఎస్ రెడీ అవుతోంది. సీఎం కాదు కదా.. పీఎం వచ్చినా సిద్దిపేటలో తమ పార్టీ చెక్కుచెదరదనే ధీమాలో బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నాయి. 2028 ఎన్నికల్లో కూడా అత్యధిక మెజారిటీతో హరీష్ గెలుపు ఖాయమని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. అదే సమయంలో క్షేత్రస్థాయిలో పట్టు పెంచుకునేందుకు అధికార కాంగ్రెస్ కూడా ప్రయత్నాలు చేస్తోంది. అందుకే ఇప్పుడు సిద్దిపేట.. రెండు పార్టీల మధ్య యుద్ధ క్షేత్రంగా మారిపోయింది.

కాంగ్రెస్ అసలు వ్యూహమేంటి..?

షెడ్యూల్ ప్రకారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2028 చివర్లో జరగాలి. అంటే దాదాపు రెండేళ్ల సమయముంది. దీనిని చాలా తక్కువ టైమ్ గా అధికార పార్టీ భావిస్తోంది. అందుకే బీఆర్ఎస్ బలంగా ఉన్న సెగ్మెంట్లపై రేవంత్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. గెలుపోటములను భవిష్యత్తే నిర్ణయిస్తుంది. కానీ.. పార్టీ శ్రేణుల్లో మాత్రం ఆత్మస్థైర్యాన్ని నింపాలనేది కాంగ్రెస్ పెద్దల వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే వరుసపెట్టి సిరిసిల్ల, సిద్దిపేట లాంటి చోట్ల సభలకు రేవంత్ ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఇదే జోష్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వెల్ లో కూడా సభ పెట్టాలని సీఎం భావిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే.. డిసెంబర్ లో గజ్వెల్ సభ ఉండవచ్చు. ఐతే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మొత్తానికి సీఎం సిద్దిపేట సభ అధికార- విపక్షాల మధ్య సై అంటే సై అనే సవాళ్లకు వేదికగా మారింది. ఒకవైపు కాంగ్రెస్ శ్రేణుల సభా ఏర్పాట్లు, మరోవైపు బీఆర్ఎస్ నాయకుల సవాళ్లతో సిద్దిపేట రణరంగాన్ని తలపిస్తోంది.

#harish rao#cm revanth#siddipet#telangana politcs#congress#brs#2028 assembly elections
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి