Delimitation Bill 2026: నవంబర్ 30 నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ‘డీలిమిటేషన్ (సెకండ్) బిల్లు-2026’, రాజ్యాంగ (132వ సవరణ) బిల్లు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రతి రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను దామాషా పద్ధతిలో 50 శాతం పెంచడంతో పాటు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయడం ఈ బిల్లుల ప్రధాన ఉద్దేశం. అయితే, ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, ఇండియా కూటమిలోని కీలక ప్రాంతీయ పక్షాలు భిన్న వైఖరిని ప్రదర్శిస్తుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో, డీలిమిటేషన్ బిల్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయ భవిష్యత్తుకు గట్టి దెబ్బ తీస్తుందా అనే కోణంలో రాజకీయ వర్గాల్లో భిన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
పెద్ద రాష్ట్రాల లెక్కలు.. కాంగ్రెస్‌కు ఎదురయ్యే సవాళ్లు ఇవే..
ప్రతిపాదిత బిల్లు ప్రకారం లోక్‌సభ గరిష్ట సభ్యుల సంఖ్య 850కి (రాష్ట్రాల నుంచి 815, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 35) పెరగనుంది. అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం సీట్లు పెరిగినప్పటికీ, సంఖ్యాపరంగా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి పెద్ద రాష్ట్రాల్లోనే అదనంగా భారీ సంఖ్యలో ఎంపీ సీట్లు పెరుగుతాయి. రాజకీయ విశ్లేషకులు అంచనా ప్రకారం, ఈ పెద్ద రాష్ట్రాల్లో చాలా చోట్ల బీజేపీకి బలమైన సంస్థాగత పట్టు ఉంది. కాషాయ దళానికి ప్రత్యామ్నాయంగా ఉన్న చోట కూడా సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, శివసేన వంటి ప్రాంతీయ పార్టీలే ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటలుగా ఉన్న ఈ రాష్ట్రాల్లో ఆ పార్టీ బలహీనపడటం వల్ల, అక్కడ పెరిగే సీట్లు బీజేపీకి లేదా ప్రాంతీయ పార్టీలకే లాభిస్తాయని విశ్లేషిస్తున్నారు. లోక్‌సభలో మెజారిటీ మార్కు 400 దాటినప్పుడు, దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు గెలిచినా ఉత్తరాదిలో పట్టు లేకుండా కాంగ్రెస్ సొంతంగా కేంద్రంలో అధికారంలోకి రావడం కష్టతరమవుతుందని, అందుకే రాహుల్ గాంధీ ఈ బిల్లును అడ్డుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ వాదన ఏమిటి?
మరోవైపు, తమ వ్యతిరేకత వెనుక ఎన్నికల భయం కాదని, ప్రజాస్వామ్య సమతుల్యత, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ ఉందని కాంగ్రెస్ నాయకత్వం స్పష్టం చేస్తోంది. సీట్ల సంఖ్యను 50 శాతం పెంచినా, నియోజకవర్గాల సరిహద్దులను తిరిగి గీసే అధికారం డీలిమిటేషన్ కమిషన్‌కు ఉంటుందని, గతంలో అస్సాం, జమ్మూకశ్మీర్‌లలో జరిగిన తరహాలోనే ప్రతిపక్షాల ఓటు బ్యాంకును చీల్చి అధికార పార్టీకి అనుకూలంగా నియోజకవర్గాలను మార్చే ప్రమాదం ఉందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ బిల్లును ఆయన బీజేపీ 'ఎస్కేప్ ప్లాన్'గా అభివర్ణించారు. తాజా జనగణన పూర్తికాకముందే డీలిమిటేషన్ చేపట్టడం వల్ల ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జనాభా ప్రాతిపదికన పెరగాల్సిన సీట్ల వాటా దక్కదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. అలాగే లోక్‌సభ బలం 815కి పెరిగి, రాజ్యసభ సీట్లు 250 వద్దే ఉండటం వల్ల ఉభయసభల సంయుక్త సమావేశాల్లో, రాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్యసభ ప్రాధాన్యత తగ్గిపోతుందని రాజ్యాంగ నిపుణులు, విపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రం వివరణ.. ఇండియా కూటమిలో మంతనాలు
అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం సీట్లు పెంచుతున్నందున ఏ రాష్ట్రానికీ ప్రాతినిధ్యం తగ్గే ప్రసక్తే లేదని, పైగా మహిళా రిజర్వేషన్లు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, గతంలో జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఆందోళన చెందిన డీఎంకే వంటి ప్రాంతీయ పార్టీలు, ఇప్పుడు దామాషా పద్ధతిలో 50 శాతం సీట్ల పెంపు ప్రతిపాదనపై సానుకూలంగా స్పందిస్తున్నాయి. సొంత రాష్ట్రాల్లో బలమైన పట్టు ఉండటంతో పెరిగే సీట్లు తమకే ప్రయోజనం చేకూరుస్తాయని ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిత్రపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, ఎన్సీపీ నేత శరద్ పవార్‌లతో ముమ్మరంగా సంప్రదింపులు జరుపుతున్నారు.
