తెలంగాణ

Eatala Rajendar: చట్టసభల్లో బీసీలకు 27శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి- ఎంపీ ఈటల రాజేందర్

బీసీల చిరకాల డిమాండ్లు సంపూర్ణంగా అమలు కావాలని ఈటల రాజేందర్ ఆకాంక్షించారు. ప్రస్తుతం అక్కడక్కడ విద్య, ఉద్యోగ సంస్థల్లో రిజర్వేషన్ల అమల్లో లోపాలు తలెత్తినప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించి సాధించుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు.

Eatala Rajendar: చట్టసభల్లో ఓబీసీలు, బీసీలకు రాజ్యాంగబద్ధంగా 27శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. బీసీల చిరకాల డిమాండ్లు సంపూర్ణంగా అమలు కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం అక్కడక్కడ విద్య, ఉద్యోగ సంస్థల్లో రిజర్వేషన్ల అమల్లో లోపాలు తలెత్తినప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించి సాధించుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు.

రాజ్యాంగం బీసీలకు కల్పించిన విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు కూడా ఇప్పటికీ పూర్తిస్థాయిలో భర్తీ కావడం లేదన్నారు. చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు ఉంటేనే తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని బీసీ సమాజం ఒక బలమైన నిర్ధారణకు వచ్చిందని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

అందుకే అసెంబ్లీ, శాసనమండలి, పార్లమెంట్ ఉభయ సభల్లోనూ రిజర్వేషన్లు కల్పించాలని ఏళ్ల తరబడి పోరాడుతున్నామన్నారు. "ఎవరి వాటా మాకు అక్కర్లేదు.. మా వాటా మాకు కావాలి" అనే నినాదం యావత్ బీసీ సమాజం సంకల్పమన్నారు. దేశ జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న వర్గాల ఆత్మగౌరవాన్ని, ఆకాంక్షలను ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఆవిష్కరించిందని ఈటల అన్నారు. ఈ డిమాండ్‌ను చట్టసభల్లో ప్రవేశపెట్టి, తప్పకుండా అమలు చేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు.

తర్వాత చదవండి