అమెరికా పర్యటనలో రాహుల్ వ్యాఖ్యల కలకలం
ప్రపంచ రాజకీయాల్లో భారత్ సైడ్ ప్లేయరంటూ కామెంట్లు
పాక్ తో భారత్ ను పోల్చిన రాహుల్!
పాక్ ఫ్యాన్ బాయ్ అంటూ బీజేపీ ఎదురుదాడి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎప్పుడు విదేశీ పర్యటనకు వెళ్లినా ఏదో ఒక వివాదం వెంటాడుతూనే ఉంటుంది. పార్టీ తరఫున విదేశాలకు వెళ్లిన ప్రతిసారీ.. భారత్ పరువు తీస్తున్నారంటూ బీజేపీ విమర్శలు గుప్పిస్తుంటుంది. ఇప్పుడు కూడా మరోసారి అలాంటి వివాదమే వెంటాడుతోంది రాహుల్ ని. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత.. వరుసపెట్టి సమావేశాలు నిర్వహిస్తున్నారు. యూనివర్శిటీల్లో విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లు, ప్రొఫెసర్లతో సమావేశమవుతున్నారు. అంతర్జాతీయ రాజకీయాలపై మాట్లాడుతున్నారు. భారత్ లో నెలకొన్న పరిస్థితులపైనా గళం విప్పుతున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును అంతర్జాతీయ వేదికలపై ఎండగడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ.. కొన్నిసార్లు ఆయన చేస్తున్న కామెంట్లు కాక పుట్టిస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ చికాగో వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు భారత్ విదేశాంగ విధానంపై చర్చను రగిలించాయి. భారత్‌ను 'సైడ్ ప్లేయర్'గా అభివర్ణించిన రాహుల్‌పై బీజేపీ తీవ్రంగా విరుచుకుపడింది. పాకిస్థాన్‌పై ఆయనకు అంత ప్రేమ ఎందుకంటూ ఎదురుదాడికి దిగింది. దేశ అంతర్జాతీయ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారంటూ మండిపడింది. ఇంతకీ రాహుల్ చేసిన ఆ కామెంట్స్ ఏంటి..?
భారత్ సైడ్ ప్లేయరా..?
ఒకప్పుడు అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉండేదని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. వివిధ దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు కొనసాగిస్తూనే.. అంతర్జాతీయ పరిణామాలపై భారత్‌కు సొంత ఆలోచన, స్వతంత్ర వైఖరి ఉండేవని చెప్పారు. ప్రపంచ రాజకీయాల్లో భారత్ తనదైన గొంతును వినిపించేదని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోందన్నది రాహుల్ వాదన. ప్రపంచ రాజకీయాల్లో భారత్ చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని, తన పరిమాణం, జనాభా, ఆర్థిక సామర్థ్యానికి తగ్గట్టుగా అంతర్జాతీయ చర్చల్లో కీలక పాత్ర ఉండాలని రాహుల్ ఆకాంక్షించారు. కానీ.. భారత్ ఇప్పుడు సైడ్ ప్లేయర్‌గా మిగిలిపోతోందని వ్యాఖ్యానించారు.
ఇదే క్రమంలో పాక్ ను ఉదాహరణగా తీసుకొచ్చారు. పాకిస్థాన్.. అమెరికా, ఇరాన్‌లతో దౌత్యపరమైన చర్చలు జరుపుతోందని ప్రస్తావిస్తూ.. మన పొరుగు దేశం అంతర్జాతీయ వ్యవహారాల్లో చురుగ్గా వ్యవహరిస్తుంటే భారత్ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇక్కడే రాహుల్ మరో కీలక కామెంట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీకి స్నేహం ఉందని చెబుతుంటారని, కానీ అంతర్జాతీయ రాజకీయాలు వ్యక్తిగత స్నేహాల ఆధారంగా నడవవని అన్నారు. దేశ ప్రయోజనాలే విదేశాంగ విధానానికి బేస్ కావాలని తేల్చిచెప్పారు.
పాక్ తో పోలుస్తారా అంట బీజేపీ ఫైర్
రాహుల్ చేసిన ఈ కామెంట్లు బీజేపీకి రాజకీయ అస్త్రంగా మారాయి. విదేశీ గడ్డపై నిలబడి భారత అంతర్జాతీయ ప్రతిష్ఠను తక్కువ చేసి మాట్లాడుతున్నారని కమలం పార్టీ నేతలు నిప్పులు చెరిగారు. ముఖ్యంగా పాకిస్థాన్‌తో భారత్‌ను పోల్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ రాజకీయాలపై అవగాహన లేని వ్యక్తిలా రాహుల్ మాట్లాడుతున్నారని విమర్శించారు. పాకిస్థాన్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తున్నట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. మోదీ నాయకత్వంలో భారత్ విశ్వగురువుగా ఎదుగుతోందని, ఆ గుర్తింపును కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాక్ అంటే ఎందుకంత ప్రేమ..?
ఇక్కడ రాహుల్ ను కార్నర్ చేసేందుకు బీజేపీ నేతలు... పాక్ ను తెరపైకి తెస్తున్నారు. రాహుల్ గాంధీకి పాకిస్థాన్‌పై అంత ఆసక్తి ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై ఆయన వ్యవహారశైలి పాక్ ఫ్యాన్‌బాయ్‌లా ఉందంటూ ఎద్దేవా చేస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో భారత్ దౌత్యపరమైన ప్రయత్నాలు చేసిందని గుర్తుచేస్తున్నారు.
పాకిస్తాన్ తో చర్చలా- రాహుల్
ఇక పాకిస్తాన్ తో చర్చల విషయంలో రాహుల్ తన వైఖరిని స్పష్టం చేశారు. ఉగ్రవాదం ఆగితేనే ఆ ప్రతిపాదన ముందుకెళ్తుందన్నారు. సరిహద్దు దాటి ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం, ప్రోత్సహించడం ఆ దేశం మానేయాలని స్పష్టం చేశారు రాహుల్. అమాయక భారతీయులు ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోతుంటే.. అదే సమయంలో పాకిస్థాన్‌తో చర్చలు జరపడం సాధ్యం కాదన్నారు. ఉగ్రవాదానికి మద్దతు నిలిచిపోయినప్పుడే చర్చలకు మార్గం తెరుచుకుంటుందని చెప్పారు.
ఇక్కడ రాహుల్ వైఖరిలో ఒక క్లారిటీ కనిపిస్తోంది. పాకిస్థాన్‌తో సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలన్నది ఆయన వాదన కాదు. కానీ ఉగ్రవాదంపై పాకిస్థాన్ తన వైఖరిని మార్చుకోకుండా చర్చలు సాధ్యం కాదన్నది మాత్రం ఆయన అభిప్రాయం. ఇదే కాంగ్రెస్ స్టాండ్ కూడా.
కాంగ్రెస్ ఫారిన్ పాలసీ ఏంటి..?
అమెరికాలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చనే తెరపైకి తెస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ విదేశాంగ విధానాలపై ఒక్కొక్కరూ ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. భారత్ అంతర్జాతీయంగా బలమైన శక్తిగా ఎదుగుతోందా? లేక తన వ్యూహాత్మక స్వతంత్రతను కోల్పోతోందా? ఇవే ఇప్పుడు రాహుల్ తెరపైకి తెచ్చిన వాదనలు
ఒకవైపు మోదీ ప్రభుత్వం భారత్‌కు ప్రపంచ వేదికలపై పెరుగుతున్న గుర్తింపును, వివిధ దేశాలతో వ్యూహాత్మక సంబంధాలను తమ విజయంగా చెబుతోంది. మరోవైపు కాంగ్రెస్.. విదేశాంగ విధానం వ్యక్తిగత సంబంధాల చుట్టూ తిరగకూడదని, దేశ ప్రయోజనాలే కేంద్రంగా ఉండాలని వాదిస్తోంది. అయితే ఈ చర్చలో పాకిస్థాన్‌తో పోలికే అత్యంత వివాదాస్పద అంశంగా మారింది. ఒక దేశం అంతర్జాతీయంగా ఎంత ప్రభావం చూపుతోందో నిర్ణయించేది కేవలం ఎన్ని దేశాలతో చర్చలు జరుపుతోందన్నది మాత్రమే కాదు. ఆ దేశ ఆర్థిక బలం, సైనిక సామర్థ్యం, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, అంతర్జాతీయ నిర్ణయాలపై చూపగల ప్రభావం కూడా కీలకమే.
అందుకే రాహుల్ చేసిన విమర్శలకు రాజకీయ సమాధానాలు ఇవ్వడం మాత్రమే కాకుండా.. భారత్ అంతర్జాతీయంగా సాధించిన దౌత్య విజయాలు, ఎదుర్కొంటున్న సవాళ్లపై కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ప్రపంచ వేదికపై భారత్ స్థానం చుట్టూ ఇప్పుడు రాజకీయ పోరు మొదలైంది. ఇది కేవలం మోదీ వర్సెస్ రాహుల్ పోరాటం కాదు.. భారత్ విదేశాంగ విధానం ఎలా ఉండాలనే అంశంపై జరుగుతున్న కీలక చర్చ కూడా. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే కాదు... మిగిలిన రాజకీయ పార్టీలు కూడా తమ వాదన వినిపించే అవకాశముంది.
