తెలంగాణ

Telangana: కరువుకు కళ్లెం.. రైతుకు భరోసా.. ఎల్‌నినో సవాళ్లపై రూ.10వేల కోట్లతో సమరభేరి

రాబోయే వాతావరణ సవాళ్లను ముందుగానే అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పాదకత, తాగు-సాగునీటి భద్రత, గ్రామీణ జీవనోపాధిని కాపాడేందుకు రూ.10వేల కోట్లతో భారీ ఎల్‌నినో-కరువు ప్రభావ నివారణ కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతోందని ప్రకటించారు.

* సంక్రాంతి తర్వాత 5 నెలలు.. ప్రతినెల రూ.2వేల కోట్ల పనులు

* జల భద్రత-వ్యవసాయ పరిరక్షణ-గ్రామీణ జీవనోపాధే ప్రధాన లక్ష్యం

* 6వేల మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ పెట్టుబడులకు తెలంగాణ ఆహ్వానం

Telangana: ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితులను చూసి తెలంగాణ రైతులు, గ్రామీణ ప్రజలు అధైర్యపడాల్సిన అవసరం లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి భరోసా ఇచ్చారు. రాబోయే వాతావరణ సవాళ్లను ముందుగానే అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పాదకత, తాగు-సాగునీటి భద్రత, గ్రామీణ జీవనోపాధిని కాపాడేందుకు రూ.10వేల కోట్లతో భారీ ఎల్‌నినో-కరువు ప్రభావ నివారణ కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతోందని ప్రకటించారు.

ప్రతి నెల రూ.2వేల కోట్ల విలువైన పనులు

హైదరాబాద్ బేగంపేటలోని ఐటీసీ గ్రాండ్‌ కాకతీయలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ క్లైమేట్‌ కాన్‌క్లేవ్‌-2026 కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మాట్లాడారు. రానున్న సంక్రాంతి తర్వాత 5 నెలలపాటు ప్రతినెల రూ.2వేల కోట్ల విలువైన పనులు చేపట్టేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

“తెలంగాణ క్లైమేట్‌ కాన్‌క్లేవ్‌ ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిదే. రూ.10వేల కోట్లతో ఎల్‌నినో-కరువు ప్రభావ నివారణ కార్యక్రమాన్ని చేపట్టాలన్నది కూడా ఆయన దూరదృష్టే. రాష్ట్రాన్ని వాతావరణ సవాళ్ల నుంచి సురక్షితంగా ఉంచుతూ ప్రజలకు భరోసా కల్పించడమే ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యం” అని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు.

వాతావరణ మార్పు భవిష్యత్తులో ఎదురయ్యే సమస్య కాదని, ఇప్పటికే మన జీవన విధానం, వ్యవసాయం, నీటి వనరులపై ప్రభావం చూపుతున్న వాస్తవమని మంత్రి పేర్కొన్నారు. అకాల వర్షాలు, వర్షపాతంలో అసమానతలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, నీటి వనరులపై ఒత్తిడి, వ్యవసాయ రంగానికి ఎదురవుతున్న ముప్పులను ముందస్తు ప్రణాళిక, శాస్త్రీయ దృక్పథం, శాఖల మధ్య సమన్వయంతో ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.

ప్రతి రూపాయితో శాశ్వత ప్రయోజనం

కరువు పరిస్థితులు ఏర్పడిన తర్వాత స్పందించడం కాకుండా, ముందుగానే వాటిని అంచనా వేసి కార్యాచరణకు దిగాలన్నదే ప్రజా ప్రభుత్వ విధానమని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. రూ.10 వేల కోట్ల కార్యక్రమంలో చేపట్టే ప్రతి పని రైతులకు, గ్రామీణ ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించేలా ఉండాలని అధికారులకు సూచించారు. ఖర్చు చేసే ప్రతి రూపాయికి ప్రజలకు స్పష్టమైన ఫలితం కనిపించాలని, కార్యక్రమం తాత్కాలిక ఉపశమనానికి పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వతమైన ఆస్తులను సృష్టించాలని చెప్పారు. క్షేత్రస్థాయి అవసరాలను గుర్తించి, ప్రజల భాగస్వామ్యంతో పనులను ఎంపిక చేసి, నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఐదంచెల కరువు నివారణ వ్యూహం

ప్రతిపాదిత ఎల్‌నినో-కరువు ప్రభావ నివారణ కార్యక్రమాన్ని ఐదు ప్రధాన రంగాలపై అమలు చేయనున్నట్లు మంత్రి వివరించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టడంతోపాటు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే పనులకు మొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు. చెరువులు, కాలువలను పునరుద్ధరించడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని ఇతర జల వనరులను అభివృద్ధి చేయడం రెండో ప్రధాన అంశమని చెప్పారు. ‘పొలం బాట’ కార్యక్రమం ద్వారా వ్యవసాయ క్షేత్రాలకు రాకపోకల సౌకర్యాలను మెరుగుపరచడం మూడో అంశమన్నారు. వాగులు, స్థానిక నీటి ప్రవాహ మార్గాలను అభివృద్ధి చేసి వర్షపు నీరు వృథాగా వెళ్లకుండా అడ్డుకోవడం, భూగర్భజలాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టడం నాలుగో అంశమని తెలిపారు. గ్రామాల్లో అంతర్గత మౌలిక వసతులను బలోపేతం చేయడం ఐదో ప్రధాన అంశమని వివరించారు.

ఈ భారీ కార్యక్రమం విజయవంతం కావాలంటే నీటిపారుదల, వ్యవసాయం, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్‌, అటవీ తదితర శాఖలు సంపూర్ణ సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ప్రణాళిక రూపకల్పన నుంచి అమలు వరకు ప్రతి దశలోనూ రైతులు, గ్రామీణ ప్రజల అవసరాలనే ప్రామాణికంగా తీసుకోవాలని అధికారులకు సూచించారు.

వాతావరణ సవాళ్లను అవకాశాలుగా మలుస్తాం

వాతావరణ పరిరక్షణను కేవలం ఒక సవాలుగా మాత్రమే కాకుండా పెట్టుబడులు, ఉపాధి, సాంకేతిక ఆవిష్కరణలకు గొప్ప అవకాశంగా తెలంగాణ ప్రభుత్వం చూస్తోందని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్‌, బ్యాటరీ స్టోరేజీ కలిపి 6వేల మెగావాట్ల సామర్థ్యానికి ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించిందన్నారు. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తెలంగాణ గ్రీన్‌ ఎనర్జీ ప్రయాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

జల సంరక్షణ, సమర్థ సాగునీటి విధానాలు, నీటి నిల్వ, వాతావరణ అనుకూల వ్యవసాయం, పర్యావరణ సవాళ్లకు పరిష్కారాలను అందించే ఆధునిక సాంకేతికతల రంగాల్లోనూ పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

దశాబ్ద కాలానికి వాతావరణ భద్రతా ప్రణాళిక

తెలంగాణ ఇన్వెస్ట్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో భాగంగా డిసెంబర్‌ 7, 8 తేదీల్లో భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ క్లైమేట్‌ కాన్‌క్లేవ్‌ ద్వారా ‘తెలంగాణ క్లైమేట్‌ రెసిలియన్స్‌ అజెండా-2026-2036’కు రూపకల్పన చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. వాతావరణ శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు, పర్యావరణ నిపుణులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, క్షేత్రస్థాయి భాగస్వాములు ఈ కాన్‌క్లేవ్‌లో పాల్గొంటారని చెప్పారు.

వాతావరణ అంచనాలు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, కరువు నివారణ, వాతావరణ అనుకూల వ్యవసాయం, వడగాలుల నుంచి రక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ, సర్క్యులర్‌ ఎకానమీ, క్లైమేట్‌ ఫైనాన్స్‌, పునరుత్పాదక ఇంధనం, పరిశ్రమల్లో కర్బన ఉద్గారాల తగ్గింపు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు వివరించారు.

“కాన్‌క్లేవ్‌లో జరిగే చర్చలు సమావేశాలకే పరిమితం కాకూడదు. అవి మెరుగైన ప్రణాళికలు, బలమైన భాగస్వామ్యాలు, ప్రజలకు కనిపించే ఫలితాలకు దారితీయాలి” అని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

శాస్త్రీయ పరిజ్ఞానానికి సంప్రదాయ జ్ఞానం తోడు

పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధికి ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌, స్టాక్‌హోమ్‌ వాటర్‌ ప్రైజ్‌ గ్రహీత డాక్టర్‌ రాజేంద్రసింగ్‌, పద్మశ్రీ అవార్డు గ్రహీత సీహెచ్‌ వెంకటరెడ్డి అందిస్తున్న సేవలను మంత్రి ప్రశంసించారు. నదుల పునరుజ్జీవం, అటవీ విస్తరణ, ప్రకృతి వ్యవసాయంలో ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ చేపడుతున్న కార్యక్రమాలు, రాజస్థాన్‌లో ప్రజల భాగస్వామ్యంతో డాక్టర్‌ రాజేంద్రసింగ్‌ సాధించిన జల సంరక్షణ విజయాలు, వ్యవసాయ రంగంలో వెంకటరెడ్డి చేపట్టిన వినూత్న ప్రయోగాలు తెలంగాణకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

శాస్త్రీయ పరిజ్ఞానాన్ని సంప్రదాయ జ్ఞానం, ప్రజల భాగస్వామ్యంతో అనుసంధానిస్తే వేగవంతమైన ఆర్థికాభివృద్ధితోపాటు పర్యావరణ పరిరక్షణను సాధించవచ్చని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. పచ్చదనం, జలభద్రత, వాతావరణ ప్రతికూలతలను తట్టుకునే శక్తి కలిగిన తెలంగాణ నిర్మాణానికి శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు, పెట్టుబడిదారులు, ప్రజలు సమష్టిగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

తర్వాత చదవండి