ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో భారీ అక్రమాలు
రూ. 40.96 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం
క్రిమినల్ కేసులు, మనీలాండరింగ్ కోణంపై విచారణ
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకురాలు అజ్మీరా రేఖా నాయక్ నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు శుక్రవారం ఉదయం మెరుపు దాడులు చేపట్టారు. మొత్తం రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. దాదాపు రూ. 40.96 కోట్ల విలువైన కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) ధాన్యం అక్రమాల కేసుకు సంబంధించి ఈడీ బృందాలు రంగంలోకి దిగడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఉదయం 6 గంటల నుంచే అధికారుల బృందాలు ఆమె నివాసానికి చేరుకుని కీలక ఆర్థిక పత్రాలు, బ్యాంకు లావాదేవీల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.
ఖానాపూర్ మండలం సత్తెనపల్లి గ్రామంలో రేఖా నాయక్ యాజమాన్యంలోని 'ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్' (ARS Industries) రైస్ మిల్లులో ప్రభుత్వ ధాన్యం భారీగా మాయమైనట్లు గతంలోనే వెలుగులోకి వచ్చింది. 2022-23, 2023-24, 2024-25 యాసంగి సీజన్లలో మిల్లింగ్ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ధాన్యంలో ఏకంగా 9,639.962 మెట్రిక్ టన్నుల కొరత ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీల్లో గుర్తించారు. మాయమైన ఈ ధాన్యం విలువ రూ.40.96కోట్లు ఉంటుందని నిర్ధారించిన జిల్లా పౌరసరఫరాల సంస్థ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పౌరసరఫరాల శాఖ ఫిర్యాదు మేరకు గత ఆగస్టులోనే ఖానాపూర్ పోలీసులు రేఖా నాయక్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 316(2), 316(5), 318(4) తో పాటు నిత్యావసర సరుకుల చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ అధికారులు, ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించి ఆర్జించిన కోట్లాది రూపాయలను ఎక్కడికి తరలించారు, ఇందులో మనీలాండరింగ్ (Money Laundering) కోణం ఏమైనా ఉందా? అనే అంశాలపై లోతుగా ఆరా తీస్తున్నారు.
తనిఖీల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రేఖా నాయక్ నివాసం, పరిసర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ఇంటి లోపలికి అనుచరులను గానీ, ఇతరులను గానీ అనుమతించకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఒకవైపు విజిలెన్స్ విచారణ, మరోవైపు ఈడీ సోదాలు ముమ్మరం కావడంతో ఖానాపూర్ నియోజకవర్గంలో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
