బంగారం(Gold), వెండి(Silver) ఆభరణాలు కొనుగోలు చేయాలని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సామాన్యులకు శుభవార్త. అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు దేశీయ బులియన్ మార్కెట్లోనూ పసిడి, వెండి ధరలు(Gold Silver Prices) భారీగా దిగివస్తున్నాయి. గత కొన్ని రోజులుగా వరుసగా ధరలు తగ్గుముఖం పడుతుండటంతో కొనుగోలుదారుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా ఒక్క రోజులోనే వేల రూపాయల మేర రేట్లు పడిపోతుండటం ప్రస్తుతం మార్కెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్లోనూ తగ్గుదలను నమోదు చేశాయి. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 3,800 డాలర్ల దిగువకు చేరుకుని గతేడాది సెప్టెంబర్ నాటి స్థాయికి పడిపోయింది. ఈ ఏడాది జనవరి చివర్లో ఔన్సుకు 5,600 డాలర్ల గరిష్ఠ స్థాయిని తాకిన బంగారం, అక్కడి నుంచి ఏకంగా 30శాతానికి పైగా పతనమైంది. బంగారం కంటే వెండి ధరల్లో మరింత భారీ పతనం కనిపిస్తోంది. జనవరిలో ఔన్సుకు 121 డాలర్ల వద్ద రికార్డు సృష్టించిన స్పాట్ సిల్వర్, ప్రస్తుతం 46 డాలర్ల స్థాయికి దిగిరావడంతో గరిష్ఠ ధరతో పోలిస్తే 60 శాతానికి పైగా తగ్గుదల నమోదైంది.
అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో ఒక్క రోజులోనే 10 గ్రాముల బంగారంపై సుమారు రూ. 3,000 వరకు ధర తగ్గింది. ప్రస్తుతం భాగ్యనగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,33,250 వద్ద కొనసాగుతుండగా, ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,22,140 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లోనూ దాదాపు ఇదే స్థాయిలో ధరలు కొనసాగుతున్నాయి.
బంగారం బాటలోనే వెండి ధరలు సైతం భారీగా పతనమయ్యాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఒక్క రోజులోనే కిలో వెండిపై ఏకంగా రూ. 5,000 మేర ధర తగ్గింది. తాజా తగ్గుదలతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,84,900 వద్ద కొనసాగుతోంది. శుభకార్యాల సీజన్ నడుస్తున్న తరుణంలో పసిడి, వెండి రేట్లు భారీగా దిగిరావడం వినియోగదారులకు పెద్ద ఊరటనిస్తోంది.
