ఎల్ నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో ఈ ఏడాది 17 శాతం లోటు వర్షపాతం నమోదు అయిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ ప్రభుత్వం 2026 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 365 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా అధికారికంగా ప్రకటించింది.
రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ ఈ మేరకు జీవో ఎంఎస్ నం.3 జారీ చేసింది. అయితే, రాష్ట్రంలోని 33 జిల్లాలకు గాను (హైదరాబాద్, పెద్దపల్లి మినహా) 31 జిల్లాల్లో కరువు పరిస్థితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఈ క్రమంలోనే 111 మండలాల్లో తీవ్ర కరువు, 254 మండలాలను మధ్యస్థ కరువు ప్రాంతాలుగా రేవంత్ సర్కార్ డిక్లేర్ చేసింది.సూర్యాపేట, నారాయణపేట, జోగులాంబ గద్వాల, హనుమకొండ, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని అన్ని మండలాలను కరువు జాబితాలో చేర్చారు.
మారటోరియం అమలేది?
తెలంగాణ ప్రభుత్వం కరువు మండలాలను కేవలం ప్రకటనలకే పరిమితం చేసిందని, నిబంధనలు ఇంకా అమలు కావడం లేదని తెలుస్తోంది.కరువు మండలాలను ప్రకటించి నెలలు గడుస్తున్నా రుణాల చెల్లింపులపై మారటోరియం ఇంకా అమలులోకి రాలేదు. దీంతో రైతుల నుంచి బ్యాంకులు వడ్డీలు వసూలు చేస్తున్నాయి. చేతిలో డబ్బులు లేక అప్పు చేసి మరి రైతులు వడ్డీలు కడుతున్నారు. అప్పుల భారం భరించలేక, తిరిగి వాటిని చెల్లించలేక ఇప్పటికే పదుల సంఖ్యలో అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడిన విషయం తెలిసిందే.
అయితే, నీళ్లు లేక పంటలు ఎండిపోయిన ప్రాంతాల్లో పలు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి మారటోరియం అమలు చేయకపోవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వం కరువు మండలాలను డిక్లేర్ చేస్తే రైతుల నుంచి రుణాలు వసూలు చేయకుండా ఉండేందుకు మారటోరియం అమల్లో ఉంటుంది. అంటే రుణాల వసూళ్లలో రైతులకు తగినంత సమయం ఇస్తారు.
తీవ్ర కరువు మండలాల్లో రుణాలు చెల్లించేందుకు ఐదేళ్లు సమయం ఇస్తుండగా.. ఓ మోస్తరు కరువు ఉన్న మండలాల్లో మూడేళ్లు, తక్కువ కరువు ఉన్న మండలాల్లో ఏడాదిలోగా రుణాలు చెల్లించేలా రైతులకు గడువు ఇవ్వాలని 10 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయంపై ఇంకా ఎలాంటి నిబంధనలు అమల్లోకి రాకపోవడం, బ్యాంకులకు ఎలాంటి అల్టిమేటం ఇవ్వకపోవడంతో రైతుల నుంచి రుణాలు, వడ్డీలు వసూలు చేసే పనిలో బ్యాంకులు నిమగ్నమయ్యాయి.
ఇప్పుడు చెల్లించకపోతే రుణం రాదు
ఇప్పుడు రుణం చెల్లించకపోతే భవిష్యత్తులో రుణం రాదని, ఫోన్లు చేసి మరి రైతులను పిలిపించి డబ్బులు కట్టించుకుంటున్నట్టు సమాచారం.దీంతో అన్నదాతలు ఏం చేయాలో తోచక ఆవేదన చెందుతున్నట్టు తెలిసింది. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేసి బ్యాంకు రుణాలు చెల్లిస్తున్నారు.
అసలే నీళ్లు, కరెంటు లేక పంటలు పండక నష్టపోయామని, ఇప్పుడు మళ్లీ అప్పు చేసి రుణాలు చెల్లించాల్సిన దుస్థితి వచ్చిందని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంటల సాగుకు నీళ్లివ్వలేదని.. కనీసం రుణాలు చెల్లించేందుకు తగిన సమయం ఇప్పించాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.
