TG: మెరుగైన వైద్యం కోసం ఎంతో ఆశతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి వచ్చిన రోగులకు ఊహించని కష్టం ఎదురైంది. ఆసుపత్రిలోని అత్యంత కీలకమైన మిలీనియం బ్లాక్‌లో గురువారం సాయంత్రం నుంచి అకస్మాత్తుగా నీటి సరఫరా ఆగిపోవడంతో రోగులు, వారి వెంట వచ్చిన కుటుంబ సభ్యులు అక్షరాలా నరకయాతన అనుభవించారు.
సాయంత్రం వేళ ఒక్కసారిగా నల్లాల్లో చుక్క నీరు కూడా రాకపోవడంతో వార్డుల్లో పరిస్థితి దారుణంగా మారింది. వాష్‌రూమ్‌లు వాడుకోవడానికి వీల్లేకపోవడంతో ఇన్‌పేషెంట్లు తీవ్ర అవస్థలు పడ్డారు. ముఖ్యంగా ఆపరేషన్లు చేయించుకుని బెడ్ మీదే ఉన్నవారు, నడవలేని స్థితిలో ఉన్న రోగులు కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా లేక విలవిలలాడిపోయారు. గంటల తరబడి నీళ్లు రాకపోవడంతో, రోగుల బంధువులు బయట షాపుల నుంచి నీళ్ల క్యాన్లు, బాటిళ్లు కొనుక్కుని తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అంత పెద్ద ఆసుపత్రిలో కనీసం నీళ్ల సరఫరా కూడా సరిగ్గా లేకపోవడంపై రోగుల బంధువులు సిబ్బంది తీరుపై మండిపడ్డారు.
మరోవైపు, నీళ్లు లేక వైద్య సేవలు ఆగిపోయాయంటూ ప్రచారం జరగడంతో నిమ్స్ ఉన్నతాధికారులు స్పందించారు. సాంకేతిక లోపం వల్ల కేవలం మిలీనియం బ్లాక్‌లో మాత్రమే దాదాపు రెండు గంటల పాటు నీటి సరఫరాకు బ్రేక్ పడిందని వివరణ ఇచ్చారు. విషయం తెలిసిన వెంటనే మెయింటెనెన్స్ సిబ్బంది మరమ్మతులు పూర్తి చేసి, మళ్లీ నీళ్లు వచ్చేలా చేశారని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం అంతా సాధారణంగానే ఉందని అధికారులు చెబుతున్నా, వేలాది మంది రోగులు ఉండే నిమ్స్ లాంటి ఆసుపత్రిలో ముందస్తు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
