తెలంగాణ

VCSajjanarFireDGCharge: తెలంగాణ ఫైర్ డీజీగా సజ్జనార్ బాధ్యతలు.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్!

తెలంగాణ అగ్నిమాపక, విపత్తు స్పందన, అత్యవసర పౌర రక్షణ విభాగం (Fire, Disaster Response, Emergency & Civil Defence) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ (VCSajjanar) గురువారం ఉదయం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

 తెలంగాణ అగ్నిమాపక, విపత్తు స్పందన, అత్యవసర పౌర రక్షణ విభాగం (Fire, Disaster Response, Emergency & Civil Defence) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ (VCSajjanar) గురువారం ఉదయం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఆయనను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన నేపథ్యంలో, కొంత విరామం అనంతరం నానక్‌రామ్‌గూడలోని ప్రధాన కార్యాలయంలో నిర్ణీత ముహూర్తంలో సజ్జనార్ చార్జ్ తీసుకున్నారు.

 రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే నాపై విమర్శలు

ఫైర్ డీజీతో పాటు ఎస్‌పీఎఫ్ (SPF) డీజీగా కూడా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా విభాగపు ఉన్నతాధికారులు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. బాధ్యతల స్వీకరణ అనంతరం మీడియాతో మాట్లాడిన వీసీ సజ్జనార్, తనపై వస్తున్న విమర్శలపై తీవ్రస్థాయిలో స్పందించారు. కొందరు వ్యక్తులు కేవలం తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే తన పేరును వాడుకుంటూ.. మైలేజ్ వస్తుందనే భ్రమల్లో ఉన్నారని మండిపడ్డారు.

 రోడ్డెక్కి సమాధానం చెప్పాలా?

 ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై తప్పుడు ఆరోపణలు చేసేవారు కచ్చితంగా చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన గట్టిగా హెచ్చరించారు. ఇలాంటి విమర్శలకు తాను రోడ్డెక్కి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, కాలమే అన్నింటికీ సరైన సమాధానం చెబుతుందని స్పష్టం చేశారు. తన సుదీర్ఘ సర్వీసు ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్న సజ్జనార్, గడిచిన 26 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఇప్పటివరకు 20 సార్లు బదిలీలు జరిగాయని వెల్లడించారు.

 కీలక హోదాల్లో సమర్థవంతంగా పనిచేశా

ప్రభుత్వ ఉద్యోగిగా సర్కారు ఏ బాధ్యత అప్పగించినా, ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా నిబద్ధతతో తన వంతు కృషి చేస్తానని తేల్చిచెప్పారు. గతంలో సైబరాబాద్ సీపీగా, హైదరాబాద్ సీపీగా, ఆర్టీసీ ఎండీగా పలు కీలక హోదాల్లో సమర్థవంతంగా పనిచేసిన అనుభవం తనకు ఉందని పేర్కొన్నారు. అనంతరం అగ్నిమాపక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సజ్జనార్, రాష్ట్రంలో అగ్నిప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. అత్యవసర సమయాల్లో వేగవంతమైన రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించడంతో పాటు ఫైర్ సేఫ్టీ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సిబ్బందికి సూచించారు. విపత్తు నిర్వహణలో తెలంగాణ ఫైర్ విభాగాన్ని మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

తర్వాత చదవండి